లాలూ వెర్సెస్ నితీష్ కుమార్?

 

ప్రతీ సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలో వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ‘మూడో ఫ్రంట్’ ముచ్చట్లు పెట్టుకోవడం ఎన్నికలయ్యేలోగానే దానిని పక్కనపడేసి ఎవరికీ వారు ఎన్నికలలో పోటీ చేయడం చాలా కాలంగా జరుగుతున్నదే. ఈ ఏడాది నవంబర్-డిశంబర్ నెలల మధ్యలో బీహార్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఈసారి ‘జనతా’ హెడ్డింగులు పెట్టుకొన్న ఆరు పార్టీలు విలీనమయ్యి ఒక్క పార్టీగా అవతరించబోతున్నట్లు క్రిందటి నెల ప్రకటించాయి. దానికి అధ్యక్షుడిగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ ని ఎంచుకొన్నారు. పార్టీ పేరు, జెండా,ఎజెండాలను ఖరారు చేసేందుకు ఆరు పార్టీల ప్రతినిధులతో ఒక కమిటీ వేసుకొన్నారు.

 

ఇల్లలకగానే పండగ కాదన్నట్లు అందరూ కలిసి పెద్ద పొయ్యి వెలిగించుకొన్నారు గానీ నేటికీ ఎవరి పొయ్యిలు వారు చల్లారిపోకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలేద్దామని కలలుగన్న నితీష్ కుమార్ అది సాధ్యం కాదని తేలిపోవడంతో తమ జేడీ (యు) పార్టీకే చెందిన బీహార్ ముఖ్యమంత్రి జీతాన్ రాం మంజీ కుర్చీ క్రింద మంట పెట్టి ఆయనను దించేసి ఆ కుర్చీలో తను సెటిల్ అయిపోయేరు.

 

ఇప్పుడు తమ పార్టీని ఇంకా పేరు ఊరు లేని పార్టీలో విలీనం చేసేసారు కనుక ఆయనకు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పోటీగా తయారయ్యారు. అయితే గడ్డి కుంభకోణం కేసులో నాలుగేళ్ళు జైలు శిక్షపడినందున ఆయన ఎన్నికలలో పోటీ చేయలేరు. కనుక ముఖ్యమంత్రి కాలేరు. అయినప్పటికీ ఆయన ఇదివరకులాగే తన భార్య రబ్రీ దేవినో లేకపోతే మరొక డమ్మీనో అందులో కూర్చోబెట్టి తను రాజ్యం ఏలాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది గమనించి నితీష్ కుమార్ కూడా అప్రమత్తమయ్యారు. ఆరు పార్టీలు కలిసి బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన పేరునే ప్రకటించాలని ఆయన కోరుతున్నారు.

 

కానీ ఎల్లప్పుడూ ప్రతిపక్షంలో కూర్చోవడం పాపం లాలూ ప్రసాద్ కయినా చాలా ఇబ్బంది కలిగించే విషయమే కనుక ఆయన కూడా వెనక్కి తగ్గడం లేదు. అందుకే వారిద్దరూ కలిసి తమ కొత్త పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ తో ఈ విషయం గురించి చర్చించడానికి మొన్న డిల్లీ బయలుదేరి వెళ్ళారు.

 

ముందు ఈవిషయం గురించి ఏదో ఒకటి తేల్చుకొన్న తరువాతే పార్టీ జెండా, అజెండాల గురించి మాట్లాడుకోవడం మంచిదణి వారిరువురూ భావిస్తున్నట్లు సమాచారం. వారిలో ఎవరికి ముఖ్యమంత్రి సీట్ కన్ఫర్మ్ చేసినా రెండవ వ్యక్తి మళ్ళీ తన పొయ్యి రాజేసుకోవడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం తధ్యం. కనుక జెండా ఎగరవేయక ముందే జనతా పరివార్ కధ ముగిసిపోయినా ఆశ్చర్యం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu