డేంజర్ జోన్‌లో కేకే? పొమ్మన లేక పొగ? కేకేకి బాస్‌కి ఎక్కడ తేడా వచ్చింది?
posted on Jun 15, 2017 1:13PM

కేకే డేంజర్ జోన్ లో ఉన్నారా? కేశవరావును బాస్ టార్గెట్ చేశారా? పొమ్మన లేక పొగ పెడుతున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. టీఆర్ఎస్‌లో చరిత్ర పునరావృతమవుతున్నట్లే కనిపిస్తోంది. కేశవరావును పక్కన పెడుతున్నారన్న చర్చ గులాబీ పార్టీలో ఇప్పుడు హాట్‌హాట్‌గా సాగుతోంది. గోల్డ్ స్టోన్ భూ కుంభకోణం వ్యవహారంలో నిండా కూరుకు యిన కేకే విషయంలో ప్రభుత్వం, పార్టీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటమే దీనికి కారణంగా చెప్పుకుంటున్నారు. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతికి ఇలానే జరిగిందని చెవులు కొరుక్కుంటున్నారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న కేకే కారెక్కారు. ఆయనకు పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు కేసీఆర్. ఇటీవలి కాలం వరకు కేకేకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కానీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ దగ్గర కేకే భూములు కొన్నట్లు బయటపడడంతోనే... కేకే పరిస్థితి తారుమారైంది. పైగా ఈ భారీ కుంభకోణంలో కేకే పేరును ప్రభుత్వమే లీక్ చేసిందంటూ టీజేఏసీ బాంబు పేల్చింది.
కేకేకు టీఆర్ఎస్ హైకమాండ్ కు పడకపోవడానికి కారణం కేసీఆర్ తీరును విమర్శించడమే అనే వార్తలు గుప్పుమంటున్నాయి. కేసీఆర్ వ్యవహారశైలిపై కేకే వ్యతిరేకంగా మాట్లాడినట్లు బాస్ దృష్టికి వెళ్లిందట. ఫలితంగా ఏడెనిమిది నెలలుగా కేకేను పక్కనపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదు తనకు అన్యాయం జరిగిందని కేకే భావిస్తే ఆయన న్యాయ పోరాటం చేయడంలో తప్పు లేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పడాన్ని బట్టిచూస్తే ....కేకే విషయంలో పార్టీ పెద్దలు దూరంగా ఉంటున్నట్లే కనబడుతోంది. మరి కేకే... నెంబర్ టూ సెంటిమెంట్ ను అధిగమిస్తారా..? డేంజర్ జోన్ నుంచి సేఫ్ గా బయట పడతారా..అనేది వేచి చూడాలి.