చెలరేగిన బుమ్రా..ఇంగ్లండ్ ఆలౌట్

  లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య మూడో టెస్టులో టీమిండియా పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు 251/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇంగ్లాండ్‌ రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఈ సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి మరో 102 పరుగులను ఇంగ్లాండ్‌ జోడించింది. ఆ మూడు వికెట్లనూ బుమ్రానే తన ఖాతాలో వేసుకున్నాడు. లంచ్ తర్వాత ఆర్చర్‌ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ సాధించాడు. ఒకదశలో 271కే ఏడు వికెట్లు పడినా.. బ్రాండన్ కార్సే(56), వికెట్ కీపర్ జేమీ స్మిత్‌(51)ల అసమాన పోరాటంతో స్టోక్స్ సేన కోలుకుంది. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారీ స్కోర్ అందించారు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన కార్సే.. సిరాజ్ సంధించిన స్లో బాల్‌కు బౌల్డ్ కావడంతో 387 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది.  
చెలరేగిన బుమ్రా..ఇంగ్లండ్ ఆలౌట్ Publish Date: Jul 11, 2025 7:24PM

కొత్త రేషన్​కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు

  తెలంగాణలో ఈనెల 14న తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.4లక్షల నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా 11.30లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణలో గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్‌ పంపిణీ చేసింది.  త్వరలో పంపిణీ చేయనున్న వాటితో కలిపి రేషన్‌కార్డుల సంఖ్య 94,72,422కి చేరనుంది. మొత్తంగా 3.14కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. రేషన్ కార్డుల జారీ నిరంతరం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల కార్డు రేషన్ కార్డులిస్తామని తెలిపారు. రేషన్‌కార్డుల మంజూరుతో నిరుపేదలకు భారీగా లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతోంది.
కొత్త రేషన్​కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు Publish Date: Jul 11, 2025 7:10PM

వీసా ఫీజుల బాదుడు.. మరో షాక్ ఇచ్చిన ట్రంప్

  బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై ఇటీవల సంతకం చేసిన అమెరిక అధ్యక్షుడు  ట్రంప్ భారత్ సహా ఇతర దేశాలకు మరో షాక్ ఇచ్చారు. వీసా ఫీజులను భారీగా పెంచారు. ఈ ఫీజు వల్ల భారతీయులపై సైతం తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రంప్ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్ యాక్ట్ కింద నాన్ ఇమిగ్రేషన్ వీసాల ఫీజును పెంచింది. ఈ ఫీజును రూ. 26 వేలకు పెంచింది. ఇది వచ్చే ఏడాది అంటే.. 2026 నుంచి అమల్లోకి రానుంది. యూఎస్ వెళ్లాలనుకునే భారతీయులకు సైతం ఈ ఫీజు చెల్లించాల్సి ఉంది. అంటే.. యూఎస్‌లో పర్యటన, ఉన్నత విద్య, ఉద్యోగం కోసం వెళ్లే వారు ఈ ఫీజు తప్పక చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పర్యాటన కోసం వెళ్లే వీసా ఫీజును రూ. 16 వేల నుంచి రూ. 40 వేలకు పెంచింది.  యూఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజ్ కింద 250 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 21,400 చెల్లించాలి. అయితే వీటిని వెనక్కి ఇవ్వరు. దీనికి సర్ ఛార్జ్ సైతం అదనంగా వసూల్ చేస్తారు. వీసా జారీ సమయంలో ఈ మొత్తాన్ని తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ ఫీజు ధరల్లో హెచ్చు తగ్గులు ఉండనున్నాయి.బీ 1, బీ 2 అంటే.. టూరిజం, బిజినెస్ వీసాలు.. ఎఫ్, ఎమ్ అంటే.. స్టూడెంట్ వీసాలు.. హెచ్ 1 బీ అంటే వర్క్ వీసాలు.. జె అంటే విజిటర్ వీసాలకు తప్పకుండా ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక డిప్లమాటిక్ వీసా కలిగిన వారికి అంటే.. ఏ, జీ వీసా కలిగి వారికి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, పర్యటకులు, వ్యాపారం కోసం ప్రయాణాలు చేసే వారిపై ఈ ఫీజుల ప్రభావం పడనుంది. బీ2 టూరిస్ట్ వీసా ఖర్చు ప్రస్తుతం సుమారు రూ. 15 వేలు ఉంటే.. దీనికి అదనంగా వీసా ఇంటిగ్రిటీ పీజు కింద రూ. 21 వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో మొత్తం ఖర్చు రూ. 35 వేల వరకు ఉండనుంది. 2025లో హెచ్ 1 బీ రిజిస్ట్రేషన్ ఫీజు స్వల్పంగా ఉంటే.. ప్రస్తుతం ఆ ధర భారీగా పెరిగినట్లు అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఈ తరహా ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల హెచ్ 1 బీ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గాయి.ఇక వీసా ఇంటిగ్రిటి ఫీజును కొన్ని సందర్భాల్లో మాత్రమే వెనక్కి చెల్లించనున్నారు. వీసా హోల్డర్ అమెరికాలో ఉన్న సమయంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కచ్చితంగా పాటించిన వారికి చెల్లించనున్నారు. అలాగే ఐ-94 గడువు ముగియడానికి ఐదు రోజుల కన్నా ముందుగా అమెరికాను విడిచి వెళ్లేవారికి తిరిగి చెల్లిస్తారు.  అదే విధంగా ఐ-94 గడువు కంటే ముందే చట్టపరంగా కొనసాగించే వారితోపాటు శాశ్వత నివాస అనుమతి పొందిన వారికి కూడా ఈ ఫీజును తిరిగి చెల్లించే అవకాశముంది. వీసా దుర్వినియోగాన్ని అరికట్టేడంతోపాటు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రంప్ సర్కార్ ఈ కొత్త ఫీజు విధానాన్ని ప్రవేశపెట్టానంటోంది. అలాగే ఈ ఫీజు ద్వారా అమెరికా ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని సేకరించాలని చూస్తోంది. ఇది ఇమ్మిగ్రేషన్ సంబంధిత ఖర్చులు భరించడానికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది. కానీ ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఎంతో మంది అమెరికా వెళ్లాలనుకునే సామాన్యుల కలలను ఛిద్రం చేసినట్లు అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీసా ఫీజుల బాదుడు.. మరో షాక్ ఇచ్చిన ట్రంప్ Publish Date: Jul 11, 2025 6:37PM

కుక్కల దాడి... క్రిందపడి 4 ఏళ్ల పాప మృతి

  నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప ఎస్సీ కాలనీలో కుక్కల దాడిలో క్రిందపడి చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామంలో జయరాముడు, రామేశ్వరి దంపతులకు కూతురు మధుప్రియ ( 4 సంవత్సరాల) పై వీధి కుక్కలు గుంపు ఒకసారిగా దాడి చేయడం జరిగింది. తీవ్ర భయాందోళనకు గురైన పాప  పరుగులు పెడుతూ కింద పడింది.వెంటనే గమనించిన స్థానికులు కుక్కలను తరిమి పాపను రక్షించారు. అప్పటికే సృహ కోల్పోయిన పాపను బనగానపల్లె ఏరియా ఆసుపత్రికి తీసుకొని వెళ్లడం జరిగింది.ఆస్పత్రి నందు చికిత్స పొందుతూ పాప మృతి చెందింది. బాదిత బంధువులు మీడియాతో మాట్లాడుతూ... గ్రామంలోని ఎస్సీ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం  వల్ల భయాందోళనకు గురవుతున్నామన్నారు. నంద్యాల, బనగానపల్లె వైపు వెళ్లే ద్విచక్ర వాహనాలపై కుక్కలు దాడికి చేస్తున్నాయన్నారు.బాధిత కుటుంబం మరొకరికి ఇలాంటి కష్టం రాకుండా అధికారులు చూడాలని వేడుకుంటున్నారు.అదేవిధంగా ప్రధాన రహదారిపై ఉన్న స్కూల్ ఎదుట స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నామని రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేయించాలని  అధికారులను గ్రామస్తులు కోరుకుంటున్నారు.  
కుక్కల దాడి... క్రిందపడి 4 ఏళ్ల పాప మృతి Publish Date: Jul 11, 2025 6:27PM

కొడాలి నాని మౌనం.. భయమా? జ్ణానోదయమా?

అధికారంలో ఉన్నంత కాలం తప్పొప్పులు, మంచిచెడులు అన్న తేడా లేకుండా ఇష్టారీతిగా బూతులుతో రెచ్చిపోయిన మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని, వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాట్లాడడమే మరిచిపోయాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేంత నిశబ్దాన్ని..  అదేనండీ మౌనాన్ని పాటిస్తున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. ఆ అధికారం అండ చూసుకుని తెలుగుదేశం అధినాయకత్వంపైనా, జనసేనానిపైనా నోటికి అడ్డూ అదుపూ లేదన్న రీతిలో రెచ్చిపోయిన కొడాలి నాని.. రాష్ట్రంలో వైసీపీ ఓటమి, గుడివాడలో తన ఓటమి తరువాత దాదాపు అడ్రస్ లేకుండా పోయారు. ఓటమి తరువాత ఇంచుమించు ఏడాది పాటు తనను వరుసగా ఐదు సార్లు గెలిపించిన గుడివాడ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేదు. అధికారంలో ఉన్న సమయంలో  విపక్ష పార్టీల నాయకులపై బూతుల వర్షం కురిపించడం తన హక్కు అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని.. ఆ అధికారం దూరమయ్యేసరికి నోరెత్తితే ఓట్టు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నానిలో ఈ మార్పు జ్ణానోదయమా? అని కొందరు ఒకింత అనుమానపడ్డారు కూడా.. కానీ అది జ్ణానోదయం కాదనీ, జాగ్రత్త మాత్రమేననీ కొడాలి నానే ఒక సందర్భంగా మీడియా ముందు వెల్లడించారు. తాను మౌనంగా ఉండటానికి కారణం అధకారం లేకపోవడమే తప్ప.. మరోటి కాదని కుండబద్దలు కొట్టారు. ఒక సందర్భంలో మీడియాతో ముక్తసరిగా మాట్లాడిన నాని జనం తమ అధికారాన్ని పీకేశారనీ, అంటే ఉద్యోగం నుంచి తొలగించారనీ అందుకే మౌనంగా ఉన్నాననీ చెప్పారు. అది కూడా గత ఫిబ్రవరిలో అప్పటికి రిమాండ్ ఖైదీగా ఉన్న తన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జనగ్ తో పాటుగా విజయవాడ జిల్లా జైలుకు వచ్చిన సందర్భంలో కొడాలి నాని ఓటమి తరువాత తొలి సారిగా మీడియాతో మాట్లాడారు. అప్పుడు కూడా తన శైలికి భిన్నంగా ఒక్క బూతు మాట కూడా లేకుండా అతి జాగ్రత్తగా మాట్లాడారు.  ఆ సందర్భంగానే జనం తన ఉద్యోగం పీకేశారనీ..అందుకే మాట్లాడటం లేదని చెప్పారు. అక్కడితో ఆగకుండా కేసులంటే భయం లేదని గప్పాలు పోయారు. అయితే పరిశీలకులు మాత్రం కొడాలి నానిది మేకపోతు గాంభీర్యం మాత్రమేననీ, ఏ క్షణంలో పోలీసులు అరస్టు చేస్తారా అన్న భయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించిందనీ అప్పట్లో విశ్లేషించారు. ఆ కారణంగానే  జగన్ ఆదేశించినా కూడా తెలుగుదేశం కూటమి సర్కార్ పై చిన్నపాటి విమర్శ కూడా చేయకుండా.. యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.   ఇదంతా పక్కన పెడితే.. తెలుగుదేశం కూటమి అధకారంలోకి వచ్చిన ఏడాది కాలం పూర్తయినా కొడాలి నాని అరెస్టు కాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు, కబ్జాలు, దౌర్జన్యాలు సహా కొడాలి నానిపై లేక్కలేనన్న ఫిర్యాదులు ఉన్నాయి. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఆయా కేసులలో నిందితులుగా ఉన్న పలువురు అరెస్టయ్యారు. అలా అరెస్టైన వారిలో నానికి అత్యంత సన్నిహితులుగా ఉణ్న వారు కూడా ఉన్నారు. అయినా కొడాలి నాని విషయంలో పోలీసులు అరెస్టు వరకూ వెళ్లకపోవడానికి కారణమేంటన్న చర్చ తెలుగుదేశం శ్రేణుల్లోనే జరుగుతోంది. అయితే అరెస్టు అవుతారు అన్న సమయంలో కొడాలి నాని అనారోగ్యం కారణంగా తొలుత హైదరాబాద్, ఆ తరువాత మంబై ఆస్పత్రులలో చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత నుంచీ ఏం మాట్లాడితే ఏ మౌతుందో అన్న భయంతో పూర్తిగా మౌనమునిలా మారిపోయారు. సరిగ్గా ఇక్కడే.. కూటమి ప్రభుత్వం కూడా కొడాలి నాని అరెస్టు విషయంలో తొందర ఎందుకు అన్నట్లు వ్యవహరిస్తున్నది. వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన గుడివాడ నియోజకవర్గంలోనే కొడాలి నాని పట్ల పిసరంతైనా సానుభూతి వ్యక్తం కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో.. అందునా ఆనారోగ్యంతో ఉన్న నానిని అరెస్టు చేసి ఆయనకు జనంలో సానుభూతిని ప్రోది చేసేలా వ్యవహరించడం ఎందుకు? అన్నట్లుగా తెలుగుదేశం కొడాలి నాని విషయంలో వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కొడాలి నాని మౌనం.. భయమా? జ్ణానోదయమా? Publish Date: Jul 11, 2025 4:39PM

ఛత్తీస్‌గడ్‌లో 22 మంది మావోలు లొంగుబాటు

  ఆపరేషన్ కగార్ దెబ్బకు మవోయిస్టులు దిగివచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ ఎదుట 22 మంది మవోలు లోంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోలపై రూ.37 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.  వీరు కుతుల, నెలనార్, ఇంద్రావతి ఏరియా కమిటీలలో క్రియాశీలకంగా ఉన్నారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు రూ.25,000 ఆర్థిక సహాయం, ఇళ్ళు, ఉపాధి వంటి పునరావాస సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. 2024 నుంచి బస్తర్‌లో 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. కాగా కొంత కాలంగా కేంద్రం మవోయిజంపై ఉక్కుపాదం మోపుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరిపారేస్తున్న సంగతి తెలిసిందే.
ఛత్తీస్‌గడ్‌లో  22 మంది మావోలు లొంగుబాటు Publish Date: Jul 11, 2025 4:35PM

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరైన రజత్ భార్గవ

  ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్‌ భార్గవ సిట్‌ ఎదుట హాజరయ్యారు. తన అనారోగ్యం రీత్యా రాలేనని సిట్ విచారణకు హాజరుకాలేనని ఉదయం ఆయన విచారణాధికారులకు సమాచారం పంపించారు. కానీ, తప్పనిసరిగా హాజరుకావాలని సిట్‌ స్పష్టం చేయడంతో ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో రజత్‌ భార్గవ ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. దీంతో లిక్కర్ పాలసీ విడుదలైన జీవోలు, లావాదేవీలు తదతర విషయాలపై సిట్‌ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు, అధికారుల్ని సిట్‌ విచారించి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరైన రజత్ భార్గవ Publish Date: Jul 11, 2025 4:15PM

బీసీలకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం : టీపీసీసీ చీఫ్‌

  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వడం తమ విజయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. బీసీ రిజర్వేషన్లు  కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటి? ఆమెను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. గత పదేళ్లు కేసీఆర్ ఏం వెలగబెట్టారని కవిత బీసీ పాట పాడుతున్నారు అని టీపీసీసీ చీఫ్‌ ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రేవంత్ సర్కార్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని చెప్పారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ ఎనలేని కృషి చేస్తోందని వివరించారు.  బీసీ రిజర్వేషన్లు రాహుల్‌ అజెండా, రేవంత్‌ నిబద్ధత’’ అని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఆర్టినెన్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తాము నిర్వహించతలపెట్టిన రైల్ రోకోను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్డినెన్సులు, బిల్లులు పంపితే సంతకాలు పెట్టకుండా గవర్నర్లు ఆపుతున్నారు. తెలంగాణలో అదే పరిస్థితి వస్తే మాకు ఉద్యమాలు కొత్తకాదని మళ్లీ ఉద్యమం చేస్తామని రైళ్లు, బస్సులను స్తంభింపచేస్తామన్నారు. ఆర్డినెన్స్ రూపంలో వెంటనే రిజర్వేషన్లు కల్పించాలన్న కేబినెట్ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కవిత అన్నారు.     
బీసీలకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం : టీపీసీసీ చీఫ్‌ Publish Date: Jul 11, 2025 3:38PM

తమిళ తెరపై తెలుగు రాజకీయం !

