బోడుప్పల్‌లో భారీ అగ్నిప్రమాదం..మూడు కార్లు దగ్ధం

posted on: Jun 4, 2026 8:20PM

 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బోడుప్పల్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. బోడుప్పల్‌లోని ఓ ఖాళీ స్థలంలో మూడు కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అదే ప్రాంతంలో చెత్త కూడా పేరుకుపోయి ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకు నిప్పంటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మంటలు ఒక్కసారిగా పెద్దఎత్తున చెలరేగి సమీపంలో పార్క్ చేసిన కార్లకు వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో మూడు కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 

భారీగా ఎగసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో పాటు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే మూడు కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, వాహనాలు దగ్ధం కావడంతో వాటి యజమానులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెత్తకు నిప్పంటించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...