లెన్స్‌కార్ట్ డ్రస్ కోడ్ వివాదం...భగ్గుమన్న బీజేపీ

posted on: Apr 21, 2026 2:46PM

 

ప్రముఖ ఐవేర్ రిటైల్ దిగ్గజం లెన్స్‌కార్ట్ ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. తమ సంస్థలో పనిచేసే సిబ్బందికి సంబంధించి రూపొందించిన ఒక 'స్టైల్ గైడ్' పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సంస్థ సీఈఓ పీయూష్ బన్సల్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హిందూ సంప్రదాయాలకు సంబంధించిన చిహ్నాలను ధరించవద్దంటూ ఆ పత్రంలో ఉన్న నిబంధనలు తీవ్ర చర్చకు దారితీశాయి.

వైరల్ అయిన ఆ డాక్యుమెంట్‌లో ఉద్యోగులు బొట్టు, తిలకం, చేతికి దారాలు లేదా పట్టీలు ధరించకూడదని, సింధూరం కూడా నుదుటిపై కనిపించకూడదని పేర్కొనడం గమనార్హం. అదే సమయంలో హిజాబ్‌కు మాత్రం అనుమతి ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సంస్థ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాజియా ఇలాహీ ఖాన్ షారూమ్‌లోకి వెళ్లి ఉద్యోగులకు స్వయంగా తిలకం దిద్దారు. హిజాబ్‌కు అనుమతి ఇచ్చి బొట్టుపై ఆంక్షలు పెట్టడంపై  సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రారంభంలో ఈ వార్తలను 'అవాస్తవం' అని కొట్టిపారేసిన పీయూష్ బన్సల్, అనంతరం సాక్ష్యాలు బయటకు రావడంతో మాట మార్చారు. అది పాత డాక్యుమెంట్ అని, తప్పులను సరిదిద్దామని పేర్కొన్నప్పటికీ, ఆ వివరణలో నిజాయితీ లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఆయన పదేపదే తన వాదనను మార్చడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా కొందరు మాజీ ఉద్యోగులు బయటకు వస్తున్నారు. తమకు విధించిన ఇబ్బందికరమైన నిబంధనలను, వాటిని పాటించని పక్షంలో ఎదుర్కొన్న వేధింపులను వారు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మతపరమైన చిహ్నాలను తొలగించుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న హెచ్చరికలు వచ్చినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినా, లేదా మతపరమైన ఆచారాలను వదులుకోవడానికి నిరాకరించినా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఒకవైపు కంపెనీ విధానాలు మారుస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని అర్థమవుతోంది.

ప్రస్తుతం ఈ ఘటన కార్పొరేట్ రంగంలో మత వివక్షపై పెద్ద చర్చకు దారితీసింది. పారదర్శకత లేని విధానాలతో సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లెన్స్‌కార్ట్ యాజమాన్యం ఇకనైనా స్పందించి, వివక్షను తొలగించి అందరు ఉద్యోగుల విశ్వాసాలను గౌరవించాలని ఆశిద్దాం.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...