తమిళనాడు శాసన సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది.  ముఖ్యంగా.. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన  హీరో విజయ్, ఆయన స్థాపించిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ పరిస్థితి ఏమిటి?  తమిళ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రభావం ఎంత?  టీవీకే 2026 ఎన్నికల్లో ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేస్తుంది. అధికార డిఎంకే, ప్రధాన ప్రతిపక్షం ఎఐడిఎంకేల సారథ్యంలోని కూటములలో, ఏ కూటమిని ఏ మేరకు టీవీకే ప్రభావితం చేస్తుంది?  అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ జోరుగా సాగుతోంది. నిజానికి  ఇప్పడు తమిళనాడు రాజకీయాల గురించిన ఏ చర్చ వచ్చినా..  విజయ్ ప్రస్తావన లేకుండా ముగియడం లేదనడం ఇసుమంతైనా అతిశయోక్తి కాదు.   నిజానికి తమిళ రాజకీయాల్లో మొదటి నుంచి సినీతారల ప్రభావం బలంగా ఉంటూనే వుంది. హీరో ఇమేజ్ తో అనేక మంది ప్రముఖ హీరోలు రాజకీయ అరంగేట్రం  చేశారు. అయితే, సుక్సెస్ రేట్  చాల తక్కువ. విజయ్ కు ముందు ఐదేళ్ళ కిందట 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమలహాసన్  పొలిటికల్ ఎంట్రీ  ఇచ్చారు.  ఎంఎన్ఎం (మక్కల్ నీతి మైమ్) పార్టీని స్థాపించారు.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఆయనతో సహా ఎంఎన్ఎం టికెట్ పై పోటీ చేసిన ప్రతి ప్రతి ఒక్కరూ ఒడి పోయారు. ఎంఎన్ఎం ఖాతా తెరవలేదు. చట్ట సభల్లో కాలు పెట్టాలనే కమల్ హసన్  కల అప్పుడు  తీర లేదు. చివరకు డిఎంకే’ పంచన చేరి రాజ్యసభలో అడుగుపెట్టారు.  అయితే విజయ్ పరిస్ధితి కూడా అంతేనా.. అంటే కాక పోవచ్చని తమిళనాడు రాజకీయాలను దగ్గరగా చూస్తున్న పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు.. విజయ్ రాజకీయాలను కమలహసన్  రాజకీయంతో కంటే..  మెగా స్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానంతో పోల్చవచ్చని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మెగా స్టార్’ చిరంజీవి ప్లే చేసిన రోల్..  తమిళనాడులో విజయ్ ప్లే చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ గతిని మార్చి వేసిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నిజానికి,ఆ ఎన్నికల్లో పీఆర్పీ ఆశించిన మేరకు సీట్లు గెలుచుకోలేదు. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 18 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.  కానీ..  16.32శాతం  ప్రభుత్వ వ్యతిరేక ఓటును గణనీయంగా  శాతం  చీల్చడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ విజయానికి.. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి పరోక్షగా దోహదం చేసింది. ఆ తర్వాత మొత్తానికే చిరంజీవి  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి..  రాజ్యసభ సీటును, కేంద్రంలో మంత్రి పదవిని కానుకగా పొందారు. అది వేరే విషయం. ఆ ఎన్నికల్లో పీఆర్పీ ఎంట్రీ వలన.. అప్పటి  ప్రతిపక్ష  తెలుగు దేశం పార్టీ భారీగా నష్ట పోయింది. ఒకటి రెండు కాదు.. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ 235 స్థానాల్లో పీఆర్పీ, ప్రతిపక్ష టీడీపీ ఓటును 10,000 కంటే ఎక్కువ చీల్చించి.. వాటిలో 147 స్థానాల్లో 20,000 మరో 92 స్థానాల్లో 30.000 ఓట్లను చీల్చింది. మరో వంక ఇంచు మించుగా 40 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కేవలం 5000 ఓట్ల కంటే తక్కువ ఓట్ల తేడాతో అప్పటి ఎన్నికలలో ఓడిపోయింది. అదలా ఉంటే తాజా సర్వేల ప్రకారం హీరో విజయ్  పార్టీ ఓటు షేర్  16 శాతం క్రాస్ చేసింది. ఈ నేపధ్యంలో.. ఇదే ట్రెండ్ 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే,విజయ్ తమిళ చిరంజీవి అవుతారని అంటున్నారు. అయితే, విజయ్ పూర్తిగా ప్రతిపక్షం ఒటునే చీలుస్తారా? అధికార పార్టీ ఓటును కొల్లగొడతారా? అంటే..  రెండు ప్రధాన ద్రవిడ పార్టీలకు విజయన్ గండి కొట్టడం ఖాయమని అంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం ఉన్నందున ఈలోగా ఏదైనా జరగచ్చని.. విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా తమిళరాజకీయాలపై చెప్పుకోదగ్గ ఆసక్తి చూపుతున్నారు. నటిగా రోజాకు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉంది. గతంలో హీరోయిన్ గా ఆమెకు తమిళ ప్రేక్షకులు కూడా నీరాజనాలు పట్టారు. అంతకు మించి రోజా భర్త సెల్వమణి మంచి గుర్తింపు ఉన్న దర్శకుడు. తమిళ సినీరంగంలో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో రోజా తమిళ రాజకీయాలపై దృష్టి సారించారని అంటున్నారు.  గతంలో అంటే గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత కొంత కాలం పాటు రోజా పూర్తిగా తమిళనాడుకే పరిమితమయ్యారు. అప్పటిలోనే ఆమె విజయ్ పార్టీలో చేరి చక్రం తిప్పుతారన్న వార్తలు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపించాయి. అయితే తరువాత ఆమె యథా ప్రకారం వైసీపీ తరఫున మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి సర్కార్ పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాను ఒక వైపు ఏపీ రాజకీయాలలో ఉంటూనే , తన భర్త సెల్వమణిని విజయ్ పార్టీకి దగ్గర చేస్తున్నారని అంటున్నారు.  మొత్తం మీద రోజా ఏదో ఒక మేరకు తమిళ రాజకీయాలలోనూ తన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 
తమిళ తెరపై తెలుగు రాజకీయం ! Publish Date: Jul 11, 2025 3:22PM

టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలి : బండి సంజయ్

    తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికిపైగా అన్యమతస్తులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ దేవస్థానంలో 1000 మందికి పైగా అన్య మతస్తులు ఉన్నారు.. వాళ్ళను ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అన్ని మతాలు ఉండడానికి ఇది సత్రం కాదన్నారు. వారికి స్వామి వారి మీద విశ్వాసం, నమ్మకం లేదు.. హిందూ సనాతన ధర్మం మీద ఆలోచన లేదని కేంద్ర అన్నారు. అలాంటి వాళ్లకు టీటీడీలో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు.. వాళ్ళు ఇంకా ఎందుకు ఉద్యాగాల్లో కొనసాగుతున్నారని ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా? అని ప్రశ్నించారు.  ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాలనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో భూమిపూజ చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన బండి సంజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేని పురాతన ఆలయాలను గుర్తించి, టీటీడీ నిధులను కేటాయించి వాటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నానని అన్నారు. కొండగట్టు అంజన్న, ఇల్లందకుంట రామాలయం ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందునే ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోందని సంజయ్ అన్నారు. స్వామిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు సరికాదని అన్నారు. బొట్టు పెట్టుకుని వెళితే మసీదులు, చర్చిల్లో ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు. హిందువుల ఆస్తి తిరుమల. విదేశీయులు, అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి. దురద్రుష్టమేమిటంటే టీటీడీలో వెయ్యి మందికిపైగా ఇతర మతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి హిందు మతంపై, దేవుడిపై నమ్మకం లేదు. అట్లాంటోళ్లకు ఉద్యోగాలివ్వమేంటి? వాళ్లను కొనసాగించడమేంటి? ఇట్లాంటి పద్దతి మంచిది కాదు. ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోందిని ఆయన పేర్కొన్నారు
టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలి :  బండి సంజయ్ Publish Date: Jul 11, 2025 3:03PM

హెచ్‌సీఏ స్కాంలో దూకుడు పెంచిన సిఐడీ.. నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్!

హెచ్‌సీఏ స్కాంలో సీఐడీ స్పీడ్ పెంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత భర్త.. క్లబ్ కార్యదర్శి రాజేందర్ యాదవ్‌ చర్లపల్లి జైలులో ఉన్నారు. వీరందరినీ రిమాండ్‌కు తరలించింది సీఐడీ. అలాగే రిమాండ్ రిపోర్టులో నిందితులపై సీఐడీ సంచలన అభియోగాలు మోపింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు నియామకాన్నే తప్పుబట్టింది. మరింత దర్యాప్తు చేసేందుకు ఈ రోజు సీఐడీ అధికారులు కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. మరోవైపు నిందితులు కూడా బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ స్కాంలో అరెస్ట్ అయిన ఐదుగురిలో నలుగురు చర్లపల్లి జైలులో ఉండగా.. కవిత చంచల్‌ గూడ మహిళా జైలులో ఉన్నారు. ఈ ఐదుగురిని కస్టడీలోకి తీసుకుంటే హెచ్‌సీఏకు సంబంధించిన అవకతవకలు, హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సీఐడీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ స్కాంలో సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు సి.కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి జగన్మోహన్ రావు, రాజేందర్ యాదవ్, కవిత కలిసి శ్రీచక్ర క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఫోర్జరీ డాక్యమెంట్లను సృష్టించి.. ఆ క్రికెట్‌ క్లబ్‌కు జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా వ్యవహరించినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
హెచ్‌సీఏ స్కాంలో దూకుడు పెంచిన సిఐడీ.. నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్! Publish Date: Jul 11, 2025 2:46PM

ఈ జ‌గ‌న్మోహ‌న‌రావు ఎవ‌రో తెలుసా?

ఎవ‌రో ఊరూ పేరు లేని జ‌గ‌న్మోహ‌న రావు ఏ క్ల‌బ్ లో మెంబ‌ర్ కూడా కాని జ‌గ‌న్మోహ‌న రావు.. రాజ‌కీయ క్రీడ త‌ప్ప మ‌రే క్రీడా తెలియ‌ని జ‌గ‌న్మోహ‌న రావు.. ఇంత స్థాయికి తిమ్మిని బ‌మ్మిని చేసి ఇక్క‌డి వ‌ర‌కూ ఎలా వ‌చ్చారో మీకు తెలుసా?  ఇంతకీ ఈయ‌న మ‌రెవ‌రో కాదు హ‌రీష్ రావు పెద్ద‌మ్మ కొడుక‌ట‌. దీంతో అప్ప‌టి వ‌ర‌కూ గ‌డ్డం వినోద్, అజ‌ర్ చేతుల్లో ఉన్న హెచ్ సీ ఏ కాస్తా.. త‌న అధికార బ‌లం ఉప‌యోగించి.. అక్ర‌మంగా శ్రీ చ‌క్ర అనే ఒకానొక క్ల‌బ్ లో ఫోర్జ‌రీ సంత‌కాల‌తో మెంబ‌ర్ గా మారి.. ఆ పై కేవ‌లం 2 ఓట్ల తేడాతో  2023లో అధ్య‌క్షుడ‌య్యాడు. ఆ త‌ర్వాత  అయ్య‌గారి ఆగ‌డాలు ఏమంత త‌క్కువ లేవట. ఏకంగా  రూ. 170 కోట్ల‌కు టెండ‌ర్ పెట్టారు. బీసీసీఐ  నిధులు గోల్ మాల్ చేశారు. తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ చెప్పేదాన్నిబ‌ట్టీ చూస్తే.. అస‌లీ నాన్ ప్లేయ‌ర్స్ కి ఇలాంటి క్రీడా సంఘాల్లో ప‌నేంటి? అన్న‌దొక చ‌ర్చ. 1934 నాటి హెచ్ సీ ఏ.. చ‌రిత్ర గ‌త‌మెంతో ఘ‌నం. ఎంఎల్ జ‌య‌సింహ‌, అజ‌ర్, శివ‌లాల్ యాద‌వ్, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్, ప్ర‌జ్ఞాన్ ఓజా, అంబ‌టి రాయుడు వంటి మేటి క్రికెట‌ర్లు ప్రాతినిథ్యం వ‌హించిన సంఘం. ఇది బీసీసీఐకి అఫిలియేటెడ్. ఎన్నో రంజీ మ్యాచ్ ల‌లో   హైద‌రాబాద్ క్రికెట్ టీమ్ ని ఆడిస్తుంది హెచ్ సీఏ. దీని హోం గ్రౌండ్ ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియం. అలాంటి అసోసియేష‌న్లోకి ఎప్పుడైతే రాజ‌కీయ బేహారులు అడుగు పెడుతున్నారో అప్ప‌టి నుంచి ఇది పూర్తి ప‌త‌నావ‌స్త‌కు చేరుకునేలా ప‌య‌నిస్తోందని అంటారు. మీకు తెలుసా? ఇక్క‌డ ఆడేవాళ్ల‌ను ప‌క్క‌న  పెట్టి డ‌బ్బులిచ్చేవాళ్ల‌ను సెలెక్ట్ చేస్తుంటారట‌. ప్లేయ‌ర్స్ పేరంట్స్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ వీరు భారీ ఎత్తున డ‌బ్బు గుంజారట‌. అంతేనా మొన్న‌టి  మార్చిలో ఎస్ ఆర్ హెచ్ ని కూడా బ్లాక్ మెయిల్ చేశారు. అస‌లు గొడ‌వంతా బ‌య‌ట ప‌డిందే ఈ ఎస్ ఆర్ హెచ్, ఎల్ ఎస్ జీ మ్యాచ్ ద్వారా.  ఉప్ప‌ల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ్గా.. ఇందులో 39 వేల కెపాసిటీ  ఉంటుంది. ఈ కెపాసిటీలో  టెన్ ప‌ర్సెంట్ ఫ్రీగా హెచ్ సీ ఏ కి ఇచ్చింది ఎస్ ఆర్ హెచ్. ఇది చాల‌ద‌న్న‌ట్టు మ‌రో ప‌ది శాతం కావాల‌ని డిమాండ్ చేయ‌డ‌మే కాదు.. ఎఫ్ 3 అనే బ్లాక్ ని క్లోజ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిందట హెచ్ సీ ఏ. ఈ గొడ‌వ చినికి చినికి గాలివాన‌గా మారి.. తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ వ‌ర‌కూ వెళ్లింది. దీంతో సీఎం రేవంత్ విచార‌ణకు ఆదేశించారు. త‌ద్వారా.. జ‌గ‌న్మోహ‌న‌రావు అండ్ కో బెదిరింపుల‌కు పాల్ప‌డ్డ‌ట్టు తేలింది. తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్టు.. ఈ వ్య‌వ‌హారంర‌తో పాటు ఇంకా ఎన్నో నేరాలు ఘోరాలు బ‌య‌ట ప‌డ్డాయి. ఒక అధ్య‌క్షుడు ఇలా అరెస్టు కావ‌డం అంటే..  అది ఈ క్రీడా సంఘానికే మాయ‌ని మ‌చ్చ అంటారు మాజీ అధ్య‌క్షుడు అజ‌రుద్దీన్. ఈ మొత్తం ఎన్నిక‌ను క్యాన్సిల్ చేసి కొత్త‌గా ఎంపిక చేయాల‌ని.. త‌న‌కు మ‌రోమారు అవ‌కాశ‌మిస్తే మంచిగా పాల‌న సాగిస్తాన‌ని.. గ్రామీణ స్థాయిలో క్రికెటర్లు వెలుగు చూసేలా చేస్తాన‌ని అంటున్నారు మాజీ క్రికెట్ కెప్టెన్, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్ సీ ఏ- అజ‌రుద్దీన్. 2017లో ఒక టీ ట్వంటీ టోర్మమెంటు త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి యాక్టివిటీస్ కి పాల్ప‌డ‌లేదు ఈ క్రీడా సంఘం. ఎప్పుడు చూసినా ఏవో ఒక వార్త‌లు. హెచ్ సీ ఏలో అవినీతి, రాజ‌కీయాలంటూ వివాదాలు. ఒక స‌మ‌యంలో ఈ జ‌ట్టు నుంచి రంజీ ఆడ‌మంటే ఆడ‌న‌ని మొండికేశాడు అంబ‌టి రాయ‌డు. అదీ దీని ఘ‌న‌త‌. మ‌రి చూడాలి ఇక‌నైనా ఈ క్రికెట్ సంఘం.. ప్ర‌క్షాళ‌న‌కు గురై మంచి మంచి ఆట‌గాళ్లు వెలుగు చూస్తారా లేదా  తేలాల్సి ఉంది.
ఈ జ‌గ‌న్మోహ‌న‌రావు ఎవ‌రో తెలుసా? Publish Date: Jul 11, 2025 2:22PM

ఆర్ఎంసీ ఘటనపై సీఎం సీరియస్... నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్

కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులను ల్యాబ్ అటెండెంట్‌ లైంగిక వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా విధుల్లో నిమగ్నమై ఉండగా అసభ్యకరమైన ఫొటోలు తీసి వాట్సాప్‌లకు పంపించేవాడని, రూమ్‌కు రమ్మని బెదిరించేవాడని, డబ్బులు ఎరవేసేవాడని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఈ నెల 9న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరుగగా.. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని విద్యార్థి నులు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కాలేజీ విద్యార్థినులపై లైంగిక వేధింపులపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు చంద్రబాబుకు ఈ ఘటనకు సంబంధించి అంతర్గత విచారణలో తేలిన అంశాలతో నివేదిక సమర్పించారు.   మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్‌గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై విద్యార్థినులు కాలేజ్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. దీనిపై అదే రోజు కమిటీని నియమించి విచారణ చేపట్టారు.  విద్యార్థినులతో విచారణ కమిటీ మాట్లాడి నివేదిక సిద్దం చేసింది. చక్రవర్తితోపాటు మరో ముగ్గురు కూడా వైద్య విద్యార్థినులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తితోపాటు ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాల కృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ నలుగురిపై పోలీసు కేసు నమోదు చేశారు.  
ఆర్ఎంసీ ఘటనపై సీఎం సీరియస్... నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్ Publish Date: Jul 11, 2025 2:04PM

వన్డే పగ్గాలూ శుభమన్ గిల్ కే?

