దోపిడీ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు

posted on: Jun 6, 2026 3:24PM

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌకూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, ఆయన భార్య విజయలక్ష్మి ఇంట్లో జరిగిన దోపిడీ కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే, ఏప్రిల్ 25న నేపాల్‌కు చెందిన మీనా, సబీనా, రాజేష్ తదితరులు పనిమనుషులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చేరారు. ప్రారంభంలో వారు చాలా నమ్మకంగా, విశ్వాసంగా పని చేస్తూ యజమానుల మన్ననలు పొందారు. అంతేకాకుండా యజమానుల కుటుంబానికి, విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు కూడా నమ్మకం కలిగించారు.
అయితే, ఆ నమ్మకాన్నే అస్త్రంగా మార్చుకుని వారు దోపిడీకి పథకం వేశారు. గత నెల 11వ తేదీన మీనా తన బర్త్‌డే పేరుతో ఒక స్కెచ్ వేసి, చాంగ్, సామ్రాట్, బిశ్వాల్, కమల్, సునీత, శంకర్, రాజేష్, సబీనా వంటి వారితో కలిసి దోపిడీకి ప్లాన్ చేశారు. బర్త్‌డే పార్టీ సందర్భంగా అందరూ కలిసి వేడుక జరుపుకున్న తర్వాత, రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులైన మురళీధర్ మోహన్, విజయలక్ష్మి ఇచ్చిన ఆహారంలో మత్తుమందు కలిపారు.

అనంతరం వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు అదే సమయంలో దంపతులు భయంతో “మమ్మల్ని చంపొద్దు, మేము మిమ్మల్ని పిల్లల్లా చూసుకున్నాం” అని వేడుకున్నారు... అనంతరం దంపతులకు మత్తుమందు ఇచ్చి వారి కాళ్లు చేతులు కట్టేసి ఒక గదిలో బంధించి ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదు తీసుకుని పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం ఏడుగురు నిందితులు ఈ దోపిడీలో పాల్గొన్నట్లు గుర్తించారు. దోపిడీ అనంతరం వారు ఇతర రాష్ట్రాలకు పారిపోవడానికి ప్రయత్నించారు.

కానీ పోలీసులు వేగంగా చర్యలు తీసుకుని, గత నెల 16న బిశ్వాల్, కమల్, శంకర్‌లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. మిగతా ప్రధాన నిందితులు కూడా ఇతర రాష్ట్రాల మీదుగా నేపాల్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, సరిహద్దు వద్ద వారి ఫోటోలను అతికించామని సిపి సుమతి వెల్లడించారు. బార్డర్లో తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితులను తెచ్చాం నేపాల్ కు వెళ్లేందుకు నలుగు నిందితులు ప్రయత్నం చేస్తున్న అదే సమయంలో నిందితులను పట్టుకున్నామని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు.ఈ కేసులో మీనా గతంలో 2023లో మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసులో నిందితురాలిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చివరికి ప్రత్యేక ఆపరేషన్ ద్వారా మొత్తం నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సుమతి వెల్లడించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...