అమెరికా వలస విధానంలో పెను మార్పులు... గ్రీన్ కార్డ్ అంత వీజీ కాదు!

posted on: May 23, 2026 2:41PM

అమెరికాలో శాశ్వత నివాస హక్కు లేదా గ్రీన్ కార్డ్ పొందాలనుకునే విదేశీయులకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సీఐఎస్)  తాజాగా విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం, అమెరికా గడ్డపై ఉంటూనే వీసా హోదాను మార్చుకునే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ (ఏఓఎస్) విధానాన్ని అత్యంత కఠినతరం చేశారు. ఇప్పటివరకు చాలా మంది తాత్కాలిక వీసాలపై అమెరికా వెళ్లి..  అక్కడే ఉంటూ గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసుకోవడం సర్వసాధారణంగా సాగుతోంది. అయితే ఇకపై ఈ ప్రక్రియను కేవలం అత్యంత అరుదైన, అసాధారణమైన సందర్భాలలో మాత్రమే అనుమతిస్తామని ఇమ్మిగ్రేషన్ విభాగం స్పష్టం చేసింది. ఈ సరికొత్త నిర్ణయం వల్ల అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్న వేలాది మంది విదేశీయుల భవిష్యత్తు ప్రణాళికలు తలకిందులు కానున్నాయి.  

ఈ తాజా నిబంధనల ప్రభావం అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, పర్యాటకులు, తాత్కాలిక ఉద్యోగులతో పాటు ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై తీవ్రస్థాయిలో పడనుంది. సాధారణంగా ఎఫ్-1 స్టూడెంట్ వీసా లేదా బి-1, బి-2   టూరిస్ట్ వీసాల ద్వారా అమెరికాలో అడుగుపెట్టిన వారు..  తమ వీసా గడువు ముగిసేలోగా అక్కడే ఉండి గ్రీన్ కార్డ్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకునే రూట్‌ను ఇకపై పూర్తిగా మూసివేసినట్లయింది. కొత్త మెమో ప్రకారం, తాత్కాలిక వీసాదారుల పరిమితి ముగిసిన వెంటనే వారు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

ఒకవేళ వారు అమెరికాలోనే ఉండి స్టేటస్ మార్చుకోవాలని భావిస్తే, దానికి బలమైన మానవతా దృక్పథం లేదా వేరే ఇతర అసాధారణ కారణాలు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉంటుంది.  ఐటీ రంగానికి చెందిన నిపుణులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ , ఎల్-1 , ఓ-1  వంటి డ్యూయల్ ఇంటెంట్ వీసా హోల్డర్లకు సైతం ఈ కొత్త నిబంధనల నుంచి పూర్తి ఉపశమనం లభించడం లేదు. చట్టబద్ధంగా వీరికి గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కు ఉన్నప్పటికీ, అమెరికాలోనే ఉంటూ ఇమ్మిగ్రేషన్ హోదాను మార్చుకోవడం ఇకపై స్వయంచాలక  హక్కుగా పరిగణించబడదని అధికారులు తేల్చి చెప్పారు. ప్రతి దరఖాస్తును ఇమ్మిగ్రేషన్ అధికారులు అత్యంత క్షుణ్ణంగా, కేస్-బై-కేస్ పద్ధతిలో పరిశీలిస్తారు. ఒకవేళ కాన్సులర్ ప్రాసెసింగ్ ద్వారా స్వదేశం నుండి దరఖాస్తు చేసుకునే అవకాశం సదరు అభ్యర్థికి ఉంటే.. అమెరికాలో సమర్పించిన వారి దరఖాస్తును తిరస్కరించి, వారిని సొంత దేశానికి పంపించే అధికారం అధికారులకు ఉంటుంది.  ఈ మార్పులు ముఖ్యంగా అమెరికాలోని ఇండియన్ ఐటీ నిపుణులు, విద్యార్థులపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. 

దీర్ఘకాలిక ఉద్యోగ భద్రత, కుటుంబ స్థిరత్వం కోసం ఆశ పడుతున్న వారు ఇకపై కాన్సులర్ ప్రాసెసింగ్ మార్గాన్ని ఎంచుకోవాల్సి రావచ్చు. దీనితో పాటు, అమెరికా పౌరులు లేదా గ్రీన్ కార్డ్ కలిగి ఉన్న వారి కుటుంబ సభ్యుల పునర్మిళన ప్రక్రియ కూడా ఈ నిబంధనల వల్ల ఇబ్బందుల్లో పడనుంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న బ్యాక్‌లాగ్‌ల కారణంగా అమెరికాలోనే వేచి చూస్తున్న కుటుంబ సభ్యులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా మానవతా సంక్షోభాలు వంటి అసాధారణ కారణాలు లేకుంటే..  వారు తమ స్వదేశాలకు వెళ్లి వీసా ప్రాసెసింగ్ ముగిసే వరకు వేరుగా ఉండక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు.  వలస చట్టాలను ఉల్లంఘించిన వారి పట్ల యూసీఐఎస్ ఈసారి అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించనుంది. అనుమతించిన సమయం కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉండిపోయిన వారు,    చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఉద్యోగాలు చేసిన వారు ఈ కొత్త పాలసీ వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారికి అధికారుల విచక్షణనను ఉపయోగించి ఇచ్చే ఆమోదాలు  దక్కడం ఇకపై దాదాపు అసాధ్యంగా మారుతుంది. 

అయితే.. ఈ కఠిన నిబంధనల నుంచి ఆశ్రయం పొందిన శరణార్థులు, మానవ అక్రమ రవాణా లేదా తీవ్ర నేరాల బారిన పడి రక్షణ పొందుతున్న బాధితులకు మాత్రం మినహాయింపు లభించింది. వీరికి సంబంధించిన చట్టబద్ధమైన హక్కులు ఎప్పటిలాగే కొనసాగుతాయని ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది.  ఈ విధానపరమైన మార్పు కేవలం దరఖాస్తుదారులకే కాకుండా..  ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలను చూసే అధికారులపై కూడా భారీ అడ్మినిస్ట్రేటివ్ భారాన్ని పెంచనుంది. గతంలో లాగా ఒకే తరహా టెంప్లేట్ ఫార్మాట్లలో దరఖాస్తులను తిరస్కరించడం ఇకపై కుదరదు. ఏదైనా దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తే, సదరు అధికారి పూర్తి స్థాయి విశ్లేషణతో కూడిన నివేదికను రాయాల్సి ఉంటుంది. అందువల్ల గ్రీన్ కార్డ్ నిర్ణయ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది. అమెరికా రాజకీయ వాతావరణంలో వలసల నియంత్రణపై వస్తున్న ఒత్తిడికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తాత్కాలిక అనుమతులతో దేశంలోకి ప్రవేశించి, దాన్ని సులభంగా శాశ్వత నివాసంగా మార్చుకునే పద్ధతికి స్వస్తి పలికేందుకే ఈ సరికొత్త తాత్త్విక మార్పును తెచ్చినట్లు స్పష్టమవుతోంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...