టీమ్ ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జట్లుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పుడు మూడో టెస్టు జరుగుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉంది. తొలి టెస్టులో అద్భుతంగా ఆడినా చివరికి ఓటమి తప్పలేదు. అయితే రెండో టెస్టులో అద్భుతంగా పుంజుకుని ఎడ్జ్ బాస్టన్ వేదికపై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్ తోనే టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న శుభమన్ గిల్ బ్యాటర్ గా అద్భుతంగా రాణించడమే కాకుండా, స్కిప్పర్ గా కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే  వన్డే సారథ్య బాధ్యతలు కూడా శుభమన్ గిల్ కే   అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  కాగా టెస్టు, టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డేలలో మాత్రం కొనసాగుతున్నాడు. వచ్చే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని ప్రకటించాడు. దీనిపై బీసీసీఐ రోహిత్ శర్మను 2027 వరల్డ్ కప్ వరకూ వన్డేల్లో క్రీడాకారుడిగా కొనసాగిస్తూనే.. సారథ్య బాధ్యతలు మాత్రం యువ ఆటగాడు, టెస్ట్ కెప్టెన్ గా సత్తా చాటుతున్న శుభమన్ గిల్ కు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.   ఇందులో భాగంగా శుభమన్ గిల్‌కు త్వరలో జరిగే శ్రీలంక వన్డే సిరీస్‌  కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారని అంటున్నారు.   టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలని ఆలోచించడం ఏంటన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  . రోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియా గెలుచుకుంది. టెస్టుల్లోనూ పలు విజయాలను అందుకున్న సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే రోహిత్ ను వన్డే కెప్టెన్ గా తొలగించడంపై పునరాలోచించాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. అయితే  రోహిత్‌ను సీనియర్ ఆటగాడిగా కొనసాగించి.. కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం గిల్‌కు అప్పగించాలని నిర్ణయానికి వచ్చేసిన సెలక్షన్ కమిటీ ఈ విషయంపై ఇప్పటికే రోహిత్ తో చర్చించారనీ, రోహిత్ కూడా అంగీకరించాడనీ అంటున్నారు.  వన్డే కెప్టెన్సీ మార్పుపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.  
వన్డే పగ్గాలూ శుభమన్ గిల్ కే? Publish Date: Jul 11, 2025 12:52PM

ధవళేశ్వరం వద్ద వరద గోదావరి ఉగ్రరూపం

ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటితో పోటెత్తుతోంది. భద్రచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువ అవుతుండగా, ధవళేశ్వరం వద్ద మాత్రం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు ధవళేశ్వరం బ్యారేజి గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో దాదాపు 2 లక్షల 600 క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. గోదావరి వరద కారణంగా లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. కోనసీమలోని లంక గ్రామాల్లోకి నీరు చేరడంతో వాటికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.  రానున్న 24 గంటలలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 
ధవళేశ్వరం వద్ద వరద గోదావరి ఉగ్రరూపం Publish Date: Jul 11, 2025 10:51AM

ఏపీని కుదిపేస్తున్న‌ థూ.. ‘ఫ్యాన్’ మెయిల్

ఏపీకి అప్పులు పుట్ట‌కుండా,  పెట్టుబ‌డులు రాకుండా ఒక కుట్ర‌. అది కూడా విదేశాల నుంచి వైసీపీ  చేస్తోన్న పన్నాగం.   జ‌ర్మ‌నీలో ఒక ప్రముఖ సంస్థలో ప‌ని చేసే ఉద‌య్ భాస్క‌ర్ అనే ఒక వైసీపీ మ‌ద్ధ‌తుదారు చేత బాంబే ఎక్స్ ఛేంజీకి ఏకంగా 200 మెయిళ్లు పంపేలా చేశారంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని ఏపీ  ఆర్ధిక మంత్రి ప‌య్యావుల  కేశ‌వ్ సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఆధారాల‌తో స‌హా చూపించారు. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. విచార‌ణ‌కు ఆదేశించారు. అంతే కాదు దీని వెన‌క ఎంత‌టి వారున్నా వ‌ద‌ల‌కూడ‌ద‌ని  స్పష్టం చేశారు. దీంతో పాటు.. ఈ విష‌యం ప‌బ్లిక్ లోకి మ‌రింత‌గా తీసుకెళ్లే బాధ్య‌త కూట‌మి నేత‌లు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.   ఈ విష‌యంపై స్పందించిన ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బుగ్గ‌న‌... త‌మ హ‌యాంలో కూడా ఎంద‌రో ఇలాంటి క‌థ‌నాలు వండి వార్చారు. అలాగ‌ని మేము ఆగామా?  అంటూ లైట్ తీసుకునే మాట‌లు మాట్లాడారు. అంతే కాదు.. ఒక మెయిల్ వ‌ల్ల మీ రుణాలు, పెట్టుబ‌డులు ఆగిపోతాయా? అని ప్రశన్నించారు. అయితే.. బుగ్గన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి  ప‌య్యావుల కేశ‌వ్.. ఇది స్టేట్ ఫైనాన్షియ‌ల్ క్రెడిబిలిటీకి సంబంధించిన విష‌యంమన్నారు.  గ‌తంలో మీ హ‌యాంలో 2024 మార్చిలో 7 వేల కోట్ల‌కు ఇలాగే రుణం  కోసం ప్ర‌య‌త్నించారు. మీపై న‌మ్మ‌కం లేక పెట్టుబ‌డి దారులు రుణం ఇవ్వ‌లేదు. ఇది విశ్వాసానికీ, విశ్వసనీయతకూ సంబంధించిన అంశం కనుకే.. ఇటువంటి చర్యలను   దేశ ద్రోహం కింద తీసుకుని.. త‌ద్వారా.. కేసులు న‌మోదు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబును కోరామని చెప్పారు.   వైసీపీకి తొలి మొదటి నుంచీ ఇలాంటి అల‌వాటు ఉంద‌నీ, వారు రాష్ట్ర ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌ను దెబ్బ తీయ‌డ‌మే ధ్యేయంగా  ప‌ని  చేస్తుంటార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కూ అదే జ‌రిగింద‌నీ అన్నారు. ఈ విష‌యంపై పూర్తి విచార‌ణ చేసి.. దీని వెన‌క ఎవ‌రున్నారో క‌నిపెట్టి తీరాల‌ని  పయ్యవుల కేశవ్ అన్నారు.  అయినా ఇలాంటి వాటి ద్వారా కూడా న‌ష్టం జ‌రుగుతుందా? అంటే ఇది వ‌ర‌కు హిడెన్ బ‌ర్గ్ రిపోర్ట్ అదాని సంస్థ‌ల‌ను తీవ్రంగా దెబ్బ తీయ‌లేదా? ఇదీ అలాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కేసు ఏ మ‌లుపు తీసుకుంటుందో  చూడాలి మరి  అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇలా విద్వేషపూరిత పనులు చేసే వారికి  విదేశాల్లో చాలా పెద్ద శిక్ష‌లే వేస్తారు. దానికి తోడు ఇది నైతిక‌త‌కు సంబంధించిన విష‌యం. ఇటీవ‌లి కాలంలో కొంద‌రి ఉద్యోగాలు స‌రిగ్గా ఇలాంటి అనైతిక కార్య‌క‌లాపాల  వ‌ల్లే పోయాయని గుర్తు చేస్తున్నారు.  ఉదయ్ భాస్క‌ర్ వంటి వారు ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే ముందు ఆలోచించాల‌ని సూచిస్తున్నారు నిపుణులు. రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేయ‌డం వేరు. ఇలా ప‌క‌డ్బందీగా  రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ తీసేవిధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వేర‌ని.. ఇలాంటి వారికి గ‌ట్టిగా బుద్ధి చెప్ప‌కుంటే  కష్ట‌మ‌నీ సూచిస్తున్నారు రాష్ట్ర శ్రేయోభిలాషులు.
ఏపీని  కుదిపేస్తున్న‌ థూ.. ‘ఫ్యాన్’ మెయిల్ Publish Date: Jul 11, 2025 10:26AM

15 ఏళ్ల తరువాత తెరుచుకున్న పాఠశాల!

వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిధిలోని బోజ్యానాయక్ తండాలో గత దశాబ్దంనరగా మూతపడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు తెరుచుకుంది. ఈ పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య శారద ప్రారంభించారు.  గ్రామ యువకుల కృషితో పాఠశాల పున: ప్రారంభమైంది. యువకుల కృషినీ, ఆదర్శాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈ పాఠశాల పున: ప్రారంభంలో గ్రామ యువత పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ సైతం ప్రత్యేకంగా ప్రశంసించారు.  గ్రామ యువత అంతా ఏకతాటిపైకి వచ్చి ఒక కమిటీగా ఏర్పడి గ్రామ అభివృద్ధి కోసం పని చేయడం ముదావహమన్న కలెక్టర్..  విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఈ పాఠశాల ముందుంటుందన్న ఆశాభావం వ్యక్త  చేశారు.  అదే విధంగా ఈ గ్రామం నుంచి చదువుకొని ఉన్నత స్థాయికి చేరిన వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఉద్బోధించారు.  భవిష్యత్తులో స్కూల్‌కి అవసరమైన పుస్తకాలు, యూనిఫారంలు అన్నీ అందజేస్తామని కలెక్టర్ చెప్పారు.   ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో కూడా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారంటూ సోదాహరణంగా చెప్పిన ఆమె  ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎంఈవో సారయ్య.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు.  అలాగే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు.. పాఠశాల పునః ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దే గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు. 
15 ఏళ్ల తరువాత తెరుచుకున్న పాఠశాల! Publish Date: Jul 11, 2025 10:12AM

మోషన్ సిక్నెస్..  లాంగ్ జర్నీలలో వాంతుల భయమా? ఒక రోజు ముందు ఇలా చేయండి..!

  లాంగ్ జర్నీ చాలామందికి ఇష్టం. అయితే అనుకున్న సులువుగా వీటిని ప్లాన్ చేయడానికి ధైర్యం సరిపోదు.  దీనికి కారణం మోషన్ సిక్నెస్. దీన్నే వాంతుల సమస్య, తల తిరగడం అంటారు. ప్రయాణంలో  వాంతులు లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే ప్రయాణంలోని సరదా అంతా పాడైపోతుంది. మోషన్ సిక్‌నెస్ అనేది ఒక సాధారణ సమస్య, ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు,  స్త్రీలలో సర్వసాధారణం. బస్సు, కారు, రైలు లేదా విమానం..ఇలా ప్రయాణం ఎందులో అయినా సరే..  ప్రయాణించేటప్పుడు మన చెవులు, కళ్ళు,  శరీర సమతుల్యత అసౌకర్యానికి లోనైనప్పుడు , వికారం, చెమట, తల తిరగడం,  వాంతులు వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ఒక రోజు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మోషన్ సిక్నెస్ కు చెక్ పెట్టవచ్చు. ప్రయాణాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. ఆహారం.. ప్రయాణానికి ఒక రోజు ముందు భారీ, వేయించిన,  కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండాలి. ఇది కడుపులో భారంగా మారుతుంది,  గ్యాస్ లేదా ఆమ్లత్వం కారణంగా  అనారోగ్యం పెరుగుతుంది. తేలికైన, సులభంగా జీర్ణమయ్యే,  ఫైబర్ ఆధారిత ఆహారాన్ని తినాలి. నిద్ర.. అలసట,  నిద్ర లేకపోవడం శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రయాణ సమయంలో తలనొప్పి లేదా వాంతులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రయాణానికి ఒక రోజు ముందు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. మందులు.. గతంలో మోషన్ సిక్‌నెస్ చాలాసార్లు జరిగి ఉంటే వైద్యుల సలహా మందులు వాడవచ్చు. ప్రయాణానికి 30-60 నిమిషాల ముందు వైద్యులు సిఫార్సు చేసిన మందులు  తీసుకోవాలి.  తద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. అల్లం లేదా నిమ్మకాయ నీరు.. అల్లం,  నిమ్మకాయ రెండూ కడుపుని శాంతపరచడానికి సహజ నివారణలు. అల్లం టీ లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు ఒక రోజు ముందుగానే తీసుకోవడం మంచిది. ఇది వికారం అవకాశాలను తగ్గిస్తుంది. ముఖ్యమైన వస్తువులు.. ప్రయాణానికి ఒక చిన్న బ్యాగును సిద్ధంగా ఉంచుకోవాలి.   అందులో వాంతి బ్యాగ్, టిష్యూ పేపర్, పుదీనా క్యాప్సూల్స్, మౌత్ ఫ్రెషనర్,  వాటర్ బాటిల్ ఉండాలి.  మార్గంలో ఏదైనా అసౌకర్యాన్ని ఎదుర్కొంటే ఈ వస్తువులు సహాయపడతాయి.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
మోషన్ సిక్నెస్..  లాంగ్ జర్నీలలో వాంతుల భయమా? ఒక రోజు ముందు ఇలా చేయండి..! Publish Date: Jul 11, 2025 9:30AM

భారతదేశ జనాభా గణాంకాలు విన్నారంటే షాకవుతారు..!

  ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం  ఉద్దేశ్యం ప్రపంచంలోని జనాభాకు సంబంధించిన సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించడం. 2025 నాటికి ప్రపంచ జనాభా 806.19 కోట్లు దాటిందని అంచనా. ఐక్యరాజ్యసమితి 1989లో ఈ దినోత్సవాన్ని  ప్రకటించింది. కానీ దీనిని మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా జూలై 11, 1990న జరుపుకున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం  అంటే   జనాభా లెక్కలను ప్రజలకు తెలియజేయడమే కాదు, పెరుగుతున్న జనాభా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం,  వాటికి పరిష్కారాలను కనుగొనడం.  ప్రపంచ వ్యాప్తంగా జనాభా విషయంలో వివిధ దేశాలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కుంటున్నాయి.  భారతదేశ జనాభా గురించి, పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుంటే.. ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవ వేడుకలు 1990 జూలై 11న ప్రారంభమయ్యాయి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం పాలక మండలి ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను ప్రారంభించింది. 1989లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను ప్రకటించింది. ఈ రోజు అంటే జూలై 11, 1987న ప్రపంచ జనాభా సంఖ్య 5 బిలియన్లు దాటినప్పుడు ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే సూచనను మొదట డాక్టర్ కె.సి. జకారియా ఇచ్చారు.   2025 ప్రపంచ జనాభా దినోత్సవం  థీమ్.. ఈసారి 2025 ప్రపంచ జనాభా దినోత్సవం  ఇతివృత్తం, యువతకు న్యాయమైన,  ఆశాజనకమైన ప్రపంచంలో తమకు నచ్చిన కుటుంబాన్ని సృష్టించడానికి సాధికారత కల్పించడం. భారతదేశ జనాభా..    ఐక్యరాజ్యసమితి ప్రకారం, 2025 నాటికి భారతదేశ జనాభా 1,463.9 మిలియన్లుగా ఉండే అవకాశం ఉంది.  భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. నివేదికల ప్రకారం, రాబోయే 40 సంవత్సరాలలో ఈ జనాభా 1.7 బిలియన్లకు చేరుకుంటుంది. అత్యధిక జనాభా కలిగిన 10 దేశాలు.. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 8.2 బిలియన్లు. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారతదేశం  అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా,  ఇథియోపియా ఉన్నాయి. టాప్ 10 దేశాలు ఇవే..   1. భారతదేశ జనాభా (అంచనా) - 1.46 బిలియన్ 2. చైనా జనాభా - 1.42 బిలియన్ 3. అమెరికా జనాభా - 347 మిలియన్లు   4. ఇండోనేషియా జనాభా - 286 మిలియన్లు 5. పాకిస్తాన్ జనాభా - 255 మిలియన్లు 6. నైజీరియా జనాభా - 238 మిలియన్లు 7. బ్రెజిల్ జనాభా - 213 మిలియన్లు 8. బంగ్లాదేశ్ జనాభా - 176 మిలియన్లు 9. రష్యా జనాభా - 144 మిలియన్లు 10. ఇథియోపియా జనాభా - 135 మిలియన్లు                                      *రూపశ్రీ.
భారతదేశ జనాభా గణాంకాలు విన్నారంటే షాకవుతారు..! Publish Date: Jul 11, 2025 9:30AM

విజయానికి ఓటమికి తేడాను స్పష్టంగా చెప్పే కథ!!

విజయం సాధించాలంటే ఎలాంటి మనస్తత్వం వుండాలి? వ్యక్తి ఏరకంగా ఆలోచిస్తే గెలుపు పొందగలడు? అతనిలో ఎలాంటి భావనవుండాలి? ఈ విషయాల గురించి ఒక్కొక్కరు ఒకో విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలుగుతారు. అయితే జీవితంలో ఎన్నో అనుభవాలు చూసి, ఎంతో పరిణితి కలిగిన వ్యక్తి అయితే దానికి చెబుతున్న వివరణ సరైనదేనా కాదా అని చెప్పగలుగుతారు.  ఒకానొకప్పుడు ఒక ఆంగ్ల దినపత్రిక గెలుపుకూ ఓటమికీ తేడా ఎంత??  అనే విషయం గురించి జరిగిన సంఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ వ్రాసినవారికి బహుమతులు ఇస్తామని ప్రకటించింది. దానికోసం ఎంతోమంది ఎన్నో విషయాలను కథలుగా రాసి పంపారు. వాటిలో ఇద్దరు వ్యక్తులు రాసిన కథలు బహుమతులకు ఎంపికయ్యాయి. ఆ రెండు కథలలో ఒక కథను మనం చదివితే మనకు గెలుపు, ఓటమి గురించి ఓ నిర్ధిష్టమైన అవగాహన, నమ్మకం ఏర్పడుతాయి.  ఒక నట్టనడి సముద్రంలో ఒక ఓడ మునిగిపోయింది. అక్కడ అందరూ తమని తాము కాపాడుకోవడానికి అందులో ఏర్పాటు చేసిన లైఫ్ బోట్ లను, చిన్న పడవలను ఉపయోగించుకుంటున్నారు. అవి కొద్దిమొత్తమే ఉండటంతో ఆ ఓడలో ఉన్న అందరికీ అవి సరిపోలేదు. దాంతో ఎంతోమంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సముద్రపు నీళ్లలో ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. సముద్రపు ఒడ్డు ఎంత దూరంలో ఉందొ తెలియకపోయినా ఆశతో ఈదుకుంటూ పోతున్నారు.   ఐదుగురుమాత్రం ఎలాంటి రక్షణ లేకుండా సముద్రంలో  ఈదుతూ వున్నారు. వారికి జీవితం మీద ఆశ వారిని అలా ఈదేలా చేస్తోంది. ఒడ్డు అనేది వారికి వందల మైళ్ళ దూరంలో ఉంది. వారిలో నలుగురికి నిరాశ ఏర్పడింది. ఆఖరుకు మొసళ్ళకు ఆహారం కావలసివస్తుందే అని ఒకడు, ఈనీటిలో చావాలని భగవంతుడు రాసిపెట్టాడని మరొకడు, భార్యాపిల్లలు ఆఖరు క్షణంలో దగ్గరలేక పోయారే అని ఇంకొకడు, తన బ్యాంకులో డబ్బు ఖర్చు చేయకపోతినే అని మరొకడు, ఇలా వాళ్ళకళ్ళముందు తాము అనుభవించని సంతోషాలు, సుఖాల గురించి గుర్తు తెచ్చుకుని బాధపడసాగారు. నలుగురూ తామిక జీవించే ఆశలేదని మనస్సులో నమ్మకానికి వచ్చారు. ఆఖరుకు తమకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం భగవంతుడే అని ఆ భగవంతుని నిందించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారి మనస్సులో బలహీనత వచ్చిందో అప్పటినుంచీ వాళ్లు సరిగా ఈదలేక మరణించారు. అయితే ఆ ఐదో వ్యక్తిమాత్రం “నేను చావను. భగవంతుడు నన్ను అనవసరంగా సృష్టించాడంటే నమ్మను. నేను బ్రతికి తీరాలి" అంటూ శక్తినంతా కూడగట్టుకొని ఈదడం ప్రారంభించాడు. అతడలా ఈడుతూ ఉన్నప్పుడు దృఢనిశ్చయం లేని ఆ నలుగురూ మరణించిన ఐదు నిముషాలకే ఒక విమానం అటు రావడం, దానిలోనివారు ఈదుతున్న వ్యక్తిని చూసి రక్షించడం జరిగింది! ఓడ మునుగుతున్నపుడు కెప్టెన్ వైర్ లెస్ ద్వారా చేసిన విజ్ఞప్తి వలన ఆ విమానం అక్కడికి వచ్చిందని అతడు తర్వాత తెలుసుకున్నాడు. మరణించిన నలుగురిని గుర్తు చేసుకొని విజయానికీ ఓటమికీ తేడా ఐదు నిముషాలని అతడు చెబుతాడు. ఇదీ ఓ కథ. మనిషి జీవితంలో విజయం కోసం పోరాడుతూ మధ్యలో ఏదో నిరాశను తెచ్చుకుని దానికారణంగా పోరాటాన్ని అపకూడదని చెప్పే కథ.                                ◆నిశ్శబ్ద.
విజయానికి ఓటమికి తేడాను స్పష్టంగా చెప్పే కథ!! Publish Date: Jul 11, 2025 9:30AM

విశాఖలో ట్రైన్ హోటల్.. అచ్చం రైల్లోలాగే

 రైల్లో ప్రయాణం,  రైల్లో ఆహారం అన్నది ఒక విభిన్న అనుభూతి. అదో సరదా.. అదో హాయి.. అటువంటి అనుభూతి, సరదాను విశాఖ వాసులకు అందుబాటులోకి తీసుకు వస్తోంది ఓ హోటల్. అదే ట్రైన్ క్యాప్సుల్. విశాఖ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫామ్ మొదటి అంతస్తులో ఈ హోటల్ ఏర్పాటు చేశారు. అచ్చం రైలులోలాగే ఈ హోటల్ లో సింగిల్ ప్యాడ్, బడుల్  ప్యాడ్ లుఉంటాయి.  స్క్రానింగ్ ప్యాడ్లు సైతం ఏర్పాటు చేశారు.   ఒక వరుసలో పైన కింద ఎదురెదురుగా ఈ బెడ్లు డిజైన్ చేశారు.  కర్టెన్లు కూడా ఉంటాయి.  24 గంటలకు రూ600లు ధరగా నిర్ణయించారు.  రైలు బోగి తరహాలో నిర్మించిన ఈ హోటల్లో 73 సింగిల్ ప్యాడ్లు 15 డబుల్ బెడ్ ప్యాడ్లు ఉంటాయి . 18 పడకలు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేశారు. ఉచితంగా వైఫై స్నానానికి వేడి నీరు అందుబాటులో ఉంటుంది సింగిల్ బెడ్ కు మూడు గంటలకు 200 రూపాయలు అక్కడి నుంచి 24 గంటల వరకు 400 రూపాయలు వసూలు చేస్తారు.  డబుల్ బెడ్ అయితే 3 గంటలకు 300 ఆ తర్వాత 24 గంటల వరకు అయితే 600 వసూలు చేస్తారు. ఈ కొత్త తరహా రైల్ హోటల్ ను డిఆర్ఎం లలిత్ బోహారా గురువారం (జులై 10) ప్రారంభించారు
విశాఖలో ట్రైన్ హోటల్.. అచ్చం రైల్లోలాగే Publish Date: Jul 11, 2025 9:29AM

విశాఖలో వైసీపీకి షాక్!

మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది విశాఖలో వైసీపీ పరిస్థితది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత  వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుగా తయారౌతోంది. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆ పార్టీ కార్పొరేటర్లు.. రాష్ట్రంలో అధికారం మారగానే.. రివెంజ్ తీర్చుకున్నారు. పలువురు పార్టీ ఫిరాయించి మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పగించారు. ఇక ఇప్పుడు  జెడ్పీ చైర్ పర్సన్ విషయంలో నూ అదే జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఉమ్మడి విశాఖ జిల్లాలో జిల్లాలో అత్యధిక జడ్పిటిసిలను గతంలో వైసీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జడ్పీచైర్ పర్సన్ గా గిరిజన ప్రాంతానికి చెందిన జల్లిపల్లి సుభద్ర  ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో వైసీపీ జడ్పీటీసీలలో పలువురు ఆమె తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  నిధులు కేటాయింపు తమ ద్వారా కాక నేరుగా చేస్తున్నారన్నది  వీరి ఆరోపణ.  అయితే ఆమె  ఆ అంశాన్ని అంగీకరించడం లేదు కేవలం స్వపక్షంలో కొందరు పదవి కోసం  చేస్తున్న ఆరోపణలుగా కొట్టి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో  రెండు రోజుల కిందట జరిగిన   జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి  వైసీపీకి చెందిన 22 మంది జడ్పీటీసీలు గైర్హాజరయ్యారు.  నిజానికి జిల్లా పరిషత్ లో అనంతగిరిలో సిపిఎం, మాకవరపాలెం లో తెలుగుదేశం మినహాయిస్తే మిగిలిన జడ్పీటీసీలందూ వైసీపీ సభ్యులే. వారిలో అత్యధికులు జడ్పీ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు కావడం చూస్తుంటే స్వపక్షంలోనే జడ్పీ చైర్పర్సన్ తీరుపై ఎంత అసంతృప్తి గూడుకట్టుకుందో అవగతమౌతుంది. ఈ నేపథ్యంలో త్వరలో అంటే సెప్టెంబర్ తరువాత జడ్పీ చైర్సన్ పదవి కూడా వైసీపీ చేజారడం ఖాయమని అంటున్నారు. అంత వరకూ ఎందుకంటే.. ప్రస్తుత జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే.. నాలుగేళ్ల పాలనా కాలం ముగియాల్సి ఉంటుంది. అది సెప్టెంబర్ నాటికి ముగుస్తుంది. ఆ వెంటనే జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని వైసీపీ జడ్పీటీసీలు భావిస్తున్నారు.  ఇప్పటికే విశాఖ కార్పొరేషన్ విషయంలో చేతులు కాల్చుకున్న వైసీపీ.. జడ్పీ చైర్ పర్సన్ విషయంలో అలా జరగకూడదని భావిస్తున్నది.  దీంతో పార్టీ సీనియర్ నాయకుడు కురసాల కన్నబాబు రంగంలోకి దిగి వైసీపీ అసంతృప్త జడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  మరి కురసాల కన్నబాబు బుజ్జగింపులు ఫలిస్తాయా లేదా చూడాల్సి ఉంది. 
విశాఖలో వైసీపీకి షాక్! Publish Date: Jul 11, 2025 9:14AM

భద్రాచలం వద్ద ఉరకలేస్తున్న వరద గోదావరి

గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద వరద గోదావరి స్నానఘట్టాలను ముంచేసింది. బుధవారం (జులై 9) 24.1 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం గురువారం తగ్గినట్లే తగ్గి మళ్లీ ఉధృతంగా పెరుగుతోంది. గురువారం(జులై 10)  23 అడుగులకు తగ్గింది. అయితే  శుక్రవారం (జులై 11) ఉదయానికి వరద మళ్లీ పోటెత్తింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 33.30 అడుగులకు చేరింది. ఇక 5 లక్షల 45 వేల 600 క్యూసెక్కుల నీరు దిగువకు తరలిపోతున్నది. శుక్రవారం సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. పోతే గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తoగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 
భద్రాచలం వద్ద ఉరకలేస్తున్న వరద గోదావరి Publish Date: Jul 11, 2025 8:54AM

