Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మానవత్వం పరిమళించే మంచి మనిషి నారా లోకేష్
posted on: Apr 19, 2026 10:39AM

ఆంధ్రప్రదేశ్‌లో మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మానవీయ ఉదంతం అందరి హృదయాలనూ కదిలిస్తోంది. అత్యంత అరుదైన వ్యాధితో పోరాడుతున్న పసిపాప పునర్విక కు మంత్రి నారా లోకేష్ ఒక అన్నగా అండగా నిలిచి.. ఆమెకు పునర్జన్మ ప్రసాదించారు. వివరాల్లోకి వెడితే..
కర్నూలు జిల్లాకు చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్విక. ఆమె జన్మించిన నెలల వ్యవధిలోనే శరీరంలో కదలికలు లోపించాయి. వైద్య పరీక్షల్లో ఆ పాప స్పైనల్ మస్కులర్ అట్రోఫీ' (ఎస్ఎమ్ఏ) అనే అత్యంత అరుదైన, అత్యంత ప్రాణాంతకమైన జన్యు వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ఈ వ్యాధికి చికిత్సగా వాడే జోల్గెన్స్మా (Zolgensma) ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ధర అక్షరాలా 16 కోట్ల రూపాయలు. ఒక సామాన్య కుటుంబానికి ఇది ఊహకందని భారం.
దీంతో తమ కుమార్తెను కాపాడుకునేందుకు పునర్విక తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా "సేవ్ పునర్విక" పేరుతో విరాళాల కోసం అభ్యర్థించారు. ఈ పిలుపునకు దాతలు స్పందించారు. దాతలు ద్వారా సుమారు 10 కోట్లు రూపాయలు సమకూరాయి. అయితే.. చికిత్సకు ఇంకా 6 కోట్ల రూపాయలు అవసరపడ్డాయి. పాప ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో.. ఆ కుటుంబం ఎక్స్ వేదికగా నారా లోకేష్ ను సహాయం కోసం అర్దించారు. వారి అభ్యర్థనకు తక్షణమే స్పందించిన నారా లోకేష్.. చిన్నారి పునర్విక బాధ్యత తీసుకున్నారు. అమెరికా నుండి ఖరీదైన 'జోల్గెన్స్మా ఇంజెక్షన్‌ను రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రెయిన్‌బో ఆసుపత్రిలో శుక్రవారం (ఏప్రిల్ 18) మంత్రి సమక్షంలోనే వైద్యులు పునర్వికకు ఈ ఇంజెక్షన్‌ను విజయవంతంగా అందించారు. ఆ సమయంలో పాపను ఎత్తుకుని లోకేష్ ఓదార్చారు. లోకేష్ చేతుల్లో సేదదీరుతున్న ఆ పాప దృశ్యాన్ని చూసిన అందరి కళ్లూ ఆనందంతో చమర్చాయి.
ఈ సంఘటన మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించింది. ఒక నాయకుడు ప్రజల కష్టాలకు ఎలా స్పందించాలో లోకేష్ తన చర్య ద్వారా చూపారని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నా చెల్లెలి చిరునవ్వు కోసం ఎంతైనా చేస్తాను అంటూ లోకేష్ ఇచ్చిన భరోసా, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఆ కుటుంబంలో కొత్త వెలుగులు నింపింది. పునర్విక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పునర్విక వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఈ ఇంజెక్షన్ వల్ల ఆమె శరీరంలో క్రమంగా కదలికలు వస్తాయని, త్వరలోనే ఆమె సాధారణ స్థితికి చేరుకుంటుందని వైద్యులుచెబుతున్నారు.






