లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్సై
posted on: Feb 10, 2026 3:50PM

రంగారెడ్డి జిల్లా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. 50 వేల లంచం తీసుకుంటూ ఎస్సై వినయ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ చీటింగ్ కేసులో జైలు నుంచి తప్పించేందుకు ఎస్సై రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి పట్టుకున్నారు.
వివరాల ప్రకారం...
ఓ ఫిర్యాదుదారుడికి సంబంధించిన కేసులో తన సహకారం అందిస్తానని చెప్పిన ఎస్‌ఐ వినయ్, ఇందుకు ప్రతిఫలంగా రూ. 50,000 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకునేంత స్తోమత తనకు లేదని బాధితుడు మొరాపెట్టుకున్నాడు. అయినా కూడా లంచం ఎస్సై డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు, ప్రాథమిక విచారణ అనంతరం వినయ్‌పై వలపన్నేందుకు నిర్ణయించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎసీబీ అధికారులు ఫిర్యాదు దారుడిని మొత్తం లంచం డబ్బులు ఇచ్చి ఎస్‌ఐ వినయ్ వద్దకు పంపించారు.
వినయ్ నగదును స్వీకరిస్తున్న క్షణంలోనే అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.50,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వినయ్‌ను అదుపులోకి తీసుకుని, ఏసీబీ కార్యాల యానికి తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టేషన్ సిబ్బందితో పాటు స్థానికులలోనూ ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజలతో నిత్యం మమేకమై ఉండాల్సిన పోలీస్ అధికారి, అవినీతికి పాల్పడటం పట్ల పౌరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి చర్యలకు పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని, కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. వినయ్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వినయ్ గతంలో నిర్వహించిన విధులు, ఇతర ఫిర్యాదులు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం






