Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...6 గదులకు లైసెన్స్.. కానీ ఉన్నవి పాతిక రూమ్ లు.. ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు
posted on: Jun 4, 2026 10:03AM

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఘోర విషాదం ముంచెత్తింది. దక్షిణ ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే మాల్వియానగర్ హౌజ్ రాణి ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్న ఫ్లరిష్ స్టే బీ అండ్ బీ అనే ఐదంతస్తుల హోటల్‌లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయాకరు. కేవలం వ్యాపార స్వార్థం, నిబంధనల ఉల్లంఘన వల్లే ఇంత మంది మరణించారని ప్రథమిక విచారణలో తేలింది.
హోటల్ బేస్‌మెంట్‌లో ఉన్న రెస్టారెంట్‌లో తొలుత మంటలు ప్రారంభమయ్యాయి. క్షణాల్లోనే అగ్నికీలలు వేగంగా విస్తరించి అంతస్తులకు, పక్కనే ఉన్న మరో హోటల్‌కు కూడా వ్యాపించాయి. దట్టమైన పొగలు హోటల్ గదులను కమ్మేయడంతో లోపల ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం పైనుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. హోటల్ గదుల్లో చిక్కుకుపోయిన 40 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.
ఈ అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 8 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో మరణించిన 21 మందిలో 17 మంది విదేశీయులే ఉన్నారు. లైబీరియా, నైజీరియా, మొజాంబిక్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి వైద్యం కోసం భారతదేశానికి వచ్చిన మెడికల్ టూరిస్టులు, వారికి సహాయకులుగా వచ్చినవారు ఈ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు.
పోలీసులు, మున్సిపల్ అధికారులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హోటల్ యాజమాన్యం నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసింది. హోటల్ యజమాని లవ్‌కేశ్ బజాజ్ కేవలం 6 గదుల నిర్వహణకు మాత్రమే ప్రభుత్వ అనుమతి అంటే లైసెన్స్ తీసుకున్నాడు. కానీ, నిబంధనలను తుంగలోకి తొక్కి ఏకంగా పాతిక రూములను నిర్మించాడు. ఇంత పెద్ద భవనానికి బయటకు రావడానికి కేవలం ఒకే ఒక్క ఇరుకైన మార్గం మాత్రమే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇరుకైన దారి గుండా జనాలు బయటకు రాలేకపోవడం, ప్రత్యామ్నాయ అత్యవసర ద్వారాలు లేకపోవడం వల్లే పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయని అధికారులు నిర్ధారించారు.
ప్రస్తుతం హోటల్ యజమాని లవ్‌కేశ్ బజాజ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘోర దుర్ఘటనపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన విదేశీ, స్వదేశీ బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.






