మౌలిక వసతుల రంగంలో పెను మార్పులు.. ఇండియా వృద్ధిరేటు.. సవాళ్లు!

posted on: Jun 8, 2026 3:08PM

భారతదేశ ఆర్థిక, సామాజిక రంగాలలో మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది. గత దశాబ్ద కాలంగా దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం ఒక పెద్ద విప్లవాత్మక మార్పును సంతరించుకుందని అధికారిక గణాంకాలు,  ప్రభుత్వ ప్రచారాలు స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నుండి ప్రారంభించి ఎక్స్‌ప్రెస్‌వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల సామర్థ్యం,  గ్రామీణ గృహాల కల్పన వరకు అనేక రంగాలలో ఊహించని రీతిలో వృద్ధి నమోదైంది. అయితే..  ఈ బృహత్తర ప్రగతి ప్రయాణం కేవలం విజయాలకే పరిమితం కాలేదని, దీని వెనుక భూసేకరణ వివాదాలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య పెరుగుతున్న అసమానతలు వంటి అనేక సంక్లిష్ట సవాళ్లు కూడా దాగి ఉన్నాయి.  

చారిత్రక కోణంలో పరిశీలిస్తే, 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం దేశంలో మౌలిక రంగ పెట్టుబడులు పెరిగినప్పటికీ, రవాణా, విద్యుత్ రంగాల విస్తరణ చాలా నెమ్మదిగా సాగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు, గ్రామీణ రోడ్ల అనుసంధానత వంటి పథకాల ద్వారా కొంత పునాది వేసినప్పటికీ, 2014 తర్వాతి కాలంలో ఈ రంగానికి సరికొత్త వ్యూహాత్మక దిశానిర్దేశం లభించింది. పిఎం గతిశక్తి, భారతమాల, సాగర్‌మాల, ఉడాన్ మరియు జల్ జీవన్ మిషన్ వంటి భారీ లక్ష్యాలతో కూడిన పథకాలను మిషన్ మోడ్‌లో అమలు చేయడం ద్వారా దేశ ఆర్థిక రూపాంతరానికి ఒక కొత్త నారేటివ్‌ను సృష్టించారు.  గత పన్నెండేళ్ల కాలక్రమాన్ని పరిశీలిస్తే, భౌతిక,  డిజిటల్ కనెక్టివిటీ పరంగా దేశం మైలురాళ్లను అధిగమించింది.

ముఖ్యంగా యూపీఐ ఆధారిత డిజిటల్ లావాదేవీలు 2014 నాటి పరిమిత స్థాయి నుండి నేడు నెలకు 18 బిలియన్లకు పైగా చేరి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. రవాణా రంగంలో జాతీయ రహదారుల నిర్మాణ వేగం రోజుకు సుమారు 12 కిలోమీటర్ల నుండి 34 కిలోమీటర్ల స్థాయికి పెరగడం విశేషం. రైల్వే విద్యుద్దీకరణ సైతం మూడు రెట్లు పెరిగి 65 వేల కిలోమీటర్లు దాటింది. పట్టణ ప్రాంతాలలో మెట్రో రైలు వ్యవస్థలు 250 కిలోమీటర్ల నుండి వెయ్యి కిలోమీటర్లకు పైగా విస్తరించి నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేశాయి. అదే విధంగా విమానాశ్రయాల సంఖ్య 74 నుండి 160 దాటడం, పోర్టుల సామర్థ్యం 3.4 రెట్లు పెరగడం వంటివి పారిశ్రామిక ఎగుమతులకు, లాజిస్టిక్స్ రంగానికి భారీ ఊతం ఇచ్చాయి.  మరోవైపు.. ఇటువంటి మెగా ప్రాజెక్టుల నిర్వహణలో చట్టపరమైన, నియంత్రణ రమైన ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. 2013 నాటి భూసేకరణ చట్టానికి కొన్ని రాష్ట్రాలు చేసిన సవరణలు ప్రాజెక్టులను వేగవంతం చేసినప్పటికీ..  క్షేత్రస్థాయిలో రైతులు, గిరిజన ప్రాంతాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. 

