శ్రీలంక ప్రజలపై గ్యాస్ ‘బండ’

posted on: Apr 6, 2026 2:39PM

భారత్ పొరుగుదేశం శ్రీలంక ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. ఇక దేశం ఆర్థికంగా గాడిన పడుతుందని అంతా భావిస్తున్న వేళ.. ఉరుములేని పిడుగులా పశ్చిమాసియా లో నెలకొన్న యుద్ధవాతావరణం ఆ దేశాన్ని మళ్లీ కష్టాల కడలిలోకి నెట్టేసింది.

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంకకు మళ్లీ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశంలో ఎల్పీజీ గ్యాస్ ధరలను ఆ దేశం సవరించింది.  ఆ పెరిగిన లేదా పెంచిన ధరలు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్నాయి. దీనిపై దేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది.  
గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు, సహజ వాయువు ధరల పెరుగుదల కారణంగా శ్రీలంక గృహావసరాలను వినియోగించే ఎల్పీజీ సిలెండర్ ధరతో పాటు, చిన్న తరహా  వ్యాపార వినియోగదారులు వాడే 5 కిలోలు, 2.3 కిలోల సిలిండర్ల ధరలను కూడా  సవరించింది. 

ఏప్రిల్ లో శ్రీలంకలో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు. సరిగ్గా అలాంటి వేళ గ్యాస్ ధరలు పెరగడంతో దేశంలో పండగ కళ లేకుండా పోయింది.   గతంలో శ్రీలంక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న సమయంలో గ్యాస్   కోసం ప్రజలు కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సరఫరా సజావుగానే ఉన్నప్పటికీ, ధరలు మళ్ళీ పెరగడం ప్రజలలో ఆందోళన రేకెత్తిస్తున్నది.  ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల నుంచి గట్టిగా వినిపిస్తోంది. కనీసం రాయతీ అయినా ఇవ్వాలనీ, లేకుంటే ఆందోళనబాట పట్టడం వినా మరో గత్యంతరం లేదనీ జనం అంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...