Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహా వరుణయాగం సంపూర్ణం.. సీఎం రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు..!
posted on: Aug 10, 2026 6:45PM
.webp)
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య నాగార్జునసాగర్‌లో ఈ యాగాన్ని నిర్వహించారు.
నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన మహా వరుణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మంత్రి ఉత్తమ్ దంపతులతో కలిసి యాగంలో పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలను ఏర్పాటు చేసి వరుణదేవుని అనుగ్రహం కోసం వైదిక విధానంలో హోమక్రతువులు నిర్వహించారు.
కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతోనే మహా వరుణయాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
భారతీయ సంస్కృతిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతూనే.. వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలను గౌరవిస్తున్నామని తెలిపారు.
వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదయ్యేలా వరుణదేవుని అనుగ్రహం కోసం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వరుణదేవుడిని ప్రార్థిస్తూ.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని ఆకాంక్షించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు నిండాలని, ప్రతి చెరువు, కుంట జలకళను సంతరించుకోవాలని కోరుకున్నారు. భూగర్భ జలాలు పెరిగి, పంటలు పుష్కలంగా పండాలని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరియాలని ప్రార్థించారు.
రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మహా వరుణయాగంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, పి. సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Maha Varuna Yagam, Varuna Yagam, Rainfall, Telangana Rains, Telangana Government,
Nagarjuna Sagar, Vijay Vihar, Krishna River, CM Revanth reddy, Minister Uttam kumar reddy






