ఇరుకున పడిన కాంగ్రెస్


ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ లండన్ నుంచి పోర్చుగల్ వెళ్ళడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అనుమతి ఇచ్చారన్న ఆరోపణలు ఒకవైపు, దీనికి వసుంధరా రాజే సహకరించారన్న ఆరోపణలు మరోవైపు చేస్తూ కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. మానవతా దృక్పథంతో చేసిన ఒక  సాయానికి రాజకీయ రంగు పులిమి, దీని ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న  ఉద్దేశంలో కాంగ్రెస్ వుంది. ఎప్పుడు ఏ అంశాన్ని రాజకీయం చేద్దామా అని ఆశగా ఎదురుచూసే కాంగ్రెస్ ఈ అవకాశాన్ని వదలకుండా తన శాయశక్తులా విమర్శలు చేస్తోంది. మన దేశంలో ఆర్థిక నేరాల్లో చిక్కుకుని విదేశాలకు వెళ్ళిపోయిన లలిత్ మోడీకి సుష్మా, వసుంధర సహకరించడం నేరం, ఘోరం అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. అర్జెంటుగా వారిద్దరూ రాజీనామా చేస్తే తప్ప తమకు మనశ్శాంతి వుండదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే కోడల్ని తిట్టి అత్త మూకుడు నాకిందన్న సామెత చందంగా కాంగ్రెస్ పార్టీ గుట్టు ఒకటి బయటపడింది. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పడేలా చేసింది.

ఏ లలిత్ మోడీకి మానవతా దృక్పథంతో సహాయం చేయడం ఘోరమని అంటున్న కాంగ్రెస్ పార్టీలోని పెద్ద తలకాయలైన ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వధేరా ఎంచక్కా లండన్‌లో లలిత్ మోడీని కలిశారట. ఒక రెస్టారెంట్‌లో ఈ ముగ్గురూ ఎంచక్కా కబుర్లు చెప్పుకున్నారట. ఈ విషయాన్ని లలిత్ మోడీ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పడేసింది. అసలు వీళ్ళిద్దరికి లండన్ వెళ్ళి లలిత్ మోడీని కలవాల్సిన అవసరమేంటనే ప్రశ్నకు కాంగ్రెస్ వర్గాల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దిగ్విజయ్ సింగ్ లాంటి భజనపరులు ప్రియాంకని, రాబర్ట్ వధేరాని వెనకేసుకు రావడానికి ప్రయత్నించినప్పటికీ అంతగా ప్రయోజనం వుండే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీకి ఇది మంచి అవకాశంలా దొరికింది. ఈ ఒక్క పాయింట్ చూపించి కాంగ్రెస్‌ని తిప్పికొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu