మంగ‌ళ‌గిరి చేనేత‌కు మహర్దశ.. లోకేష్ బాండింగే కారణం!

posted on: Feb 19, 2026 2:02PM

మంత్రి నారా లోకేష్.. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా గెలిచేశాం. ఆపై ఆ సెగ్మెంట్ తో ప‌ని  అయిపోయింద‌ని ఊర‌కే  ఉండ‌ట్లేదు. మంగ‌ళ‌గిరి చేనేత చీర‌ల‌కు అంత‌ర్జాతీయ  గుర్తింపు తీసుకురావ‌డానికి శ‌త‌విధాలా ప‌ని చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో సీఎం చంద్ర‌బాబును క‌లిసిన  కూట‌మి మహిళా నేత‌లంద‌రూ ఒకే రంగు చీర క‌ట్టుకుని త‌మ ఐక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇటీవ‌ల మంత్రి నారా లోకేష్.. ప్రాంతాల వారీగా ఎమ్మెల్యే,  ఎంపీల‌ను కుటుంబ స‌భ్యుల‌తో స‌హా క‌లుస్తున్నారు. వారికి మంగళగిరి చేనేత చీరలు గిఫ్ట్ గా ఇస్తున్నారు. లోకేష్ వారికి ఇస్తున్న బ్యాగ్ లపై  వీవ‌ర్ శాల అని  ఉంటోంది.

ఇదంతా ఏంట‌ని  చూస్తే లోకేష్.. మంగ‌ళ‌గిరి చీర‌ల‌కు విస్తృత  ప్ర‌చారం క‌ల్పిస్తున్న‌ారు.  ఈ విష‌యం ఒక  స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా  లోకేష్ మంగ‌ళ‌గిరి చీర‌ల‌కు క‌ల్పిస్తున్న బ్రాండింగ్ ఎంతో గొప్ప విష‌య‌మ‌ని అన్నారాయ‌న‌. ఈ విష‌యంలో నారా బ్రాహ్మ‌ణికి కూడా భాగ‌స్వామ్యం క‌ల్పిస్తున్నారు. సంక్రాంతి ఇత‌ర పండ‌గ‌లు, ప‌బ్బాల స‌మ‌యంలో బ్రాహ్మ‌ణికి మంగ‌ళ‌గిరి చేనేత చీర‌లు ఇస్తున్నారు మంత్రి నారాలోకేష్. ఆమె ఆ చీర‌ల‌ను ధ‌రించి ఫోటోలు షేర్ చేస్తున్నారు. వీటిని  చూసిన  కొంద‌రు ఈ చీర‌ల‌ను కొన‌డానికి ఎగ‌బడుతున్నారు. ఒక స్పెష‌ల్ క‌ల‌ర్ శారీ బాగా వైర‌ల్ కావ‌డంతో ఆ ఒక్క షాపులోనే ఆ ర‌కం చీర‌లు 98 వ‌ర‌కూ అమ్ముడు పోయాయ‌ట‌. ఈ విష‌యం  లోకేష్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇక లోకేష్ తాను  రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని వంటి ప్ర‌ముఖుల‌తో స‌హా  అంద‌రికీ  మంగ‌ళ‌గిరి చేనేత శాలువాలు,  వ‌స్త్రాల‌ను బ‌హుక‌రించ‌డం ఒక ఆనవాయితీగా మార్చుకున్నారు. దీని  ద్వారా  కూడా మంగ‌ళ‌గిరి చేనేత‌కు ఎంతో ప్రాచుర్యం ల‌భిస్తోంది. 

లోకేష్ కి చేనేత‌తో ఎలాంటి  సంబంధం లేక పోయినా కూడా.. వీవ‌ర్ శాల అనే  ఒక  విన్నూత్న  కేంద్రం ఏర్పాటు చేశారు. టాటా త‌నేరాతో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా మంగ‌ళ‌గిరి చీర‌ల‌కు కార్పొరేట్ మార్కెట్ ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో మంగ‌ళ‌గిరి నేత‌న్న‌ల ఆదాయం 30 నుంచి న‌ల‌భై శాతం వ‌ర‌కూ పెరిగింది. ఇక చేనేత క‌ళాకారుల‌ నైపుణ్యాభివృద్ధికి సైతం త‌గిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంగ‌ళ‌గిరి ఆటో న‌గ‌ర్ కి ద‌గ్గ‌ర్లో 10.8 ఎక‌రాల్లో మెగా హ్యాండ్లూమ్ పార్క్ తీసుకొస్తున్నారు. ఇది నేత‌న్న‌ల‌కు శిక్ష‌ణ  ఇవ్వ‌డంతో పాటు ఏడాది పొడుగునా.. ఉపాధి అవ‌కాశాల‌ను కూడా క‌ల్పించ‌నుంది. నేత‌న్న భ‌రోసా కింద ప్ర‌తి చేనేత  కుటుంబానికి ఏటా పాతిక వేల రూపాయ‌ల ఆర్ధిక సాయం  చేయ‌డంతో పాటు.. చేనేత మ‌గ్గాల‌కు 200 యూనిట్లు, మ‌ర మ‌గ్గాల‌కు 500 యూనిట్ల మేర ఉచిత  విద్యుత్ ఇస్తున్నారు. చేనేత ఉత్ప‌త్తుల‌ల‌పై 5 శాతం జీఎస్టీ  ఇక ప్ర‌భుత్వ‌మే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు.

మంగళగిరి కాటన్స్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చడానికి ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్లను నియమించడం, ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానించడం వంటి పనులను లోకేష్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. నేతన్నలు కేవలం కార్మికులు కాదు, వారు హ్యాండ్లూమ్ ఆర్టిస్టులు అని ఆయన పిలుపునివ్వ‌డంలోనే ఆయ‌న‌కు ఇక్క‌డి  చేనేత‌ల ప‌ట్ల ఎంత మ‌మ‌కారం ఉందో తెలుసు కోవ‌చ్చంటున్నారు. అందుకే మంగ‌ళ‌గిరి చేనేత‌కు లోకేష్ కేవ‌లం బ్రాండింగ్ చేయ‌డం మాత్ర‌మే కాదు  నేతన్నలతో బాండింగ్ కూడా ఏర్ప‌రుచుకుంటున్నార‌న్న మాట వినిపిస్తోంది. ఇది కేవ‌లం ఈ ప్రాంతానికి సంబంధించిన విష‌యం మాత్ర‌మే  కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  చేనేత‌లంద‌రూ క‌ల‌సి  లోకేష్ త‌మ ప‌ట్ల చూపుతున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధాస‌క్తుల ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...