కాంగ్రెస్ అభ్యర్థికే మా మద్దతు.. అసదుద్దీన్ ఒవైసీ

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికలో మస్లిస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కే అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బీజేపీని నిలువరించేందుకే తాము జూబ్లీలో పోటీ చేయకుండా, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఒవైసీ తెలిపారు.  జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ శుక్రవారం (అక్టోబర్ 17) నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ముందు ఆయన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీనీ కలిసి మద్దతు కోరారు.

ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్ కూడా నవీన్ యాదవ్ వెంట ఉన్నారు.  ఆ సందర్భంగా ఒవైసీ నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉందనీ, ఆ పదేళ్లూ కూడా జూబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. అయితే నియోజకవర్గం మాత్రం ఇసుమంతైనా అభివృద్ధి చెందలేదని విమర్శించారు.  నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్న అసదుద్దీన్ ఒవైసీ.. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ అభివృద్ధికి ఒక అవకాశమన్నారు.   నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాలని నవీన్ యాదవ్‌కు సూచించారు. .

నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీచేసిన సంగతి తెలిసిందే.  గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయన్న ఒవైసీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత 5 నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని అసదుద్దీన్ గుర్తు చేశారు. నవీన్ యూదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2018లో నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu