కేర‌ళ‌లో వామ‌ప‌క్షం చెప్పేదొక‌టీ.. చేసేదొక‌టీనా?!

posted on: Jun 6, 2026 5:00PM

అవినీతి పెట్టుబడిదారీ వ్యవస్థది మాత్రమే కాదు అందులో  వామపక్ష వాదులూ భాగస్వాములేనా? –  కేరళలో మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణ విజయ‌న్, ఆమె కంపెనీ ఎక్స‌లాజిక్ సొల్యూష‌న్స్, కోచిన్ మినరల్స్ అండ్ ర్యూటైల్ లిమిటెడ్ (సీఎమ్ఆర్ఎల్ చుట్టూ తిరుగుతున్న ఆర్థిక నేరాల ఆరోపణలు ఇప్పుడు కేవలం ఒక కేసు పరిమితిలో లేవు.

ఇవి కమ్యూనిస్టు రాజకీయాల నైతికత, పెట్టుబడిదారీ వ్యవస్థతో వారి అసలు సంబంధం, కార్పొరేట్ రాజకీయ అవినీతి గాఢత అన్న మూడు స్థాయిల్లో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.  పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ, అవినీతి, కార్పొరేట్ దాహం.. అని 24 గంటలు ఉపన్యాసాలు చేసే కమ్యూనిస్టు నాయకత్వం… అదే పెట్టుబడిదారీ కంపెనీల నుంచి సర్వీసులు లేకుండానే  కోట్ల రూపాయలు తీసుకుందనే ఆరోపణల కింద ఇప్పుడు దర్యాప్తు ఎదుర్కొంటోంది.

సీఎమ్ఆర్ఎల్ లో  130 నుంచి  180 కోట్ల రూపాయల వరకు నకిలీ ఖర్చులు, వాటిలో భాగంగా వీణ విజయన్ కంపెనీకి 2.78 కోట్లు, తిరిగి చెల్లించనవసరం లేని 50 లక్షల రూపాయల అప్పు, ఇప్పుడు ఈడీ  ఫ్రీజ్ చేసిన 18.36 కోట్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్లు.. ఇవన్నీ కలిపి ఇది ఒక వ్యక్తి, ఒక కంపెనీ కేసు కాదని, రాజకీయ, కార్పొరేట్, నియంత్రణ వ్యవస్థ కలిసిన అతి పెద్ద అవినీతి కథగా సూచిస్తున్నాయి. 

సీఎమ్ఆర్ఎల్ ఒక సాధారణ మైనింగ్ కంపెనీయేనా, రాజకీయ నిధుల కేంద్రమా? అన్న చ‌ర్చ న‌డుస్తోంది.  సీఎమ్ఆర్ఎల్  కేరళలో ఇల్మెనైట్, ర్యూటైల్ వంటి మినరల్స్ ప్రాసెసింగ్ చేసే ప్రైవేట్ కంపెనీ.  2019 జనవరిలో ఆదాయపు పన్ను శాఖ ఈ కంపెనీపై దాడులు జరిపినప్పుడు, సుమారు  130 కోట్ల నకిలీ ఖర్చులు బుక్ చేసినట్టు బయటపడింది. 

ట్రాన్స్‌పోర్ట్, స్లడ్జ్ హ్యాండ్లింగ్, క్యాష్ ఎక్స్‌పెన్సెస్ పేర్లతో ఈ ఖ‌ర్చులు చూపారు. ఆదాయపు పన్ను సెటిల్‌మెంట్ కమిషన్ ముందు సీఎమ్ఆర్ఎల్ ఈ నకిలీ ఖర్చులను అంగీకరించింది కూడా.  ఆ తర్వాత ఎస్ఎఫ్ఐఓ అంటే సీరియ‌స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస్  దర్యాప్తు ప్రారంభమైంది. కార్పొరేట్ ఫ్రాడ్, బోగస్ ఖర్చులు, రాజకీయ నాయకులు, మీడియా, అధికారులకు చెల్లింపులు వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

కేరళలో  దశాబ్దాలుగా.. పెట్టుబడిదారీ వ్యవస్థను  దోపిడీ యంత్రంగా చిత్రీకరిస్తూ.. కార్పొరేట్, రాజకీయ అవినీతి మీద ఘాటైన విమర్శలు చేస్తూ..   సోషలిజమే సర్వరోగ నివారణిగా ప్రచారం చేస్తూ వచ్చింది.  ఇప్పుడు అదే వామ‌పక్ష నాయకత్వం చుట్టూ తిరుగుతున్న ఆరోపణలు ఏమంటున్నాయి?