బంగారు పాళ్యంలో జగన్‌ పర్యటనపై కేసు నమోదు

  చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్‌ పర్యటన  సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలించారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించారు. హెలిప్యాడ్‌ వద్ద 30 మందికి, యార్డులో 500 మందికి మాత్రమే అనుమతిచ్చినా.. నిబంధనల్ని పాటించలేదంటూ ఓ కేసు పెట్టారు.  ఇందులో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌, బంగారుపాళ్యం మండల వైసీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్‌ కుమార్‌రాజా పేర్లను ప్రస్తుతానికి చేర్చారు. జగన్‌ వచ్చేటప్పుడు ఆ మార్గంలో రోడ్డు మీద మామిడి కాయల్ని పారబోసిన ఘటనలో అక్బర్‌, ఉదయ్‌కుమార్‌ అనే ఇద్దరిపై రెండో కేసును నమోదు చేశారు. మీడియా ఫొటోగ్రాఫర్‌ శివకుమార్‌పై దాడికి సంబంధించి మూడో కేసు నమోదైంది. BNS 223, 126(1)r/w 3(5) సెక్షన్లు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టనున్నారు. నిందితులకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు.
బంగారు పాళ్యంలో జగన్‌ పర్యటనపై కేసు నమోదు Publish Date: Jul 10, 2025 7:39PM

22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..4 గురు స్మగ్లర్లు అరెస్టు

  అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ అటవీప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి 22 ఎర్రచందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు  ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్  అధ్వర్యంలో  డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఎస్ఐ ఎం. మురళీధరరెడ్డి టీమ్ బుధవారం  రాత్రి నుంచి సానిపాయ పరిధిలోని వీరబల్లి మీదుగా గడికోట వైపు కూంబింగ్ చేపట్టారు.  గురువారం తెల్లవారుజామున నాయనూరు ప్రాంతం చేరుకోగా అక్కడ మూడు మోటారు సైకిళ్లు కనిపించాయి. సమీపంలో కొందరు వ్యక్తులు గుమికూడి కనిపించారు. వారిని చుట్టు ముట్టే క్రమంలో  వారు పారిపోదానికి ప్రయత్నించారు.  అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించి నలుగురిని పట్టుకున్నారు. అక్కడ పరిశీలించగా  22ఎర్రచందనం దుంగలు కనిపించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లా వాసులుగా గుర్తించారు. వారిని దుంగలతో సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించగా, డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..4 గురు స్మగ్లర్లు అరెస్టు Publish Date: Jul 10, 2025 6:50PM

మందు బాబులకు షాక్..రెండు రోజులు వైన్స్ బంద్

  ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్బంగా హైదరాబాద్‌లో ఈ నెల 13, 14 తేదీల్లో వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ నార్త్ హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలు ఈ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.బోనాల పండగ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ముందస్తుగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపారు.
మందు బాబులకు షాక్..రెండు రోజులు వైన్స్ బంద్ Publish Date: Jul 10, 2025 6:18PM

లార్డ్స్ టెస్టులో అదరగొట్టిన నితీశ్..ఒకే ఓవర్లో 2 వికెట్లు

  ప్రతిష్ఠాత్మక లార్డ్స్  మైదన వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి అదరగొట్టారు. తాను వేసిన తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ ఓపేనర్లు డకెట్ (23) క్రానే (18)ను పెవిలియన్‌కు పంపారు. ఇదే ఓవర్లో పోప్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్  గిల్ పట్టి ఉంటే వికెట్లు పడేవి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లపై పేస్ బౌలింగ్ భారం ఉండగా, వారికి ఆకాశ్ దీప్ సహకారం అందించనున్నాడు.ఈ మ్యాచ్ కోసం భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడి రాకతో టీమిండియా పేస్ విభాగం మరింత బలోపేతమైంది.  
లార్డ్స్ టెస్టులో అదరగొట్టిన నితీశ్..ఒకే ఓవర్లో 2 వికెట్లు Publish Date: Jul 10, 2025 5:14PM

జూబ్లీ ఉప ఎన్నిక.. మాగంటి ఫ్యామిలీకి బీఆర్ఎస్ మొండి చేయి ?

  సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, అంతకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ రాజకీయ భవిష్యత్’ను నిర్ణయించడంలో జూబ్లీహిల్స్ గెలుపు ఓటములు టర్నింగ్ పాయింట్ అవుతుందని, రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సర్వశక్తులు ఒడ్డి అయినా సరే, జుబ్లీ సీటు గెలిచి తీరాలనే దృఢ సంకల్పంతో పావులు కదుపుతోందని అంటున్నారు. అలాగే, సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడంతో పాటుగా, పడి లేచిన కెరటంలా రాష్ట్ర రాజకీయాల్లో  దూసుకు పోవాలని చూస్తున్న బీఆర్ఎస్’ పార్టీకి కూడా జూబ్లీ హిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక గెలుపు అత్యంగా కీలకంగా బావిస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకే, ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా, సిట్టింగ్ సీట్’ ను నిబెట్టుకునెందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవంక,తెలంగాణలో ఏపీ కూటమి ప్రయోగానికి సిద్దమవుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, జూబ్లీ హిల్స్’ నియోజక వర్గాన్ని, లాంచింగ్ ప్యాడ్’గా భావిస్తోందని, పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో, మూడు ప్రధాన పార్టీలు, వ్యూహ రచనతో పాటుగా, అభ్యర్ధుల ఎంపిక కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా,గెలుపు ఓటములను నిర్ధారించడంలో కీలకంగా భావిస్తున్న ముస్లిం మైనారిటీ ఓటు టార్గెట్’గా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహ రచన చేస్తుంటే,బీజేపీ హిందూ ఓటు బ్యాంకు’ ను కన్సాలిడేట్’ చేసే దిశగా పావులు కదుపుతోందని  అంటున్నారు. మరోవంక కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసంగతంలో పోటీచేసి ఓడిపోయినా, మాజీ క్రికెటర్ అజారుద్దీన, బీఆర్ఎస్’నుంచి కాంగ్రెస్’లోకి జంప్ చేసిన జీహెచ్ఎంసీ’ మాజీ మేయర్. బొంతు రామ్మోహన్’ సహా మరి కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  అయితే, ఎంఐఎం  నిర్ణయం పై కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక ఆధారపడి ఉంటుందని, పార్టీ వర్గాల సమాచారం.ఇక బీజేపీ అభ్యర్ధి విషయానికి సమబందించి,గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా లంక దీపక్ రెడ్డి పేరుతొ పాటుగా, గతంలో కూకటపల్లి నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసిన, నందమూరి సుహాసిని పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, కూటమి తరపున ఏ పార్టీ పోటీ చేయాలో తేలిన తర్వాతనే, అభ్యర్ధి ఎంపిక పై, కూటమి నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, బీజేపీ నాయకులు అంటున్నారు.   అదలా ఉంటే, మాగంటి మరణం మొదలు, అదే కుటుంబం నుంచి పార్టీ అభ్యర్ధిని బరిలో దించాలని భావించిన, బీఆర్ఎస్’ మనసు మార్చుకుని,ముస్లిం అభ్యర్ధి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్’ అధినేత కేసీఆర్’ ముందు నుంచి కూడా మాగంటి సతీమణి సునీతను బరిలో దించాలని భావించారు. నిజానికి, ఆమె పోటీకి అంత  సుముఖంగా లేక పోయినా,ఆమెను ఒప్పించారని పార్టీవర్గాల సమాచారం. అయితే, అంతలోనే అనూహ్యంగా మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్’ పోటీకి సిద్ధం కావడంతో, కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే, వ్యూహం మార్చి ముస్లిం అభ్యర్ధిని బరిలో దించాలని బీఆర్ఎస్ బాస్’ నిర్ణయించినట్లు చెపుతున్నారు. ఈ నేపధ్యంలో నిన్న (జూలై 9) బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ మైనార్టీ విభాగం సమావేశంలో ముస్లిం మైనారిటీ అభ్యర్ధిని పోటీకి దించాలన్న నిర్ణయాన్ని ప్రకటించినట్లు చెపుతున్నారు. కాగా, సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటుదామని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.సమావేశంలో హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్’  పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తమది సెక్యులర్‌ ప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్‌, 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదన్నారు.హైడ్రా, మూసీ పేర్లతో రేవంత్‌ సర్కార్‌ ముస్లింల ఇళ్లను కూల్చి వారికి గూడులేకుండా చేసిందన్నారు. మైనార్టీల కోసం ఎన్నికలప్పుడు హామీలు గుప్పించిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక వాటి అమలును పట్టించుకోవడంలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్’కు బుద్ధిచెప్పాలని మైనార్టీలను కోరారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే, బీఆర్ఎస్’ ప్రస్తుతానికి ముస్లిం మైనారిటీ వైపు మొగ్గుచుపుతున్నట్లు తెలుస్తోందిని పరిశీలకులు అంటున్నారు. అయితే,ఇదే తుది నిర్ణయం కాకపోవచ్చని,పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ‘తెలుగు వన్’ కు చెప్పారు. మరో వంక, రాజకీయ పార్టీ చక చక వ్యూహాలను మార్చుకుంటున్న నేపధ్యంలో   జూబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక మరిత్న ఆసక్తిని రేకిస్తోందని అంటున్నారు.  
జూబ్లీ ఉప ఎన్నిక.. మాగంటి ఫ్యామిలీకి  బీఆర్ఎస్ మొండి చేయి ? Publish Date: Jul 10, 2025 4:34PM