దేశంలో పేలుళ్లకు లష్కరే కుట్ర.. హై అలర్ట్

posted on: Feb 21, 2026 12:52PM

ఢిల్లీలో ఎర్రకోటతోపాటు దేశ వ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్ర మూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు గుర్తించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కర్-ఎ-తోయిబా దాడులకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఐఈడీ బాంబులతో దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్టు వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశరాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఫిబ్రవరి 6న పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఎల్ఈటీ ఈ దాడులను ప్లాన్ చేస్తోంది. ఇస్లామాబాద్ దాడిలో 31మంది మరణించగా.. 160 మంది గాయాలపాలయ్యారు. అయితే, ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది.
గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు దాడిలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే.  అంతకు రెండింతల మంది గాయాలపాలయ్యారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పేలుడు పదార్థాలున్న కారుతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా అతడిని గుర్తించారు.

అంతకుముందు, పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఏకంగా 2,900 కేజీల పేలుడు పదార్థాలను   స్వాధీనం చేసుకుని భారీ ఉగ్రకుట్రను ఆదిలోనే భగ్నం చేశారు. దీంతో, తమ ప్లాన్ గురించి పోలీసులకు తెలిసిందన్న కంగారులో ఉమర్ మొహమ్మద్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని నిఘావర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ అదిల్ రాథర్‌తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉగ్రదాడులకు సంబంధించి నిఘావర్గాల తాజా సమాచారం ఆధారంగా దేశవ్యప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...