మదనపల్లె ఎర్రపండు పాకిస్థాన్‌కు..

posted on: Jul 21, 2016 3:45PM

తెలుగు రాష్ట్రాల్లో టమోటా అనగానే అందరికి ముందుగా గుర్తుచ్చే పేరు మదనపల్లె. నిన్న మొన్నటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు మాత్రమే ఇక్కడి నుంచి టమోటా ఎగుమతి అయ్యేది. అయితే తాజాగా మన దాయాది దేశం పాకిస్థాన్‌కు ఎగుమతి అవుతోంది. సాధారణంగా ఇక్కడ మార్చి నెలఖారు నుంచి జులై వరకు టమోటాకు సీజన్‌గా పరిగణిస్తారు. ఇందుకు కారణం ఈ మాసాల్లో బయట ప్రాంతాల్లో టమోటా పంటకు అనుకూలమైన వాతావరణం ఉండదు.

 

మదనపల్లె చుట్టుపక్కల మండలాల్లో మాత్రం వేసవిలోనూ టమోటా పండుతుంది. దీంతో ఇక్కడి టమోటాకు దేశమంతటా డిమాండ్ ఉంటుంది. చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో టమోటా అధిక మొత్తంలో సాగవుతుంది. వేరు శెనగ తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగుచేసే టమోటా పంటపై వేల సంఖ్యలో రైతు కుటుంబాలు ఆధారపడ్డాయి. వినియోగానికి మించి టమోటా మార్కెట్‌లోకి వస్తుండటం, అధిక ధరల ఆశలు, కుంటలు, బోరుబావులు, చెరువులు, బావులలో పుష్కలంగా నీరు ఉండటంతో రైతులు 10 వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు.

 

దీనికి తోడు అనంతపురం జిల్లాలో టమోటాకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అక్కడి రైతులు కూడా మదనపల్లె మార్కెట్‌కే టమోటాను తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో దిగుబడులు తగ్గడంతో జూన్ ప్రారంభంలో మదనపల్లెలో డిమాండ్ పెరిగింది. ఎన్నడూ లేని విధంగా రూ.60 వరకు పలకగా..ఓ రోజున ఏకంగా రూ.90 వరకు వెళ్లింది. తాజాగా కిలో ధర రూ.10 నుంచి రూ. 26 వరకు ఉంటోంది. ప్రస్తుతం 500 టన్నుల వరకు సరకు వస్తోంది. దీనిని కొనుగోలు చేస్తున్న ఢిల్లీ వ్యాపారులు పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...