పెద్దవారిని ఈ ప్రశ్నలు అడిగి చూడండి.. వారి సమాధానాలు ఎన్నో గొప్ప పాఠాలు నేర్పుతాయి..!
posted on Jan 24, 2026 11:28AM

నేటి తరానికి పెద్దవారంటే చాదస్తపు మనుషులు. కొంచెం కూడా ఫ్యాషన్ తెలియని మొరటు మనుషులు. అమ్మమ్మలు, తాతయ్యలు అంటే కేవలం పాకెట్ మనీ లేదా పుట్టినరోజు, పండుగ రోజుకు డబ్బులు ఇచ్చే వారుగా మాత్రమే తెలుసు చాలామందికి. కానీ వారి జీవితం ఎన్నో అనుభవాలను, జీవిత పాఠాలను పోగేసుకొని ఉంటుంది. చాలామంది పెద్దలు కూడా తమ మనవళ్లు, మనవరాళ్లతో ఏదైనా మాట్లాడాలన్నా నేటికాలం యువత నుండి పిల్లల వరకు అస్తమానం పోన్లు చేతితో పట్టుకుని వాటికే ప్రాధాన్యత ఇస్తుంటారు. తిన్నావా లేదా తినడానికి ఏమైనా కావాలా అని అడగడం లేదా ఏమైనా చేసివ్వాలా లేదా తెచ్చివ్వాలా అని అడగడం వరకే ఉంటుంది. కానీ వారి జీవితంలో ఎన్నో బయటకు తెలియని కథలు ఉంటాయి. పెద్దవారిని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా.. వారిచ్చే సమాధానాలు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఇంతకీ పెద్దవారిని అడగాల్సిన ప్రశ్నలు ఏంటి? తెలుసుకుంటే..
చిన్నతనం జ్ఞాపకాలు..
ప్రతి తరానికి జీవనం, పరిస్థితులు, సౌకర్యాలు, ఇబ్బందులు అన్నీ మారుతూ ఉంటాయి. 30 ఏళ్ల కిందట ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు, ఇప్పుడున్న సమస్యలు రేపటి తరానికి ఉండకపోవచ్చు. బాల్యం కూడా అంతే.. పెద్దవారి బాల్యం గురించి ఒక్కసారి కదిలిస్తే.. వారి బాల్యం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. నేటికాలంలో మనకు లభిస్తున్న, లభించిన జీవితం, సౌకర్యాలు ఎంత గొప్పవో అర్థం అవుతుంది.
అభిరుచులు..
వయసుతో పాటు అభిరుచులు మారుతూ ఉంటాయి. పెద్దవారు కూడా వారి చిన్నతనం నుండి అభిరుచులు ఎలా ఉన్నాయి. ఎంత వయసు పెరిగినా మారని అభిరుచులు ఏంటి అని అడిగితే.. వారు చెప్పే సమాధానంలో.. కాలం మారిన చెదరని ఎన్నో లక్ష్యాలు కనిపిస్తాయి.
జ్ఞాపకాలు..
పెద్దల జీవితం చాలా వరకు జ్ఞాపకాలలోనే మూలుగుతూ ఉంటుంది. వారి జ్ఞాపకాలను తిరిగి తీసుకొచ్చే విషయాలను కదిలిస్తే వారి జీవితంలో ఎంతో గొప్ప క్షణాలు బయటికి వస్తాయి. అవి నేటి తరం వారికి ఎన్నో పాఠాలు నేర్పుతాయి.
చెప్పలేని విషయాలు..
ప్రతి ఒక్కరికి కొన్ని రహస్యాలు ఉంటాయి. చాలామంది గురించి బయటకు తెలిసిన విషయాలే కాకుండా, బయటకు తెలియని విషయాలు కూడా ఉంటాయి. పెద్దలను ఒక్కసారి వీటి గురించి కదిలిస్తే వారిలో ఉన్న మరొక కోణం కూడా తెలుస్తుంది. ఆ వయసులో వారి గురించి ఇలా తెలియడం పట్ల వారు కూడా ఎంతో సంతోషిస్తారు.
కష్టాలు..
కష్టాలు ప్రతి ఒక్కరికి సహజం. అయితే కొన్నేళ్ళ కిందట పెద్దలు ఎదుర్కున్న కష్టాల గురించి వెంటే.. వాటి ముందు నేటి తరం వారి కష్టాలు దూదిపింజలా అనిపిస్తాయి. నిజానికి ఈ కాలం వారు సమస్యలను ఎదుర్కోవడానికి, ధైర్యంగా ఉండటానికి పెద్దల కష్టాలను వినడం కూడా గొప్ప ఊరట, మనోనిబ్బరం ఇస్తాయి.
సలహా..
పెద్దలు ఏదైనా చెప్పినా, సలహా ఇచ్చినా.. వారి జీవితంలో అప్పటికే ఎదురైన కొన్ని అనుభవాల ఆధారంగా ఇస్తారు. అంతే కానీ వయసు పెరిగింది కాబట్టి పెద్దరికంతో ఇస్తున్నారు అనుకోకూడదు. వారు ఇచ్చే సలహాలు, చెప్పే విషయాలు జీవితాన్ని మార్చే గొప్ప పాఠాలు, మలుపులు కాగలవు.
ఆనందం..
ఆనందం అంటే సినిమా చూడటం, తినడం, నచ్చినట్టు బ్రతకడం అనుకుంటారు చాలా మంది. కానీ ఆనందం గురించి పెద్దలను అడిగితే ఖచ్చితంగా తృప్తి అనే కోణంలో సమాధానం వస్తుంది. ఏ పుస్తకం అందించలేని జ్ఞానాన్ని పెద్దలు చెప్పే విషయాలు నేర్పుతాయి.
పైన పేర్కొన్న ప్రశ్నలు.. కేవలం పెద్దలను పలకరించడానికి కాదు.. వారు చెప్పే సమాధానాలు ప్రతి వ్యక్తికి ఏ పుస్తకంలోనూ దొరకని పాఠాలు అవుతాయి. జీవితంలో ఏదో ఒక సందర్భంలో పెద్దల సమాధానాలు పరిష్కారాలు చూపుతాయి.
*రూపశ్రీ.