సియోల్ లో ఎల్ఈటీ ఉగ్రవాది అరెస్ట్.. తొలగిన పాక్ ఉగ్రముసుగు!

posted on: Apr 26, 2026 7:00AM

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఒక పాకిస్తానీ పౌరుడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ పరిణామం కేవలం ఒక వ్యక్తి అరెస్ట్‌కు మాత్రమే పరిమితం కాదు.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను ఏ విధంగా విస్తరిస్తున్నాయో తేటతెల్లం చేస్తోంది. ముఖ్యంగా అత్యంత సురక్షితమని భావించే దేశాలలో కూడా  పాక్ భూభాగం నుంచి తన కార్యకలాపాలను నిర్వహించే లష్కరే తోయిబా స్లీపర్ సెల్స్  ఏ విధంగా చొరబడుతున్నాయన్నది ఈ ఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది. గ్యాంగీ నాంబు ప్రావిన్షియల్ పోలీస్ ఏజెన్సీ అధికారుల  సమాచారం ప్రకారం..  సియోల్‌లోని ఇటావన్ ప్రాంతంలో ఒక దుకాణంలో క్లర్క్‌గా పనిచేస్తున్న   40 ఏళ్ల పాకిస్తానీని  అదుపులోకి తీసుకున్నారు. 

ఈ వ్యక్తి చాలా కాలంగా తక్కువ ప్రొఫైల్‌ మెయిన్ టైన్ చేస్తూ..  ఒక సాధారణ వలస కార్మికుడిలా జీవిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే, లోతైన విచారణలో అతను  లష్కరే తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు నిర్ధారణ అయింది.దర్యాప్తులో బయటపడిన మరో విస్తుపోయే నిజం ఏమిటంటే, అతను 2023 సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌లోని కొరియా కాన్సులేట్ ద్వారా బిజినెస్  వీసా  పొందాడు. ఇక్కడ ఒక వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లు నకిలీ పత్రాలను, తప్పుడు ఉపాధి చరిత్రతో  కొరియాలోకి ప్రవేశించాడు. 2023 డిసెంబర్‌లో దక్షిణ కొరియాలోకి  అడుగుపెట్టినప్పటి నుంచి ఇతడు ఎవరికీ అనుమానం రాకుండా నిశ్శబ్దంగా తన కార్యకలాపాలను సాగిస్తున్నాడు. ప్రస్తుతం అతనిపై కొరియా ఉగ్రవాద వ్యతిరేక చట్టాలతో పాటు ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.

లష్కరే తోయిబా అనేది కేవలం దక్షిణాసియాకే పరిమితమైన ముఠా కాదని, ఇది ఒక ప్రపంచవ్యాప్త ముప్పు అని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2005లోనే ఐక్యరాజ్యసమితి దీనిని నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. 2008 ముంబై దాడుల వంటి దారుణాలకు పాల్పడిన చరిత్ర ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు విదేశాల్లో వీసా నిబంధనలను ఆసరాగా చేసుకుని తన ఉనికిని చాటుకుంటోంది. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాద సంస్థ సభ్యుడిని దక్షిణ కొరియా అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఈ అరెస్ట్ నేపథ్యంలో పాకిస్తాన్ పాత్రపై మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. పాకిస్తాన్ భూభాగంపై లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ వంటి ఉగ్ర  సంస్థలు శిక్షణ శిబిరాలను, ఫండ్ రైజింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు పలు నివేదికలు ఇప్పటికే తేటతెల్లం చేశాయి.  స్లీపర్ సెల్స్ వ్యూహంలో భాగంగా ఉగ్రవాదులు సామాన్య వలస కార్మికులుగా, విద్యార్థులుగా లేదా వ్యాపారవేత్తలుగా విదేశాల్లో స్థిరపడి..  సుదీర్ఘ కాలం పాటు అక్కడి స్థానిక సమాజంలో కలిసిపోయి అవసరమైనప్పుడు ఉగ్ర సంస్థలకు లాజిస్టిక్ మద్దతు, నిధులు,  ఆశ్రయం కల్పించే ప్రాపర్టీలుగా మారుతున్నారు. దక్షిణ కొరియా కేసు ఈ   ముప్పును గ్లోబల్ భద్రతా సంస్థలకు కళ్లకు కట్టినట్లు చూపింది. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులను అడ్డుకోవాలంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ప్రపంచ దేశాల మధ్య మరింత సమన్వయం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వీసా జారీ చేసే సమయంలో దరఖాస్తుదారుల నేపథ్యాన్ని ఇంటర్ పోల్ వంటి అంతర్జాతీయ డేటాబేస్ లతో  సరిపోల్చడం, నిఘా సమాచారాన్ని షేర్ చేసుకోవడం అవసరమని అంటున్నారు. 

ఉగ్రవాదం తమకు సంబంధం లేని విషయమని భావించే దేశాలు కూడా  అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని దక్షిణ కొరియాలో ఎల్ఈటీ ఉగ్రవాది అరెస్టు ఎత్తి చూపుతోంది.  ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలంటే ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం, ఉమ్మడి వ్యూహం అవసరమని ఈ సంఘటన తెలియజేస్తోంది. 

-సీతారాం కంఠంనేని

google-ad-img
    Related Sigment News
    • Loading...