అలాగే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య నమూనాలలో  అంటే పీపీలో కొన్నిచోట్ల ఆర్థిక భారమంతా ప్రభుత్వంపైనే పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంధన భద్రత కోసం బొగ్గు ఉత్పత్తిని 1 బిలియన్ టన్నులకు పెంచడం, సోలార్,  పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని వంద గిగావాట్లకు పైగా విస్తరించడం పర్యావరణ లక్ష్యాల పరంగా సానుకూలమైనప్పటికీ..  గ్రిడ్ స్థిరత్వం, మైనింగ్ ప్రాంతాల సామాజిక సమస్యల రూపంలో కొత్త సవాళ్లు ముంచుకొస్తున్నాయి.  సామాజిక, రాజకీయ కోణాల్లో ఈ మౌలిక వసతుల గణాంకాలు ఎన్నికల ప్రచారాలలో ప్రధాన ఆయుధాలుగా మారుతున్నాయి. స్వచ్ఛ భారత్ కింద 11 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం, జల్ జీవన్ మిషన్ ద్వారా 80 శాతానికి పైగా ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు ఇవ్వడం వంటివి కాగితాలపై గొప్ప మార్పును సూచిస్తున్నప్పటికీ.. నీటి లభ్యత లేకపోవడం, నిర్వహణ లోపాల వల్ల కొన్ని గ్రామాలలో వీటి వినియోగం ఆశించిన స్థాయిలో లేదని స్వతంత్ర అధ్యయనాలు చెప్తున్నాయి. 

డిజిటల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 95 కోట్లు దాటినప్పటికీ, గ్రామీణ ప్రాంతాలలో నెట్ స్పీడ్, డిజిటల్ అక్షరాస్యత లోపాలు క్షేత్రస్థాయిలో 'డిజిటల్ డివైడ్' (అసమానత)ను స్పష్టం చేస్తున్నాయి. పెద్ద ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రో ప్రాజెక్టులు ఎక్కువగా పట్టణ ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల, గ్రామీణ ఆరోగ్య, విద్యా మౌలిక వసతులు ఇంకా వెనుకబడే ఉన్నాయనే వాదన బలంగా ఉంది.  ఆర్థిక వృద్ధి రేటును,  జీవన ప్రమాణాలను ఈ మౌలిక రంగ విస్తరణ సానుకూలంగా ప్రభావితం చేసిన మాట వాస్తవమే. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడం వల్ల అంతర్జాతీయ సూచీలలో భారత్ ర్యాంకు మెరుగైంది. రక్షణ రంగ ఎగుమతులు కూడా 700 కోట్ల నుండి 23,000 కోట్ల రూపాయలకు పైగా పెరగడం వ్యూహాత్మకంగా దేశ బలాన్ని నిరూపిస్తోంది. పీఎం ఆవాస్ యోజన ద్వారా 4 కోట్లకు పైగా పేద కుటుంబాలకు గృహ వసతి కల్పించడం, మొబైల్ ఉత్పాదనలు ఏడాదికి 33 కోట్లకు చేరడం వంటివి  మేక్ ఇన్ ఇండియా' విజయాలకు ప్రతీకలుగా నిలిచాయి. భవిష్యత్తులో దేశం సెమీకండక్టర్ల తయారీ రంగంలో వేస్తున్న అడుగులు ఆర్థిక స్వావలంబనకు మరింత కీలకం కానున్నాయి.  

ఇక చివరిగా..   2014 నుండి 2026 మధ్య కాలంలో చోటుచేసుకున్న ఈ భారీ మార్పులు కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా..  దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించాయి. అయితే..  ఈ ప్రగతి ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు, సుదూర ప్రాంతాల ప్రజలకు, చిన్న రైతులకు సమానంగా చేరినప్పుడే వికసిత భారత్ లక్ష్యం పరిపూర్ణమవుతుంది. రాబోయే రోజుల్లో కేవలం వృద్ధి గణాంకాలపైనే కాకుండా, పారదర్శకమైన పరిపాలన, పర్యావరణ న్యాయం,  ప్రాంతీయ సమానత్వ సాధన దిశగా పాలసీ విధానాలు సాగాలని ప్రజా బాహుళ్యం ఆశిస్తోంది.   

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...