మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలకు గాజా రక్త మరకలు.!

posted on: Aug 7, 2026 3:08PM

ఇండియా  గడిచిన దశాబ్ద కాలంలో అంతర్జాతీయ రక్షణ రంగంలో ఆయుధాలను కొనుగోలు చేసే స్థాయి నుంచి ఒక శక్తిమంతమైన ఎగుమతి దేశంగా  పరివర్తన చెందుతోంది. దేశ రాజకీయ వేదికలపై, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలలో  మేక్ ఇన్ ఇండియా,  ఆత్మనిర్భర్ భారత్  వంటి నినాదాలు  ప్రతిష్టాత్మకంగా వినిపిస్తున్నాయి. బ్రహ్మోస్, ఆకాశ, పినాక, ధనుష్, అర్జున్,  తేజస్ వంటి దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు నేడు ప్రపంచంలోని నూటికి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ పరిణామం భారతదేశ రక్షణ స్వావలంబనకు  చారిత్రక విజయంగా ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ ప్రగతి చిత్రం నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇప్పుడు ఆ రెండో కోణాన్ని  అమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన తాజా నివేదిక బయట పెట్టింది.  మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలకు  గాజాలో జరుగుతున్న మానవ హవాన విధ్వంసం, యుద్ధ నేరాలు,  జన సంహారాలకు ఉపయోపడుతున్నాయన్ని అమ్నెస్టీ నివేదిక సారాంశం. దీంతో  భారత్ తన నైతిక స్థానాన్ని ఎలా కాపాడుకుంటుందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది

చారిత్రకంగా చూస్తే 2014కు  ముందు ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉండేది. యుద్ధ విమానాలు, క్షిపణులు, రాడార్లు, ఫిరంగి దళాలకు అవసరమైన సామగ్రి అంతా రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్,  అమెరికా వంటి దేశాల నుంచి  దిగుమతి అయ్యేది. ఆ కాలంలో దేశీయ రక్షణ పరికరాల తయారీ చాలా పరిమితంగా ఉండేది, ఎగుమతుల గురించి అసలు ఆలోచించే పరిస్థితి ఉండేది కాదు. కానీ తర్వాతి కాలంలో ప్రభుత్వం రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలను పునర్వ్యవస్థీకరించి, ఎగుమతులకు భారీగా ప్రోత్సాహకాలు అందించింది. దీని ఫలితంగా అత్యాధునిక రాడార్లు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు   మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్‌తో నేడు  ప్రపంచ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. దేశ రక్షణ అవసరాలలో ముప్పాతిక భాగం ఇప్పుడు స్వదేశీ తయారీ ద్వారానే సమకూరుతున్నట్లు ప్రభుత్వ   నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే ఈ ఎగుమతులు ఏ దేశాలకు వెళ్తున్నాయి, ఎవరిపై ప్రయోగింపబడుతున్నాయి, ఎలాంటి రాజకీయ,  నైతిక నేపథ్యాలలో వినియోగించబడుతున్నాయి అనే అంశాలపై ఇప్పటివరకు స్పష్టమైన చర్చ జరగలేదు.  ఈ నేపథ్యంలోనే 2023 అక్టోబర్ 7న హమాస్,  ఇతర పాలస్తీనా సాయుధ బలగాలు ఇజ్రాయెల్ పై జరిపిన భీకర దాడులు పరిస్థితిని పూర్తిగా మార్చివేశాయి. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం ఆ దాడులు తీవ్రమైన యుద్ధ నేరాలు. దానికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంపై ప్రారంభించిన సైనిక దాడులు, విచక్షణారహిత బాంబు దాడులు, ముట్టడి అంతర్జాతీయ స్థాయిలో జనసంహార ఆరోపణలకు దారితీశాయి. ఐక్యరాజ్యసమితి స్వతంత్ర విచారణ సంఘాలు,  అంతర్జాతీయ న్యాయస్థానం కూడా గాజాలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు గుర్తించి తాత్కాలిక ఆదేశాలు జారీ చేశాయి.

ఈ సంక్షిష్ట సమయంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్  భారత్, ఇజ్రాయెల్ ఆయుధ వాణిజ్యంపై లోతైన షిప్‌మెంట్ స్థాయి దర్యాప్తును నిర్వహించి ఒక సమగ్ర నివేదికను వెలువరించింది. ఆ నివేదికలోని సమాచారం ప్రకారం..  2023 అక్టోబర్ 7 నుంచి 2025 నవంబర్ 30 వరకు భారత భూభాగం నుంచి ఇజ్రాయెల్‌కు సుమారు రెండు వేలకు పైగా ఆయుధ రవాణా షిప్‌మెంట్లు వెళ్లాయి. వీటిలో చిన్న ఆయుధాలు, పేలుడు పదార్థాలు, హై-ఎక్స్‌ప్లోసివ్ ఆర్టిలరీ షెల్స్, మోర్టార్ లాంచర్లు, రవాణా వాహన భాగాలు,  సెన్సార్ పరికరాలు ఉన్నాయి.  ఇందులో వందలాది షిప్‌మెంట్లు పూర్తిగా సైనిక ప్రయోజనాల కోసమే ఉద్దేశించినట్లు తేలడంతో, ఇజ్రాయెల్ రక్షణ సరఫరా గొలుసులో భారత్ ఒక కీలక భాగస్వామిగా మారిందనే వాదన బలపడింది. గాజాలో జరుగుతున్న దారుణాల మధ్య ఈ సరఫరాలు కొనసాగడం ఇండియా నైతికతపై ప్రశ్నలు వెల్లువెత్తేలా చేశాయి. 

అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆయుధాల బదిలీకి సంబంధించి నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. అంతర్జాతీయ మానవతా చట్టాలు,  మానవ హక్కుల ఒప్పందాల ప్రకారం ఒక దేశం యుద్ధ నేరాలు లేదా జనసంహారాలు జరుగుతున్నట్లు స్పష్టంగా తెలిసినప్పటికీ వేరే దేశానికి ఆయుధాలు లేదా సైనిక పరికరాలు సరఫరా చేస్తే అది నేరంలో భాగస్వామ్యం కిందకు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియా  అంతర్జాతీయ ఆయుధ వ్యాపార ఒప్పందంపై సంతకం చేయనప్పటికీ, ఐక్యరాజ్యసమితి చార్టర్,  అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల పట్ల గౌరవం కలిగి ఉండాల్సిన బాధ్యత ఉంది. దేశీయంగా మునిషన్స్ ఇండియా, ఇండియా ఆప్టెల్, అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు ఇజ్రాయెల్ కంపెనీలకు ఆయుధాలు  మోర్టార్ లాంచర్లు, షెల్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా గాజా విధ్వంసం తాలుకు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో, కేవలం వాణిజ్య ఒప్పందాల పేరిట ఈ ఎగుమతులను సమర్థించుకోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఇండియాకి ఇజ్రాయెల్ తో రక్షణ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ముఖ్యంగా కార్గిల్ యుద్ధం తర్వాత ఈ సంబంధాలు వేగంగా బలపడ్డాయి. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, క్షిపణులు, నిఘా డ్రోన్లు వంటి కీలక రంగాలలో ఇజ్రాయెల్ భారత్‌కు అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా నిలిచింది. 2014 తర్వాత ఈ సహకారం సంయుక్త పరిశోధనలు, సాంకేతిక మార్పిడి,  జాయింట్ వెంచర్ల రూపంలో మరింత విస్తరించింది. మరోవైపు ఇండాయా అరబ్ దేశాలతో కూడా బలమైన ఆర్థిక, ఇంధన,  వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తోంది. అయితే గాజా సంక్షోభం విషయంలో భారత ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ, పౌరుల రక్షణ,  దౌత్య సంభాషణే ప్రధానమంటూ సాధారణ ప్రకటనలతో సరిపెట్టింది తప్ప ఇజ్రాయెల్‌కు సాగుతున్న ఆయుధ ఎగుమతులపై ఎటువంటి అధికారిక స్పష్టతను ఇవ్వలేదు.

మీడియా  ఈ అంశంపై కొన్ని కథనాలు వచ్చినప్పటికీ, మెయిన్ స్ట్రీమ్ టీవీ డిబేట్లలో,  సోషల్ మీడియా వేదికలలో ఇది పెద్దగా కనిపించలేదు. దేశంలో రక్షణ స్వావలంబన సాధించామనే గర్వం ఒకవైపు, ఆ దేశీయ ఆయుధాలు విదేశాల్లో అమాయక ప్రజల ప్రాణాలు తీయడానికి ఉపయోగపడుతున్నాయనే వాదన మరోవైపు తీవ్రమైన నైతిక ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భారత్ నుంచి లభిస్తున్న ప్రజా మద్దతు తమ దేశానికి పెద్ద బలమని పేర్కొనడం గమనార్హం. ఇది వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్ లో దేశం యొక్క విదేశీ విధానంపై,  అంతర్జాతీయ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆందోళన కలిగిస్తోంది.

ఈ మొత్తం వ్యవహారం కారణంగా ఇండియా  భవిష్యత్తులో మూడు   సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. వాటిలో మొదటిది అంతర్జాతీయ న్యాయపరమైన నిందలు లేదా భవిష్యత్తులో తలెత్తే విచారణల రిస్క్. రెండవది అపారమైన కష్టంతో నిర్మించుకున్న మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ప్రతిష్టకు నైతికపరంగా వాటిల్లే కళంకం. ఇక మూడవది   ప్రజాస్వామ్య సమాజంలో జరగాల్సిన పారదర్శకమైన చర్చ లోపించడం. మన ఆయుధాలు ఏ యుద్ధాలకు ఇంధనంగా మారుతున్నాయి అనే అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల దేశ గౌరవానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. కేవలం రక్షణ రంగ ఎగుమతులు, ఆర్థిక లాభాలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ మానవతా చట్టాల పట్ల గౌరవం కూడా ఒక దేశ విదేశాంగ విధానానికి గీరాయిగా ఉండాలనే వాదన బలంగా వినిపిస్తోంది.

భారతదేశ రక్షణ రంగంలో సాధించిన స్వావలంబన, టెక్నాలజీ అభివృద్ధి మరియు ఎగుమతుల వృద్ధి ఎంత నిజమో, ఆ ఆయుధాలు గాజాలో జరుగుతున్న దారుణాలతో ముడిపడి ఉన్నాయనే ఆరోపణలను కొట్టివేయలేమనడమూ అంతే నిజం. కేవలం రాజకీయ సమతుల్యత పేరుతో ఈ సున్నితమైన అంశాన్ని పక్కన పెట్టడం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు అవసరమే అయినప్పటికీ, అవి అంతర్జాతీయ మానవతా విలువలు,  నైతిక బాధ్యతలకు విరుద్ధంగా సాగకూడదు. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కేవలం సాంకేతిక, ఆర్థిక విజయాలకు మాత్రమే ప్రతిరూపంగా కాకుండా, మానవ విలువలు,  అంతర్జాతీయ చట్టాల పట్ల నిబద్ధతకు ప్రతీకగా నిలవాలి. ఈ నేపథ్యంలో దేశ ప్రభుత్వం, రక్షణ రంగానికి చెందిన తయారీ సంస్థలు,  పౌర సమాజం కలిసి ఈ  ప్రశ్నలకు భవిష్యత్తులో ఎలాంటి సమాధానం ఇస్తాయనేది వేచి చూడాలి.

- సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. 

MadeinIndia weapons,  India Israel defense relations,  Amnesty International report, Allegations of war crimes in Gaza, Atmanirbhar Bharat  defense exports
 

google-ad-img
    Related Sigment News
    • Loading...