లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణం.. దశాబ్దాలుగా వీడని తాష్కెంట్ రహస్యం

posted on: Jun 3, 2026 3:26PM

స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన, ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం దొరకని ఒక పెద్ద రహస్యంగా మిగిలిపోయింది. 1966 జనవరి 11న, పాకిస్తాన్‌తో చారిత్రాత్మక తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన   గంటల వ్యవధిలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం చుట్టూ అల్లుకున్న అనుమానాస్పద పరిస్థితులు, కీలక సాక్షుల మర్మమరణాలు ఇప్పటికీ బహిర్గతం కాని రహస్య పత్రాలు ఈ అంశాన్ని ఐదు దశాబ్దాలకు పైగా సజీవంగా ఉంచాయి. ఈ నేపథ్యంలో, లభ్యమైన చారిత్రక ఆధారాలు,  వివిధ కథనాల ఆధారంగా శాస్త్రి మరణం వెనుక ఉన్న వాస్తవాలపై ప్రత్యేక విశ్లేషణ.

చారిత్రక నేపథ్యం, తాష్కెంట్ సమావేశం

1965 సెప్టెంబరులో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం ముగిసిన తర్వాత, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి సోవియట్ యూనియన్ ప్రీమియర్ అలెక్సీ కొసిగిన్ మధ్యవర్తిత్వం వహించారు. ఈ క్రమంలోనే సోవియట్ రష్యాలోని తాష్కెంట్‌లో 1966 జనవరి 4 నుండి 10 వరకు ఒక ఉన్నత స్థాయి సదస్సు జరిగింది. ఇందులో భారతదేశం తరపున ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ తరపున అధ్యక్షుడు అయూబ్ ఖాన్ పాల్గొన్నారు. దీర్ఘకాల చర్చల అనంతరం జనవరి 10న ఇరు దేశాలు తమ సైన్యాలను యుద్ధానికి పూర్వపు స్థానాలకు ఉపసంహరించుకోవాలని అంగీకరిస్తూ తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

అయితే, ఈ చారిత్రాత్మక ఒప్పందం జరిగిన 12 గంటల లోపే, అంటే జనవరి 11 తెల్లవారుజామున సుమారు 2గంటల సమయంలో శాస్త్రి హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించారని అధికారికంగా ప్రకటించినప్పటికీ..  ఒక దేశ ప్రధాని విదేశీ గడ్డపై అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు కనీసం శవపరీక్ష లేదా ఒక స్వతంత్ర దర్యాప్తు ఎందుకు జరపలేదు అనే ప్రశ్న నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

తాష్కెంట్‌లో చివరి రాత్రి: అనుమానాస్పద పరిస్థితులు

తాష్కెంట్ పర్యటనలో శాస్త్రికి బస ఏర్పాటు చేసిన విధానంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా దేశాధినేతలకు నగరంలోని ప్రధాన హోటళ్లలో వసతి కల్పిస్తారు, కానీ శాస్త్రిని నగరానికి దూరంగా ఉన్న ఒక డాచా  (సోవియట్ శైలి పల్లెటూరి నివాసం)లో ఉంచారు. అత్యవసర సమయంలో సిబ్బందిని పిలవడానికి ఆయన గదిలో ఎలాంటి ఇంటర్ కం సౌకర్యం గానీ, టెలిఫోన్ ఎక్స్‌టెన్షన్ గానీ లేకపోవడం గమనార్హం.

జనవరి 10వ తేదీ రాత్రి ఒప్పందం ముగిసిన తర్వాత శాస్త్రి తన నివాసానికి చేరుకున్నారు. రాత్రి పదకొండున్నర గంటల సమయంలో, అప్పటి భారత రాయబారి టి.ఎన్. కౌల్ వ్యక్తిగత వంటవాడైన జాన్ మొహమ్మద్ తెచ్చి ఇచ్చిన పాలను తాగి ఆయన నిద్రపోయారు. ఆ తర్వాత తెల్లవారుజామున ఒంటిగంటా 25 నిముషాల   ప్రాంతంలో శాస్త్రికి తీవ్రమైన దగ్గు రావడంతో..  గదిలో ఫోన్ లేని కారణంగా ఆయనే స్వయంగా నడుచుకుంటూ బయటకు వచ్చి వైద్యుడిని పిలవాల్సిందిగా సిబ్బందిని కోరారు. వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఆర్.ఎన్. చుగ్ అక్కడికి చేరుకునే సమయానికే శాస్త్రి స్పృహ కోల్పోయారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుల్దీప్ నాయర్ కథనం ప్రకారం..  శాస్త్రి గదిలో ఒక థర్మోస్ ఫ్లాస్క్ కింద పడి ఉంది. శాస్త్రి భార్య లలితా శాస్త్రి కూడా తన భర్త చివరి క్షణాల్లో ఒక నిర్దిష్ట థర్మోస్ ఫ్లాస్క్ వైపు చూపిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నించారని, అయితే ఆ ఫ్లాస్క్ ఆ తర్వాత మాయమైందని ఆరోపించారు.

అనుమానాలను బలపరిచిన అంశాలు: శవపరీక్ష లేకపోవడం,  శరీరంపై గుర్తులు

లాల్ బహదూర్  శాస్త్రి మరణంపై ఉన్న అతిపెద్ద అనుమానం ఏమిటంటే, ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించకపోవడం. సోవియట్ రష్యాలో గానీ, భారతదేశానికి మృతదేహాన్ని తీసుకొచ్చిన తర్వాత గానీ ఎలాంటి శవపరీక్ష జరగలేదని అటు విదేశాంగ శాఖ, ఇటు ప్రతినిధి బృందంలో ఉన్న కుల్దీప్ నాయర్ స్పష్టం చేశారు.

