లగడపాటి ముఖ్యమంత్రిని అందుకే కలిసారా?
posted on Sep 25, 2015 9:49AM
.jpg)
నిన్న ఒక్కరోజే రాష్ట్ర రాజకీయాలలో రెండు ఊహించని విచిత్ర సంఘటనలు జరిగాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి శత్రుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి, రామోజీరావులు ఫిలింసిటీలో కలుసుకోవడం. విజయవాడ మాజీ లోక్ సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డిల్లీలో కలుసుకోవడం. జగన్ స్వయంగా ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుని కలిస్తే, లగడపాటి ఆంధ్రా భవన్ కి వెళ్లి ముఖ్యమంత్రిని కలిసారు. రాజకీయంగా, వ్యాపారపరంగా బద్ద శత్రువులయిన జగన్, రామోజీల మధ్య ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చేయడం వలన కలిసినప్పటికీ వారి రాజకీయ, వ్యాపార నేపధ్యాల కారణంగా వారి మధ్య స్నేహ సంబంధాలు పెరిగే అవకాశం లేదనే భావించవచ్చును. కనుక వారి సమావేశం వలన కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చును.
కానీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి తన వ్యాపారాలకే పరిమితం అయిన లగడపాటి చంద్రబాబు నాయుడుని కలవడానికి చాలా ప్రాధాన్యత ఉందని భావించవచ్చును. వారిరువురూ సుమారు అర్ధగంట సేపు మాట్లాడుకొన్నారు. లగడపాటి బహుశః మళ్ళీ రాజకీయాలలోకి రావాలనే ఉద్దేశ్యంతో తెదేపాలో చేరాలని భావించి చంద్రబాబు నాయుడుని కలిసారేమో? లేదా నిర్మాణ రంగంలో ఉన్న ఆయన రాజధాని అమరావతి నిర్మాణ కార్యక్రమాలలో తన సంస్థలకి కూడా కాంట్రాక్టులు ఇప్పించాలని కోరేందుకు కలిసి ఉండవచ్చును. ఒకవేళ ఆయన తెదేపాలో చేరేందుకే ముఖ్యమంత్రిని కలిసి ఉంటే, దానివలన జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చును. ఒకవేళ వ్యాపార పనుల మీద కలిసి ఉంటే అది అసహజమయిన విషయమేమీ కాదు. నేడోరేపో ఆయన దీనిపై ఒక ప్రకటన చేస్తారేమో.