యూట్యూబర్ నందు ఆమె భర్తకు లుకౌట్ నోటీసులు

posted on: Jun 5, 2026 3:54PM

 

యూకే వీసాల రెన్యువల్ పేరుతో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రముఖ యూట్యూటర్ నందు,ఆమె భర్త మధుకర్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా తమ వద్ద రూ.15 లక్షలు వసూలు చేసి మోసం చేశారని బాధితుడు శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

“నందూస్ వరల్డ్” పేరుతో పాపులర్ అయిన రమా నందన మరియు ఆమె భర్త మధుకర్‌పై వీసా మోసం ఆరోపణలు కొనసాగుతున్నాయి. యూకేలో ఉద్యోగాలు, వీసా స్పాన్సర్‌షిప్  ఇప్పిస్తామని చెప్పి చాలామంది నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు తీసుకున్నారని, మొత్తం 50 మందికిపైగా మోసపోయారని, మొత్తం వ్యవహారం కోట్ల రూపాయల్లో ఉండొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బాధితుల ప్రకారం, డబ్బులు తీసుకున్న తర్వాత వీసా లేదా ఉద్యోగం ఇవ్వలేదని, ఇచ్చిన డాక్యుమెంట్లు కూడా నకిలీవిగా తేలినట్లు చెబుతున్నారు. కొంతమంది డబ్బులు తిరిగి అడిగినప్పుడు కొంత భాగం మాత్రమే తిరిగి ఇచ్చి తర్వాత స్పందించలేదని కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో మధుకర్‌ను ఏ1గా, రమా నందనను ఏ2గా చేర్చినట్లు సమాచారం. అంతేకాదు, వీరిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.

ఇదే సమయంలో యూట్యూబర్ మధుకర్, బాధితుడు క్రాంతి మధ్య జరిగిన ఒక ఆడియో సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆడియో బయటకు రావడంతో ఈ వ్యవహారంపై మరింత దృష్టి పడుతోంది. మరోవైపు రమా నందన ఈ ఆరోపణలను ఖండించినట్లు తెలుస్తోంది. తమపై వ్యక్తిగత కక్షతో తప్పుడు ప్రచారం జరుగుతోందని, తమకు సంబంధం లేదని చెబుతూ చట్టపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. బాధితులు మరిన్ని ఆధారాలు సమర్పిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఇది నిజంగా మోసమా లేదా తప్పుడు ఆరోపణలా అన్నది అధికారిక దర్యాప్తు తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...