Latest News
నారా లోకేష్ సీఎం.. లైన్ క్లియర్.. నాగబాబు ప్రశంసల సంకేతం అదేనా?
posted on: Mar 18, 2026 9:09AM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్న చర్చ మంత్రి లోకేష్ కు సీఎంగా ప్రమోషన్ కు లైన్ క్లియర్ అయ్యేదెపుడు? జనసేనాని పవన్ కల్యాణ్ సమ్మతిస్తారా? అన్నదే. అయితే ఈ విషయంలో ఎటువంటి సందేహాలకూ తావు అవసరం లేదనీ, లోకేష్ కు ప్రమోషన్ విషయంలో జనసేన నుంచి ఎటవంటి అభ్యంతరాలూ ఉండవన్న సంకేతాలు వస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. మరో దశాబ్దంనర పాటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ జనసేనాని పవన్ కల్యాణ్ ఉద్ఘాటిస్తూనే ఉన్నారు. అయినా రాజకీయవర్గాలలో ఈ విషయంలో డౌటానుమానాలు వ్యక్తమౌతూనే వస్తున్నాయి. అయితే తాజాగా జనసేన కీలక నేత, ఎమ్మెల్సీ, స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు అయిన నాగబాబు చేసిన ట్వీట్ తో ఈ డౌటానుమానాలన్నీ దూది పింజెల్లా తేలిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇంతకీ విషయమేంటంటే.. ఏపీ రాజకీయాలలో కూటమి నేతల మధ్య సమన్వయం బలంగా ఉందనీ, విభేదాలు, భిన్నాభిప్రాయాలూ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవాలేననీ తేలిపోయేలా నాగబాబు మంత్రి లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. లోకేష్ రాజకీయ పరిణితి, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు అద్భుతమని నాగబాబు ఇటీవల సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ గా మారింది. లోకేష్ పై నాగబాబు ప్రశంసల వర్షం కురిపించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా పోలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు కూడా దారితీసింది.
ఇటీవల ఒక పాఠశాలలో జరిగిన ఘటనపై లోకేష్ తక్షణమే స్పందించడం, తప్పును ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పడంపై స్పందించారు. అధికారంలో ఉన్న వ్యక్తి చిన్న పొరపాటు జరిగినా బాధ్యత తీసుకోవడం అనేది ఒక ఉత్తమ నాయకత్వ లక్షణమని, ఆ లక్షణం లోకేష్ లో పుష్కలంగా ఉందనీ నాగబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులలో లోకేష్ ముందు వరుసలో ఉన్నారని పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వ పటిమను ప్రస్తుతిస్తూ నాగబాబు చేసిన ట్వీట్.. రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలలో లోకేష్ ప్రాధాన్యత కలిగిన పాత్ర పోషించడానికి లైన్ క్లియరెన్స్ లో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వాస్తవానికి గతంలో లోకేష్‌పై విమర్శలు చేసిన వారు సైతం, ఇప్పుడు ఆయన తనను తాను మేకోవర్ చేసుకుని ప్రజానాయకుడిగా ఎదిగిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వడం, పాలనలో తనదైన ముద్ర వేయడం ద్వారా లోకేష్ తన గ్రాఫ్ ను పెంచుకున్నారు. నాగబాబు వంటి కీలక నేత ఈ స్థాయిలో స్పందించడం వెనుక కూటమిలోని ఐక్యత ప్రస్ఫుటం కావడంతో పాటు.. లోకేష్ కు ప్రమోషన్ కు లైన్ క్లియర్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేసులో లోకేష్ కు జనసేన నుంచి ఎటువంటి అభ్యంతరాలూ ఉండవన్న సంకేతాన్ని నాగబాబు తన ట్వీట్ ద్వారా ఇచ్చినట్లైందని అంటున్నారు.






