అసలు తప్పు ఎక్కడ జరిగింది?, వైఫ్యలం ఎవరిది?...బందరు పోర్టుపై ఎక్స్ క్లూజివ్ స్టోరీ

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33వేల ఎకరాలకు పైగా భూములు సమీకరించిన(ల్యాండ్ ఫూలింగ్) ప్రభుత్వానికి బందరు పోర్టు విషయంలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది, ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రాజధాని కోసం సమీకరించగలిగిన ప్రభుత్వం, మచిలీపట్నం పోర్టు విషయంలో విఫలమైంది, అసలు ఎక్కడ తప్పు జరిగింది? ఇది ప్రభుత్వ యంత్రాంగం లోపమా? లేక ప్రజలను ఒప్పించడంలో మంత్రులు, మచిలీపట్నం ఎంపీ విఫలమయ్యారా?, ముందు 30వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత 14వేల ఎకరాలే చాలు, పైగా భూసేకరణ కాదు, సమీకరణే అనడంలో అర్థమేమిటి? ప్రభుత్వం గందరగోళంలో ఉందా? ఎలాంటి కసరత్తు లేకుండానే గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటుందా?... చదవండి ఎక్స్ క్లూజివ్ స్టోరీ

 

పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు లభిస్తాయి, వేలాది మందికి పని దొరుకుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా ప్రజల జీవనశైలి మెరుగవుతుంది, అయితే ఇవన్నీ జరగాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలంటే వాటికి అనువైన చోట భూములు ఇవ్వాలి(ఎక్కడో అడవుల్లో ఇస్తానంటే పారిశ్రామికవేత్తలు ముందుకురారు), భూములు ఇవ్వాలంటే...రైతులు ఒప్పుకోవాలి, ఇక్కడే బ్రేకులు పడుతున్నాయి, భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు, భూములనే నమ్మకుని బతుకుతున్నాం, భూములు ఇచ్చేస్తే తామెలా బతకాలంటూ బోరుమంటున్నారు, సరిగ్గా ఇక్కడే ప్రభుత్వ వైఫల్యమూ కనిపిస్తుంది, భూములిచ్చే రైతులకు నమ్మకం కలిగించడంలో విఫలమవుతోంది, మేమున్నామంటూ భరోసా ఇవ్వడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. మచిలీపట్నం పోర్టు భూసేకరణ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది, భూములు ఇవ్వాలంటూ రైతులను ఒప్పించడానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, టీడీపీ ప్రజాప్రతినిధులపై గ్రామస్తులు తిరుగుబాటు చేశారంటే, దానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే, రైతులకు భరోసా కల్పించకపోవడంలో అమాత్యులు ఘోరంగా విఫలమయ్యారు, పోర్టు అనుబంధ పరిశ్రమలతో ఎలాంటి మేళ్లు జరుగుతాయో వివరించలేకపోవడం, ఆ ప్రాంతం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో చెప్పలేకపోవడం, ముఖ్యంగా భూములు కోల్పోయే రైతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై నమ్మకం కలిగించలేకపోవడం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల వైఫల్యంగానే చెప్పుకోవాలి. పోర్టు అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కాంట్రాక్టులు, టాన్స్ పోర్టేషన్...ఇలా అనుబంధ పనులన్నీ రైతులు, వాళ్ల కుటుంబ సభ్యులకే ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే భూములు ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చంటున్నారు.

రైతుల ఆవేదనలోనూ అర్థముంది,భూములిస్తే తామెలా బతకాలన్న రైతుల ప్రశ్నకు ప్రభుత్వం పరిష్కారం చూపగలిగితే సమస్య తీరినట్లే, పైగా అక్కడ ఎలాంటి పరిశ్రమలు వస్తాయనే దాని మీద క్లారిటీ లేదు, పోర్టు నుంచి ఎక్కువగా ఎగుమతులు జరిగితే స్థానికులకు ఉద్యోగాలు,ఉపాధి దొరుకుతాయి, మరి బందరు పోర్టు నుంచి ఎక్స్ పోర్ట్ చేయడానికి ఆ ప్రాంతంలో ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ బందరు పోర్టు నుంచి పెద్దఎత్తున ఎగుమతులు జరిగే పరిస్థితి లేకపోతే, అనుబంధ పరిశ్రమలు వచ్చేదీ అనుమానమేని అంటున్నారు, ఈ అనుమానాలన్నింటినీ నివత్తి చేస్తేనే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొస్తారు.అయితే ‘తెలుగువన్‘ విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు బందరు పోర్టుకు అనుబంధంగా ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలు రానున్నాయని తెలుస్తోంది, నాగాయలంక పరిసర ప్రాంతాల్లో గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్లు ఓఎన్జీసీ సెర్చింగ్ లో తేలినట్లు తెలుస్తోంది, అందుకే ఓఎన్జీసీ ఇండియా సౌత్ హెడ్ ఆఫీస్ ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట, అదే నిజమైతే కనుక బందరు పోర్టు నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఆధారిత ఉత్పత్తులు ఎగుమతికి అవకాశముందని అంటున్నారు. అయితే రైతుల నుంచి తీసుకునే భూమికి తగినట్లుగా ఆయా పరిశ్రమల్లో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, అనుబంధ పనులు మొదలైనవాటిని అప్పగిస్తామనే నమ్మకం కలిగించాలని, అవసరమైతే చట్టం తేవాలని, అప్పుడే భూములు ఇవ్వడానికి రైతులు ముందుకొస్తారని అంటున్నారు.

ఇదిలా ఉంటే, ఇండియాలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతం కలిగిన ఆంధప్రదేశ్ లో ఇప్పటికే అనేక పోర్టులు ఉండగా కార్యకలాపాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలుస్తోంది. ప్రధాన పోర్టులైన విశాఖ, కాకినాడ నుంచి మోస్తరు స్థాయిలో ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నా, మిగతా పోర్టుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆపరేషన్స్ జరగడం లేదని అంటున్నారు. గతంలో ఏపీ నుంచి ఐరన్ ఓర్ అధికంగా ఎగుమతి అయ్యేదని, కానీ ఇఫ్పుడా పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.వైఎస్ హయాంలోనే ఐరన్ ఓర్ మొత్తం ఊడ్చేశారని, ప్రస్తుతం గ్రానైట్ మాత్రమే ఎగుమతి అవుతోందని చెబుతున్నారు, కాకినాడ పోర్ట్ నుంచి ఎరువులు, కళింగపట్నం నుంచి గ్రానైట్ ఎగుమతి అవుతుండగా, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ, భావనపాడు పోర్టుల్లో పెద్దగా కార్యకలాపాలు లేవంటున్నారు, ఇవే ఇలాగుంటే కళింగపట్నం, భీమునిపట్నం, నర్సాపూర్, నిజాంపట్నం, వాడరేవు, ముత్యాలమ్మపాలెం, నక్కపల్లి, మేఘవరం పోర్టులు ఎలా మనుగడ సాగిస్తాయని అంటున్నారు.పోర్టుల్లో ఎగుమతులు, దిగుమతులు పెద్దఎత్తున జరగకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయి.

ఇదంతా పక్కనబెడితే బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం 30వేల ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత నాలుక్కరుచుకుంది, రైతుల ఆందోళనతో దిగొచ్చిన సర్కార్ భూసేకరణ నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోబోతోంది, మొదట్లో చెప్పినట్లుగా 30వేల ఎకరాలు కాకుండా 14వేల ఎకరాలను మాత్రమే భూసమీకరణ కింద తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు, ఇదే విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా ప్రకటించారు, అయితే ముందు 30వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత 14వేల ఎకరాలే చాలనడం...అదీ భూసమీకరణ చేస్తామనడం చూస్తుంటే...ప్రభుత్వం ఎలాంటి కసరత్తు లేకుండా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటుందోమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu