లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సూపర్ సక్సెస్
posted on Oct 26, 2025 7:43AM
.webp)
ఏపీ ఐటీ, మానవ వనరులు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఏడు రోజుల ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైంది. ఏడు రోజుల పాటు నాలుగు నగరాలలో సాగిన ఈ పర్యటన ఫలవంతమైంది. త్వరలోనే కీలక భాగస్వామ్యాలు కుదరనున్నాయి. ఈ విషయాన్ని నారా లోకేష్ స్వయంగా పేర్కొన్నారు. తన ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగిరానున్న నేపథ్యంలో ఆయన తన పర్యటన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ పర్యటన ద్వారా తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నాననీ, అలాగే పలు సంస్థలతో తాను జరిపిన చర్చలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ఫలవంతంగా సాగాయని లోకేష్ పేర్కొన్నారు.
ఈ ఏడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో యూనివర్సిటీలు, ప్రముఖ పరిశ్రమలు, ఇండియా-ఆస్ట్రేలియా కౌన్సిళ్లు, సీఫుడ్ వాణిజ్య సంస్థలు, క్రీడా సముదాయాల ప్రతినిధులతో సమావేశమయ్యానని పేర్కొన్న లోకేష్.. ఈ భేటీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న తమ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదం చేస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తన ఈ పర్యటనలో క్రీడారంగానికి ఉన్న ఆర్థిక ప్రాధాన్యతను గుర్తించినట్లు లోకేశ్ తెలిపారు.
క్రీడలను కేవలం వినోదంగానే కాకుండా, బలమైన ఆర్థిక కార్యకలాపాలుగా మార్చడంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని గుర్తించినట్లు వివరించారు. తన ఏడు రోజుల పర్యటనలో బాగంగా ఆస్ట్రేలియాలో జరిపిన చర్చలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు అర్థవంతమైన భాగస్వామ్యాలుగా మారతాయనే పూర్తి విశ్వాసంతో తిరిగి వస్తున్నానని లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు.