Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లేడీ దురంధర్ రాజామణి సరస్వతి
posted on: Jun 1, 2026 11:03AM

సరస్వతి రాజమణి.. బంగారు గనుల వారసురాలిగా మొదలై, భారత తొలి మహిళా గూఢచారిగా ముగిసిన ఆ జీవిత కథ ఎలాంటిది? ఇందులో మొదటిగా కనిపించే చారిత్రక నేపథ్యం.. విషయానికి వస్తే.. రంగూన్ వైభవం నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ గూఢచర్యం వరకు సాగిన ఆమె సాహసోపేత ప్రయాణాన్ని ఒకసారి సునిశిత వీక్షణం చేస్తే మనం ఎందరో త్యాగధనులను గౌరవించడం మానేసి.. ఊహాలోకాల్లో విహరిస్తున్నామని తేటతెల్లమవుతుంది.
ఇరవయ్యో శతాబ్దం నాల్గవ దశకంలో, బ్రిటిష్ సామ్రాజ్యం తూర్పు ఆసియాలో తన ప్రభావాన్ని గట్టిగా చూపుతున్న కాలం. ఆనాటి బర్మా ప్రస్తుత మయన్మార్ లోని రంగూన్ నగరం, వాణిజ్య పరంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన కేంద్రం. అక్కడి అత్యంత సంపన్న భారతీయ కుటుంబాలలో ఒకటిగా నిలిచింది రాజమణి కుటుంబం.. ఒక బంగారు గని యజమాన్యం వహించేది, స్వాతంత్రోద్యమానికి ఆర్థిక సహాయ సహకారం అందించే ఫ్యామిలీ కూడా.
ఈ కుటుంబంలో 1927 జనవరి 11న జన్మించిన బాలిక.. తరువాత భారత తొలి మహిళా గూఢచారిగా చరిత్రలో నిలిచింది. ఆమె సరస్వతి రాజమణి. పట్టు వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు, బంగారు గనుల సంపద. ఇవే ఆమె బాల్య ప్రపంచం. కానీ ఆమె జీవిత గమ్యం రాజప్రాసాదాల సౌఖ్యం మాత్రమే కాదు. అరణ్య మార్గాలు, గన్‌పౌడర్ వాసన, బ్రిటిష్ సైనిక శిబిరాల మధ్య ప్రాణాంతక గూఢచర్యం కూడా. సంపదల మధ్య జన్మించినా, స్వాతంత్రం కోసం అన్నీ విడిచిపెట్టిన యువ గూఢచారిణి.. సరస్వతి రాజమణి.
1942లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ రంగూన్‌కు చేరుకున్నప్పుడు, అక్కడి భారతీయ సమాజంలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడింది. నాకు మీ రక్తం ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్రం ఇస్తాను- అనే నేతాజీ పిలుపు, వేలాది భారతీయుల హృదయాలను కదిలించింది. ఆ జనసమూహంలో నిలిచిన పదహారు ఏళ్ల యువరాణి రాజమణి, తన మెడలోని హారం, చేతులలోని కంకణాలు, చెవిపోగులు.. అన్నీ ఆజాద్ హింద్ ఫౌజ్ కి సమర్పించింది.
ఇంత చిన్న వయస్సులో ఇంతటి ఆస్తిని ఇచ్చేసిందంటే, అది కేవలం భావోద్వేగం అనుకుని, నేతాజీ మరుసటి రోజు స్వయంగా ఆమె ఇంటికి వచ్చి ఆభరణాలు తిరిగి ఇవ్వాలనుకున్నారు. కానీ రాజమణి, నేతాజీ కళ్లలోకి నేరుగా చూసి.. ఇది నా దేశానికి నేనిచ్చే నా సమర్పణ. నేను ఇచ్చినదాన్ని తిరిగి తీసుకోను.. అని చెప్పినప్పుడు, నేతాజీ ఆమె దృఢసంకల్పాన్ని గౌరవించి, ఆమెకు సరస్వతి అనే కొత్త బిరుదును ఇచ్చారు. అందుకామె అన్న మాట.. నేతాజీ, నేను పొరపాటున ఇవ్వలేదు.. ఇది నా దేశానికి సమర్పణ. అన్నారామె.
నేతాజీ ఆధ్వర్యంలో.. 1942లో ఏర్పడిన రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్, భారత స్త్రీల సైనిక పాత్రకు ఒక విప్లవాత్మక మలుపు. డాక్టర్ లక్ష్మీ సహగల్ నాయకత్వంలో ఈ రెజిమెంట్‌లో చేరిన యువతులలో సరస్వతి రాజమణి కూడా ఒకరు. కానీ ఆమె కేవలం తుపాకీ పట్టే పాత్రకు మాత్రమే పరిమితం కాలేదు. నేతాజీ ఆమెను మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో గూఢచారిగా నియమించారు. ఇది యుద్ధరంగం కంటే ప్రమాదకరమైన, కానీ అత్యంత కీలకమైన బాధ్యత.
దీంతో ఆమె పొడవాటి జుట్టు కత్తిరించుకోవల్సి వచ్చింది. షర్ట్, ప్యాంట్ వేసుకుంది. అప్పుడు ఆమె పేరు కేవలం మణి.. చూడ్డానికి లోకల్ బాయ్ లా కనిపించే గెటప్. బ్రిటిష్ సైనిక మెస్‌లో బూట్లు పాలిష్ చేయడం, గదులు శుభ్రం చేయడం, టీ అందించడం.. ఇవే ఆమె చేయాల్సిన పనులు. కానీ అసలు పని, ఆ గదుల్లో జరుగుతున్న రహస్య యుద్ధ సమావేశాల సమాచారాన్ని సేకరించడం.
జనరళ్ల ముందు మ్యాప్‌లు విప్పి, ఎక్కడ ఐఎన్‌ఏపై బాంబులు వేయాలి, సరఫరా మార్గాలు ఎక్కడ, నేతాజీపై దాడి ఎక్కడ? ఇలా ఎన్నిటినో చర్చించేవారు. మూలన బూట్లు పాలిష్ చేస్తున్న మణి చెవులు మాత్రం ప్రతి మాటను పసిగట్టేవి. పని ముగిసిన తర్వాత మరుగు దొడ్డిలో చిన్న కాగితాలపై సంకేతాలు, తేదీలు రాసి, వాటిని రొట్టెలో, చెప్పుల్లో దాచుకుని, ఆ సమాచారాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ శిబిరానికి చేరవేసేది. ఆమె బూట్లు పాలిష్ చేస్తున్న బాలుడిలా కనిపించినా, బ్రిటిష్ యుద్ధ ప్రణాళికల్ని ఛేదిస్తున్న గూఢచారిగా వ్యవహరించేది.
గూఢచారి జీవితం ప్రతిక్షణం పట్టుబడే ప్రమాదంతో నిండినది. ఒక దశలో, రాజమణి సహచరురాలు బ్రిటిష్‌ల చేతికి చిక్కింది. ఐఎన్ఏ నియమం స్పష్టంగా ఉండేది. ఇక్కడ లెక్క ఏంటంటే.. పట్టుబడితే బ్రతికుండకూడదు. సమాచారం బయటకు పోకూడదు. అందరూ రాజమణికి.. నువు పారిపో, అక్కడికి వెళ్తే నువు చనిపోతావని హెచ్చరించారు. కానీ ఆమె సమాధానం మాత్రం నా స్నేహితురాలు పట్టుబడింది, నేనూ పారిపోవాలా? అది నా వల్ల కాదని తెగేసి చెప్పారామె.
రాత్రి చీకటిలో, అబ్బాయి వేషంలో, ఆమె బ్రిటిష్ కోటలోకి చొరబడింది. కాపలాదారుల బలహీనతలు ఆమెకు తెలుసు. వారి ఆహారం, టీలో మత్తు మందు కలిపి, వారిని గాఢ నిద్రలోకి నెట్టింది. తాళాలు దొంగిలించి, సహచరురాలి గదిని తెరిచి, ఇద్దరూ జైలు గోడ ఎక్కుతుండగా సైరన్ మోగింది, సర్చ్‌లైట్లు తిరిగాయి, కాల్పులు మొదలయ్యాయి.