మరోవైపు శాస్త్రి భౌతికకాయం ఢిల్లీకి చేరుకున్నప్పుడు ఆయన శరీరంపై ముదురు నీలి రంగు మచ్చలు, అలాగే కోతల గుర్తులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు గమనించారు. ఆయన కుమారుడు సునీల్ శాస్త్రి, భార్య లలితా శాస్త్రిలు శరీరం బాగా ఉబ్బిపోయిందని, పొత్తికడుపు భాగంలో శిలువ (క్రాస్) ఆకారంలో కోతలు ఉన్నాయని పేర్కొన్నారు. మృతదేహం పాడవకుండా ఫార్మాలిన్ ద్రవాన్ని ఉపయోగించడం వల్లే రంగు మారిందని అధికారులు వివరణ ఇచ్చినప్పటికీ, జనవరి నెలలో తాష్కెంట్ మరియు ఢిల్లీలలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నప్పుడు అంత భారీగా ఫార్మాలిన్ వాడాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సాక్షుల మర్మమరణాలు: యాదృచ్ఛికమా, కుట్రనా?

ఈ కేసులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఆ రాత్రి ఏం జరిగిందనే దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వ్యక్తులు విచారణకు హాజరయ్యే ముందే ఘోర ప్రమాదాలకు గురికావడం.

డాక్టర్ ఆర్.ఎన్. చుగ్, లాల్ బహదూర్ శాస్త్రి వ్యక్తిగత సహాయకుడు..  1977లో లాల్ బహదూర్ శాస్త్రి  మరణంపై విచారణ జరుపుతున్న కమిటీ ముందు సాక్ష్యం చెప్పడానికి వెళ్తుండగా, గుర్గావ్ సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన తన కుటుంబంతో సహా దుర్మరణం పాలయ్యారు.

రామ్ లాల్ (వ్యక్తిగత సహాయకుడు..  ఈయన కూడా సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైన రోజే ఢిల్లీలో ఒక బస్సు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై.. మానసిక స్థితి దెబ్బతినడంతో సాక్ష్యం చెప్పలేకపోయారు.

కుల్దీప్ నాయర్, సీనియర్ జర్నలిస్టు..  విచారణ సమయంలో కొన్ని ప్రమాదకరమైన విషయాలను బయటపెట్టవద్దని తనపై ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి వచ్చిందని ఆయన స్వయంగా వెల్లడించారు.

మరోవైపు, శాస్త్రికి విషప్రయోగం జరిగిందని సోవియట్ నిఘా సంస్థ కేజీబీ  మొదట అనుమానించి వంటవాడైన జాన్ మొహమ్మద్‌ను విచారించింది. కానీ విచిత్రంగా.. ఇండియాకు  తిరిగి వచ్చిన తర్వాత అతనికి రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన వంటవాడిగా ఉద్యోగం లభించడం అనేక రాజకీయ చర్చలకు దారితీసింది.

రాజకీయ పరిణామాలు, విచారణల వైఫల్యం

లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణం తర్వాత దేశ రాజకీయ చిత్రపటం పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు కేవలం సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ..  కాంగ్రెస్ సీనియర్ నాయకులైన కె. కామరాజ్, ఎన్. సంజీవరెడ్డి వంటి వారి మద్దతుతో దేశ ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఒకవేళ లాల్ బహదూర్ శాస్త్రి మరికొంత కాలం జీవించి ఉంటే..  దేశంలో వంశపారంపర్య రాజకీయాలు ఉండేవి కావని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడతారు.

1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాజ్ నారాయణ్ నేతృత్వంలో ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, కీలక సాక్షుల మరణం వల్ల ఆ కమిటీ ఎలాంటి స్పష్టమైన ముగింపును ఇవ్వలేకపోయింది. కాలక్రమేణా ఆ కమిటీకి సంబంధించిన రికార్డులు కూడా మాయమవడం గమనార్హం. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)  కింద అనేకమంది ఈ వివరాలను కోరినప్పటికీ, విదేశీ సంబంధాలు దెబ్బతింటాయనే నెపంతో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆ రహస్య ఫైళ్లను బహిర్గతం చేయడానికి నిరాకరించింది.

మీడియా స్పందన,  విమర్శలు

2019లో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ది తాష్కెంట్ ఫైల్స్'చిత్రం ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. అయితే 1966లో విదేశాంగ శాఖలో పనిచేసిన కె.సి. చాదా వంటి అప్పటి అధికారులు ఈ సినిమాలోని కొన్ని అంశాలను తప్పుపట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక ఎలాంటి అంతర్జాతీయ కుట్ర లేదనీ..  ప్రోటోకాల్ ప్రకారమే శవపరీక్ష జరగలేదనీ,  ఫార్మాలిన్ వల్లే శరీరం నీలిరంగులోకి మారిందని ఆయన వాదించారు. అయినప్పటికీ, సీఐఏ , కేజీబీ వంటి అంతర్జాతీయ నిఘా సంస్థల ప్రమేయం ఉందనే సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి.

వీడని ప్రశ్నలు

లాల్ బహదూర్ శాస్త్రి మరణం కేవలం ఒక గుండెపోటు కాదనే అనుమానాలకు బలమైన కారణాలు ఉన్నాయి. శవపరీక్ష నిర్వహించకపోవడం, మృతదేహంపై అసాధారణ గుర్తులు, కీలక సాక్షుల మరణాలు,  60 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆ ఫైళ్లను  రహస్య  పత్రాలుగానే ఉంచడం వంటి అంశాలు ఈ మిస్టరీని మరింత క్లిష్టంగా మార్చాయి. ఒక దేశ ప్రధాని మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది, కానీ ఆ నిజం ఇప్పటికీ తాష్కెంట్ చీకట్లలోనే మగ్గుతోంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...