ఒక ప్రైవేట్ మైనింగ్ కంపెనీ సీఎమ్ ఆర్ఎల్ నకిలీ ఖర్చుల పేరుతో క్యాష్ జనరేట్ చేసి..  ఆ డబ్బులో కొంత‌ భాగం రాజకీయ నాయకులు, పార్టీలు, మీడియాకు, అధికారులకు వెళ్లిందని ఐటీ రికార్డులు చెబుతున్నాయి. ఇది సిద్ధాంతం, ఆచరణ మధ్య గ‌ల వైరుధ్యాన్ని ఎత్తి చూపుతోంది.

2019.. ఆదాయపు పన్ను దాడులు, నకిలీ ఖర్చుల బహిర్గతమ‌య్యాయి. జనవరి 2019.. ఐటీ శాఖ సీఎమ్ఆర్ఎల్ పై దాడులు. ఈ ద‌ర్యాప్తులో సుమారు  .130 కోట్ల రూపాయల నకిలీ ఖర్చులు గుర్తింపు.  తరువాత ఎస్ఎఫ్ఐఒ  విచారణలో 15 ఏళ్ల కాలంలో  182 కోట్ల రూపాయల వరకు ఫిక్టిషియస్ క్యాష్ ఎక్స్‌పెన్సెస్ బుక్ చేసినట్టు ఆరోపణ వ‌చ్చింది. 

2017–2020 మ‌ధ్య సాగిన ఎక్స‌లాజిక్ చెల్లింపుల విష‌యానికి వ‌స్తే.. ఐటీ, ఎస్ఎఫ్ఐఓ  రికార్డుల ప్రకారం.. 2017–2020 మధ్య సీఎమ్ఆర్ఎల్ నుంచి వీణ విజయన్ కంపెనీ ఎక్స‌లాజిక్ సొల్యూష‌న్ కంపెనీకి సుమారు రూ.2.78 కోట్ల  చెల్లింపులు జ‌రిగాయి. అవి కూడా ఐటీ కన్సల్టెన్సీ, సాఫ్ట్‌వేర్ సర్వీసులు  పేరిట చూపారు. కానీ..  దర్యాప్తు సంస్థల అభిప్రాయం ఏంటేంటే.. ఎలాంటి సర్వీసులు అందించలేదని, ఇది  ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్‌ను సంతృప్తిపరచడానికి ఇచ్చిన నెలవారీ రెమ్యూనరేషన్ అని ఐటీ ఆర్డర్‌లో కామెంట్ చేశారు.
 
అదే సమయంలో, సీఎమ్ఆర్ఎల్ ఎంీ కార్తా కుటుంబం నిర్వహించే ఎంప‌వ‌ర్ ఇండియా క్యాపిట‌ల్ నుంచి ఎక్స‌లాజిక్ కి రూ.50 లక్షల తిరిగి చెల్లించనవసరం లేని రుణం ఇచ్చినట్టు త‌న‌ చార్జ్‌షీట్ ద్వారా  తెలియ చేసింది ఎస్ఎఫ్ఐఓ.
 
2023–2025..  ఎస్ఎఫ్ఐఓ చార్జ్‌షీట్, కార్పొరేట్ ఫ్రాడ్ కేసు వివ‌రాల‌ను ఒక సారి  ప‌రిశీలిస్తే..  2023 నాటి ఐటీ సెటిల్‌మెంట్ బోర్డు ఆర్డర్‌లో 
సీఎమ్ఆర్ఎల్ ఎక్స‌లాజిక్ చెల్లింపుల ప్రస్తావన వెలుగులోకి రావడంతో రాజకీయ వివాదం మొదలైంది. 2025 ఏప్రిల్ 3న‌ ఎస్ఎఫ్ఐఓ, సీఎమ్ఆర్ఎల్ ఎండీ శ‌శిధరన్ కార్తా, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర 12 మందిపై కార్పొరేట్ ఫ్రాడ్ కింద ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేసింది ఎర్నాకుళం అదనపు సెషన్స్ కోర్టు. 

2026 మేలో హైకోర్టు తీర్పు..  ఈడీ  రైడ్స్, ఖాతాల ఫ్రీజ్ వంటి ఘ‌ట‌న‌లు న‌మోద‌య్యాయి. 2026 మే 26న  
సీఎమ్ఆర్ఎల్, ఈడీ  దర్యాప్తును ఆపాలని కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసి, 
పీఎమ్ఎల్ఏ కింద ఈడీ  దర్యాప్తు కొనసాగించవచ్చని, ప్రెడికేట్ ఆఫెన్స్ ఎఫ్ఐఆర్ లేకుండానే ఈడీ  ఇన్వెస్టిగేషన్ ప్రారంభించవచ్చని స్పష్టం చేసింది. 

2026 మే 27న ఈడీ.. తిరువనంతపురం, కన్నూర్, ఎర్నాకుళం, కొట్టాయం, బెంగళూరు సహా 10 ప్రాంగణాల్లో దాడులు చేసింది. ఇందులో.. మాజీ సీఎం పినరయి విజయన్ నివాసం, వీణ విజయన్ నివాసం, ఎక్స‌లాజిక్కార్యాలయాలు, సీఎమ్ఆర్ఎల్ డైరెక్టర్ల  నివాసాలు ఉన్నాయి. 2026 మే 27–28 ఈడీ ప్రకటన ప్రకారం, 242 బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.18.36 కోట్లు ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ డాక్యుమెంట్లు, ఇన్వెస్ట్‌మెంట్ రికార్డులు, డిజిటల్ ఎవిడెన్స్ స్వాధీనం చేసుకున్నారు.  

న్యాయపరమైన అంశాలు ఎలాంటివో చూస్తే.. ఐటీ, ఎప్ఎఫ్ఐఓ, పీఎమ్ఎల్ఏ మూడు స్థాయిల దర్యాప్తు జ‌రిగింది.  ఆదాయపు పన్ను సెటిల్‌మెంట్ కమిషన్, నకిలీ ఖర్చుల అంగీకారం సైతం  న‌మోదైంది. ఐటీ  సెటిల్‌మెంట్ కమిషన్  విష‌యానికి వ‌స్తే.. సీఎమ్ ఆర్ఎల్ చూపిన నకిలీ ఖర్చులను, క్యాష్ జనరేషన్, ఎక్సలాజిక్ కి చెల్లింపుల క‌ల్పిత‌ స్వభావాన్ని అంగీకరించింది. 

అయితే ఐటీ సెటిల్‌మెంట్ కమిషన్ ఇచ్చిన ఇమ్యూనిటీ, పీఎమ్ఎల్ఏ కింద ఈడీ దర్యాప్తునకు వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఎఫ్ఐఓ కార్పొరేట్ ఫ్రాడ్, ఫేక్ ఎక్స్‌పెన్సెస్, బ్రైబరీ  ఎస్ఎఫ్ఐఓ  చార్జ్‌షీట్ ప్రకారం..  15 ఏళ్ల కాలంలో రూ.182 కోట్ల క‌ల్పిత ఖ‌ర్చుల్లో భాగంగా సుమారు రూ.91 కోట్ల చెల్లింపులు కార్తా కుటుంబానికి చెందిన ఇతర కంపెనీలకు, వీణ విజయన్ కంపెనీకి- రూ.2.78 కోట్ల ఫ్రాడ్యులెంట్ పేమెంట్స్, ఎంప‌వ‌ర్ ఇండియా నుంచి ఎక్స‌లాజిక్ కి రూ.50 లక్షల లోన్, రీపేమెంట్ లేకుండా.. ఇవి అన్నీ కార్పొరేట్ ఫ్రాడ్, బ్రైబరీ, మనీ లాండరింగ్ అనుమానాలకు బలమైన ఆధారాలుగా చెబుతోంది ఈడీ. 

ఈడీ, పీఎమ్ఎల్ఏ,  కేరళ హైకోర్టు తీర్పు కీలకాంశాలు ఎలాంటివంటే.. ప్రెడికేట్ ఆఫెన్స్ ఎఫ్ఐఆర్ లేకుండానే ఈడీ ప్రాథమిక విచారణ, సమన్లు జారీ చేయవచ్చు. ఐటీ  సెటిల్‌మెంట్ కమిషన్ ఇచ్చిన ఇమ్యూనిటీ, పీఎమ్ఎల్ఏ  కేసులకు వర్తించదు – రెండు చట్టాలు స్వతంత్రం.

ఎస్ఎఫ్ఐఓ  ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఇప్పుడు పీఎమ్ఎల్ఏ షెడ్యూల్డ్ ఆఫెన్స్ కింద వస్తుంది, కాబట్టి  ఈడీ  దర్యాప్తు చట్టబద్ధం. ఇది కేవలం ఈ కేసుకే కాదు..  దేశవ్యాప్తంగా కార్పొరేట్, రాజకీయ అవినీతి కేసుల్లో  ఈడీ  పాత్రను బలపరిచే న్యాయపరమైన మైలురాయిగా భావించవచ్చు.

ఇందులోని  రాజకీయ, సామాజిక, మీడియా కోణాలు..  సీపీఎం వాదన ఎలా ఉందంటే.. రాజకీయ ప్రతీకారం, ఫెడరలిజంపై దాడి అని. సీపీఎం, వామపక్ష శ్రేణులు.. ఈ కేసును.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఈడీ, సీబీఐ వంటి  దర్యాప్తు సంస్థలను ఉపయోగించి.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై, ముఖ్యంగా కేరళ, బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో.. రాజకీయ ప్రతీకారం త‌ర‌హా దర్యాప్తులు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఎక్స‌లాజిక్, సీఎమ్ఆర్ఎల్ ఒప్పందం-  లెజిటిమేట్ బిజినెస్ కాంట్రాక్ట్  అని, సర్వీసులు అందించామని, ఐటీ, ఎస్ఎఫ్ఐఓ ఈడీ  నివేదికలు.. పాక్షిక, రాజకీయ ప్రేరేపితంగా వాదిస్తోంది సీపీఎం.

ప్రతిపక్షం, మీడియా వాద‌న‌లు ఎలా ఉన్నాయంటే.. కమ్యూనిస్టుల నైతిక దివాళా.. కేరళలో కాంగ్రెస్, బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు..  కమ్యూనిస్టులు కార్పొరేట్ డబ్బు తీసుకుంటారు, కానీ ప్రజల ముందు పెట్టుబడిదారీ వ్యవస్థను తిట్టుతారు.. అని ఘాటుగా విమర్శిస్తున్నాయి.  సోషలిజం పేరిట‌ పేదల ఓట్లు, పెట్టుబడిదారీ కంపెనీల నుంచి నిధులు,  రెండూ ఒకేసారి తీసుకునే ద్వంద్వ వైఖరిగ‌ల‌ రాజకీయంగా దాడి చేస్తున్నారు. 

మీడియా కథనాల్లో.. రెండు ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో ఒక‌టైన‌.. ప్రో వామ‌ప‌క్ష లిబ‌ర‌ల్ వాద‌న ఎలాంటిదో చూస్తే..  ఈడీ దర్యాప్తులు ఎంపిక చేసిన ప్రతిపక్ష నేతలపైనే ఎక్కువగా జరుగుతున్నాయని, కేంద్ర సంస్థల విశ్వసనీయత దెబ్బతింటోందని ఆందోళన వ్య‌క్తం చేస్తోంది.

రెండోది ప్రో–నేషనలిస్ట్, కన్సర్వేటివ్ వాదన.. ఐటీ, ఎస్ఎఫ్ఐఓ, హైకోర్టు తీర్పు, ఈడీ రైడ్స్.. ఇవన్నీ కలిపి చూస్తే..  ఇది కేవలం రాజకీయ కేసు కాదు, అతి భ‌యంక‌ర‌మైన‌ కార్పొరేట్, రాజకీయ అవినీతి కేసుగా చెబుతున్నారు.  ఇక వీధుల్లో ప్రతిస్పందన..  ఈడీ  వాహనాలపై దాడులు ఎలాంటివంటే.. ఈడీ బృందాలు పినరయి విజయన్ నివాసం నుంచి బయలుదేరుతున్నప్పుడు సీపీఎమ్  కార్యకర్తల నిరసనలు హింసాత్మకంగా మారినట్టు చెబుతున్నాయి గ్రౌండ్ రిపోర్టులు.

ఈడీ వాహనాలపై రాళ్లు, వస్తువులు విసిరిన ఘటనలు న‌మోద‌య్యాయి. కేంద్ర సంస్థలపై  ఫెడరలిజం హననం వంటి నినాదాలు వినిపించాయి. ఈ కేసు కేవలం కోర్టు గదుల్లోనే కాదు, వీధి రాజకీయాల్లో కూడా పెద్ద పోరాటంగా మారిన‌ట్టు క‌నిపిస్తోంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో..  కమ్యూనిస్టు నైతికతపై ప‌లు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కేసు వల్ల వామపక్షంపై ప్రధానంగా వినిపిస్తోన్న‌ ప్రశ్న ఏంటంటే.. పెట్టుబడిదారీ వ్యవస్థ,  ఫ‌క్తు దోపిడీ అని చెప్పే వారు, అదే పెట్టుబడిదారీ కంపెనీల నుంచి సర్వీసులు లేకుండానే కోట్ల రూపాయలు తీసుకుంటే.. అది సిద్ధాంత ద్రోహమా? లేక సాధారణ అవినీతేనా? కేరళలో సీపీఎంకు ఉన్న  నైతిక ఇమేజ్‌కు ఇది పెద్ద దెబ్బగా మారింది.

ఓవ‌రాల్ గా సీఎమ్ఆర్ఎల్  కేసు ద్వారా బయటపడుతున్నది ఏంటంటే..  ఒక ప్రైవేట్ మైనింగ్ కంపెనీ, రాజకీయ నాయకులు, మీడియా, ప్రభుత్వ అధికారులు, కన్సల్టెన్సీ కంపెనీలు.. ఇవన్నీ కలిసిన  లోపాయికారి ఒప‌్పందంలో భాగంగా తెలుస్తోంది. ఇది కేవలం కేరళకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా మైనింగ్, ఇన్‌ఫ్రా, రియల్ ఎస్టేట్, పవర్, లిక్కర్ వంటి రంగాల్లో.. ఇలాంటి నకిలీ ఖర్చులు, క్యాష్ జనరేషన్, రాజకీయ ఫండింగ్ మోడల్ సాధారణంగా మారిపోయిందనే ఆందోళనను బలపరుస్తోంది.

ఈడీ, ఎస్ఎఫ్ఐఓ, ఐటీ విశ్వసనీయత..  వ‌ర్సెస్ దుర్వినియోగం విష‌యానికి వ‌స్తే.. ఈ కేసు మరో కీలక చర్చను తెరపైకి తెచ్చింది. ఒకవైపు..  ఈడీ, ఎస్ఎఫ్ఐఓ, ఐటీ  వంటి సంస్థలు కార్పొరేట్, జకీయ అవినీతి బహిర్గతం చేయడానికి అవసరమైన ఆయుధాలుగా మారాయి. మరోవైపు.. అదే సంస్థలు ఎంపిక చేసిన రాజకీయ లక్ష్యాలపై మాత్రమే దాడి చేస్తే..  ప్రజల్లో సెలెక్టివ్ జస్టిస్  భావన పెరుగుతుంది. అంటే, కేవ‌లం ఒక వ‌ర్గం వారినే టార్గెట్ చేసి మ‌రీ కొడుతున్నార‌న్న అభిప్రాయం ప్ర‌బ‌లుతుంది. కేరళ హైకోర్టు తీర్పు ఈడీ చట్టబద్ధతను బలపరిచినా, సంస్థల నిష్పక్షపాతతపై ప్రజా విశ్వాసం నిలబెట్టడం ఇంకా పెద్ద సవాలుగానే ఉంది. 

మొత్తంగా వాస్తవాలు ఏమి చెబుతున్నాయి? అని చూస్తే..  అందులో మొద‌టిది- సీఎమ్ఆర్ఎల్ లో నకిలీ ఖర్చులు, ఫేక్ ఎక్స్‌పెన్సెస్.. ఐటీ,ఎస్ఎఫ్ఐఓ  రికార్డులు, సెటిల్‌మెంట్ కమిషన్ ఆర్డర్లు.. ఇవన్నీ కలిపి చూస్తే, ఇది సాధారణ అకౌంటింగ్ పొరపాటు కాదు, సిస్టమాటిక్ ఫ్రాడ్ అని స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక రెండోది  ఎక్స‌లాజిక్ చెల్లింపులు.. 2.78 కోట్లకుగానూ ఎలాంటి సర్వీసులు అందించలేదని ఐటీ, ఎస్ఎఫ్ఐఓ అభిప్రాయం.  ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్‌ను సంతృప్తిపరచడానికిచ్చిన రెమ్యూనరేషన్ అని ఐటీ ఆర్డర్ కామెంట్. ఎంప‌వ‌ర్ ఇండియా నుంచి 50 లక్షల లోన్..  ఇవన్నీ సాధారణ బిజినెస్ ట్రాన్సాక్షన్లు కానే కావంటున్నాయి.

హైకోర్టు తీర్పు.. ప్ర‌కారం  చూస్తే ఈడీ  దర్యాప్తు చట్టబద్ధమని, ఐటీ సెటిల్‌మెంట్ ఇమ్యూనిటీ పీఎమ్ఎల్ఏకి వర్తించదని స్పష్టం చేసింది.  అంటే, ఈ కేసు న్యాయపరంగా కూడా గ‌ట్టి ప‌ట్టే సాధించింది.  రాజకీయ నైతికత సంగ‌తి  చూస్తే.. కమ్యూనిస్టులు పెట్టుబడిదారీ వ్యవస్థపై చేసే విమర్శలు, అదే సమయంలో కార్పొరేట్ కంపెనీల నుంచి సర్వీసులు లేకుండానే డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు..  ఇవ‌న్నీ కూడా ఎడమపక్ష నైతికతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యానికి అసలు ముప్పు ఎక్క‌డంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక్కటే కాదు, పెట్టుబడిదారీ కంపెనీలతో చేతులు కలిపి, సిద్ధాంతం పేరుతో ప్రజలను మోసం చేసే రాజకీయ ద్వంద్వ వైఖరి కూడా అతి పెద్ద ముప్పే.

ఇంత‌కీ దోపిడీ ఎవరిది? అని ప‌రిశీల‌న చేస్తే.. కేరళ  సీఎమ్ఆర్ఎల్, ఎక్స‌లాజిక్ కేసు మనకు కొన్ని అసౌకర్యకరమైన నిజాలు గుర్తు చేస్తోంది. అవినీతి కేవలం  రైట్–వింగ్ లేదా క్యాపిటలిస్ట్ సమస్య కాదు. సోషలిజం, సెక్యులరిజం,  ప్రోగ్రెసివ్ అనే లేబుళ్ల వెనుక కూడా.. కార్పొరేట్, రాజకీయ నెక్సస్ దాగి ఉండవచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీ ఉందని చెప్పడం సులువు. కానీ, అదే వ్యవస్థ నుంచి నిధులు తీసుకుని, ప్రజల ముందు నైతిక ఉపన్యాసాలు చేయడం.. ఇదే అసలు ప్రమాదకరమైన దోపిడీ. ఈ కేసు చివరికి కోర్టుల్లో ఎలా ముగుస్తుందో చూడాలి. అయితే, ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నది ఒక్కటే.. సిద్ధాంతం పేరిట‌ ప్రజలను మోసం చేసే రాజకీయాలు, కార్పొరేట్ డబ్బుతో నడిచే  విప్లవం, న్యాయవ్యవస్థను సవాలు చేసే అవినీతి నెట్‌వర్క్‌లు..    ఇవి ఏ పక్షానైనా, ఏ సిద్ధాంతానికి చెందినా, ప్రజాస్వామ్యానికి ఎంతైనా ప్రమాదకరమేనంటారు రాజ‌కీయ, కార్పొరేట్ పండితులు.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...