ఒక బుల్లెట్ ఆమె కాలిని చీల్చుకుంటూ వెళ్లింది. రక్తం నేలను తడిపింది. అయినా ఆమె ఆగలేదు. ఆగడం అంటే ఇద్దరి మరణమే. అరణ్యంలో దాక్కొని, బ్రిటిష్ సైనికులు కుక్కలతో వెతుకుతున్నప్పుడు, వారు ఒక చెట్టెక్కి మూడు రోజులు, అంటే 72 గంటలు.. అక్కడే గడిపారు. నీరు లేకుండా, ఆహారం లేకుండా, గాయంతో, జ్వరంతో. కాలి గాయంతో, మూడు రోజులు చెట్టుపైనే.. ఇది సినిమా కాదు, భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలోని నిజమైన సాహసోపేత అధ్యాయం.
శిబిరానికి చేరేసరికి రాజమణి దాదాపు స్పృహ కోల్పోయింది. డాక్టర్ ఆమె కాలి నుంచి బుల్లెట్ ని తీస్తుండగా, నేతాజీ స్వయంగా వచ్చి, ఆ పదహారు ఏళ్ల గూఢచారికి సెల్యూట్ చేశారు. ఆమె ధైర్యానికి గుర్తుగా, జపాన్ చక్రవర్తి ఇచ్చిన పిస్టల్‌ను బహుమతిగా ఇవ్వాలనుకున్నారనే వర్ణనలు ఉన్నాయి. కానీ రాజమణి కోరిందొకటే.. భారత స్వాతంత్రం. ఆమెకు ఐఎన్ఏలో లెఫ్టినెంట్ హోదా, జపాన్ చక్రవర్తి నుంచి పతకం లభించిందని పలు ఆధారాల ద్వారా తెలుస్తోంది. మన సేనలో ఇంతటి ఫైర్ బ్రాండ్ ఉందని నాకు తెలీదు. నువ్వే నా ఝాన్సీ రాణీ అంటూ కితాబునిచ్చారు నేతాజీ.
యుద్ధం ముగిసిన తర్వాత.. అంతులేని సంపదల నుంచి దారిద్రానికి దిగజారిపోయారామె. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, ఐఎన్ఏను నేతాజీ విరమింపజేశారు. రాజమణి కుటుంబం తమ బంగారు గని సహా సంపదను విడిచిపెట్టి, భారతదేశానికి తిరిగి వచ్చింది. కాలక్రమేణా ఆర్థిక పరిస్థితి క్షీణించింది. చెన్నై రాయపేటలోని ఒక చిన్న అద్దె గదిలో, స్వాతంత్ర సమరయోధుల పెన్షన్‌పై ఆధారపడి, ఆమె జీవితపు చివరి దశ గడిచింది.
2005 ప్రాంతంలో, ఆమె ఆర్థిక ఇబ్బందుల గురించి వార్తలు వెలువడిన తర్వాత, తమిళనాడు ప్రభుత్వం ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం, గృహ వసతి కల్పించింది. 2004 సునామీ సమయంలో, తన మందులకే డబ్బుల్లేని స్థితిలో కూడా, తన దాచుకున్న పెన్షన్ మొత్తాన్ని సహాయ నిధికి విరాళంగా ఇచ్చిందని అంటారు, ఇది ఆమె దాతృత్వానికి మరో మచ్చు తునక.
ఇవ్వడం నా రక్తంలో ఉంది.. చిన్నప్పుడే దేశానికి ఎంతో ఇచ్చాను, ఇప్పుడు దేశ ప్రజల కోసం ఇస్తున్నాను. అంతే తేడా అని అంటారామె. 2018 జనవరి 13న, 91 ఏళ్ల వయస్సులో, చెన్నైలో ఆమె కన్నుమూసింది. జాతీయ శోకం లేదు, పెద్ద టీవీ చర్చలు లేవు. కానీ ఆమెది చాలా పెద్ద కథ, తరువాతి సంవత్సరాల్లో వ్యాసాలు, డాక్యుమెంటరీలు, టెలివిజన్ సిరీస్‌ల ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చారామె.
న్యాయ, రాజకీయ, సామాజిక కోణాల్లోంచి చూస్తే మనకు తెలిసినవి మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ మాత్రమే. కానీ చరిత్ర పుటల్లో కనిపించని ఎందరో మహామహులున్నారు. వారిలో రాజామణి సరస్వతి ఒకరు.
భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రను ప్రధానంగా అహింసా, సత్యాగ్రహ వంటి కోణాల్లోంచి మాత్రమే చూడ్డం మనకు అలవాటైంది. అలాంటి నేరేటివ్ బిల్డ్ చేశారు. కానీ సాయుధ పోరాటం, ఐఎన్ఏ, గూఢచర్యం, విదేశీ రంగాల్లో జరిగిన సాహసాలు.. ఇవన్నీ మన స్కూల్ బుక్స్ లో కనీసం చివరి పేజీల్లో కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారన్న విమర్శలున్నాయి.
సరస్వతి రాజమణి వంటి మహిళా గూఢచారులు, రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ యోధురాళ్లు, ఐఎన్ఏ సైనికులు.. వారి పాత్రను కేవలం సైడ్ కేరెక్టర్ల కింద మాత్రమే చూపించడం.. మన చారిత్రక రచనలో దాగిన నిజమైన ద్రోహమనే చెప్పాలి.
స్వాతంత్ర్యాన్ని కేవలం అహింసా కథగా మాత్రమే చూపించడం, ఆయుధం పట్టిన తరం త్యాగాన్ని నీరుగార్చినట్లే. అన్న మాట వినిపిస్తుంది.
ఐఎన్ఏ మహిళా యోధురాళ్లకు, గూఢచారులకు, స్వాతంత్రం తర్వాత సిస్టమేటిక్‌గా సముచిత గుర్తింపు ఆలస్యంగా లభించింది. పెన్షన్, గృహం, వైద్య సహాయం వంటి అంశాల్లో కూడా, వారు ప్రభుత్వ యంత్రాంగం ముందు పిటిషనర్లు కావాల్సి వచ్చింది.
ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అనేక మహిళల కథ. వారి త్యాగం, వారి శరీరంపై మిగిలిన గాయాల గుర్తులు, వారి జీవిత కాలం అనుభవించిన దరిద్రం ఇవన్నీ, రాష్ట్రం–సమాజం కృతజ్ఞతా బద్ధతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతాయి.
ఇటీవలి కాలంలో, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీల ద్వారా గూఢచారుల కథలు ప్రజాదరణ పొందుతున్నాయి. ధురంధర్ వంటి కల్పిత కథల ముందు, సరస్వతి రాజమణి వంటి నిజమైన గూఢచారుల కథలు మళ్లీ వెలుగులోకి రావడం, భారత చరిత్రను సమగ్రంగా చూడాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.
సరస్వతి రాజమణి జీవితం, భారత స్వాతంత్ర సంగ్రామం ఒకే రేఖలో నడవలేదని, అది అనేక మార్గాల సంగమమని మనకు గుర్తుచేస్తుంది. బంగారు గనుల వారసురాలిగా జన్మించి, నేతాజీ పిలుపుతో ఆభరణాలన్నీ దేశానికి అర్పించి, అబ్బాయి వేషంలో బ్రిటిష్ శిబిరాల్లో గూఢచర్యం చేసి, బుల్లెట్లతో గాయపడి, మూడు రోజులు చెట్టుపై దాక్కుని, స్వాతంత్రం తర్వాత దారిద్రంలో జీవించి,
చివరికి తన పెన్షన్‌ను కూడా దేశ ప్రజల కోసం విరాళంగా ఇచ్చిన ఈ త్యాగమయి జీవితానికి తగిన విలువైన గౌరవం ఈ జాతి సమర్పించిందా లేదా అన్నది అనుమానమే.
ఈ స్వేచ్ఛను ఒక పదహారు ఏళ్ల అమ్మాయి తన కాళ్ల రక్తంతో, తన మొత్తం జీవిత త్యాగంతో చెల్లించింది.. ఆమె పేరు సరస్వతి రాజమణి. ఎందరో త్యాగధనులు అష్టకష్టాలను ఓర్చి సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడమే, వారికి మనం సమర్పించే నిజమైన నివాళి. మహాత్మా, చాచాలతో పాటు, నేతాజీ, ఐఎన్ఏ, సరస్వతి రాజమణి వంటి మరచిపోయిన వీరుల పేర్లు కూడా భారత చరిత్రలో సమాన స్థాయిలో నిలిచే రోజు వచ్చినప్పుడే, మన చరిత్ర నిజంగా సంపూర్ణమవుతుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.





