Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎంతసేపైనా చర్చిద్దాం.. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై కేంద్రం
posted on: Apr 16, 2026 5:46PM

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలుకుతూ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై చారిత్రక చర్చ ప్రారంభమైంది. గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డిలిమిటేషన్ బిల్లుపై సుమారు మారథాన్ చర్చ నిర్వహించాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. ఈ చర్చలో ప్రతి రాజకీయ పార్టీకి తమ వాదనను గట్టిగా వినిపించేందుకు తగిన సమయం కేటాయించనున్నట్లు చెప్పారు.
ఒక పార్టీ తరఫున ఎంత మంది సభ్యులు మాట్లాడాలని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన ఒకవేళ ఒక పార్టీ తరఫున ఒక సభ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ సభ్యుడికి కావాల్సినంత సమయం ఇస్తామన్నారు చెప్పారు. బిల్లులపై 22 గంటల వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికార పక్షం ఇలా సమయం ఇవ్వడం, సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మూడు కీలక బిల్లులు దేశ రాజకీయ భవిష్యత్తును మార్చనున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు మరియు లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి 850కి పెంచేందుకు ఈ బిల్లులను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతి రాజకీయ పక్షం తమ గళాన్ని వినిపించేందుకు వీలుగా చర్చా సమయాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించారు. కిరణ్ రిజుజు ఈ బిల్లులపై ఎంతసేపైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సభలో ప్రకటించారు. సమయా భావం సమస్య తలెత్తకుండా సమయం కేటాయించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో సంఖ్యా బలంతో సంబంధం లేకుండా చిన్న పార్టీలకు కూడా చర్చలో ప్రసంగించేందుకు తగిన సమయం కేటాయించనున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ప్రతి పార్టీకి మూడు గంటల సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. శుక్రవారం (ఏప్రిల్ 17) సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్ ఉంటుందని పేర్కొన్న ఆయన అవసరమైతే రాత్రి పొద్దుపోయినా సభ కొనసాగిస్తానని చెప్పారు.
కాగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల గళాన్ని గట్టిగా వినిపించేందుకు ప్రాంతీయ పార్టీలు సమాయత్తమౌతున్నాయి. అంతకు ముందు చర్చలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ల విషయంలో రాజకీయ రంగు పులమవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లులు అత్యంత అవసరమన్నారు.






