కేవీపీ చక్రం తిప్పుతున్నారా
posted on Apr 26, 2014 10:58AM
.jpg)
వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లుంది కేవీపీ పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో తెర వెనుకే ఉంటూ ఆయన గిరగిరా చక్రం తిప్పారు. ఆ తరువాత రాష్ట్ర విభజన వ్యవహారంలో కూడా ఆయన గిరగిరా చక్రం తిప్పి అందరినీ ఆకట్టుకొన్నారు. అధిష్టాన దేవత ఆగ్రహానికి గురయిన తోటి కాంగ్రెస్ యంపీలు అందరూ పార్టీ నుండి సస్పెండ్ అయ్యి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా చెల్లాచెదురయి అగమ్య గోచరంగా తిరుగుతుంటే, రాజ్యసభలో ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలిపినప్పటికీ ఆయన మాత్రం మళ్ళీ అదే రాజ్యసభలో సీటు దక్కించుకోగలగడం ఆయన చక్రం మహిమేననుకోవాలి. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆయనే చక్రం తిప్పి పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణా పీసీసీ కుర్చీలో కూర్చోబెట్టారని కేసీఆర్ అంతటివాడు ప్రకటించడం ఆయన చక్రం పవరేమిటో తెలియజేస్తోంది. అదేవిదంగా, తనను ప్రలోభ పెట్టడానికి ఆయన ‘వేల కోట్లు’ ఆఫర్ చేసారని కేసీఆర్ చెప్పుకోవడం కూడా ఆయన ‘గొప్ప ధనాన్ని’ తెలియజేస్తోంది.
ఇంతటి గొప్ప వ్యక్తి కూడా ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న అమెరికాలో యఫ్.బీ.ఐ. అనే ఒక దర్యాప్తు సంస్థ టైటానియం కుంభకోణంలో తనను నిందితుడని ప్రకటించినపుడు మొదట మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ, ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యి అది నేరుగా వయా డిల్లీ ఏకంగా తన కొంపకే వచ్చేయడంతో ఆయన ‘శరణు శరణు’ అంటూ హై కోర్టును ఆశ్రయించారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసు నుండి నిన్ను కాపాడలేమని కోర్టువారు కూడా తప్పుకోవడంతో, తన లాయర్ల సలహా మేరకు మళ్ళీఅదే కోర్టులో తనను సీబీఐ లేదా సీ.ఐ.డీ వారు అరెస్టు చేయకుండా స్టే ఇమ్మని కోరుతూ మరో పిటిషను పడేసి లౌక్యం ప్రదర్శించారు. అది కోర్టు పరిధిలోకే వస్తుంది గనుక ఆయన పిటిషన్ను విచారణకు స్వీకరించి కేసును సోమవారానికి వాయిదా వేసింది హై కోర్టు.
మరి మళ్ళీ ఆయన తన చక్రం అడ్డువేసారో ఏమో కానీ, రెడ్ కార్నర్ నోటీసు అందుకొన్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన సీఐడీ వారు, తమకు అందిన నోటీసులో కేవీపీ గారిని అరెస్టు చేయమని ఎక్కడా ఒక్క అక్షరం ముక్క కూడా కనబడలేదని, అందువల్ల ఆ నాలుగు ముక్కలు ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప ఆయనను అరెస్టు చేయడానికి తమ రూల్స్ ఒప్పుకోవంటూ డిల్లీకి ఓ లెటర్ కొట్టి చేతులు దులుపుకొన్నారు.
అయితే సదరు నోటీసు హైదరాబాదుకి పంపించి చేతులు దులుపుకొన్న సీబీఐ వారు, అసలు రెడ్ కార్నర్ నోటీసు అంటేనే అరెస్టు వారెంట్ అనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకపోతే ఎలా? అని విసుకొంటూ, విదేశాంగ శాఖ వారికి ‘ఆ నాలుగు ముక్కలు’ వ్రాసుకోనేందుకు అనుమతి కోరుతూ మరో లెటర్ కొట్టేసి చేతులు దులుపుకొన్నారు. ఒకవేళ కేవేపీ వారి చక్రం గిరగిరా తిరుగుతుంటే ఆ రెడ్ కార్నర్ నోటీసు ఒక కార్యాలయం నుండి మరొక దానికి, ఒక మంత్రిత్వ శాఖ నుండో మరొక దానికి, హైదరాబాదు నుండి డిల్లీకి, డిల్లీ నుండి హైదరాబాదుకి మళ్ళీ వెనక్కి అక్కడి నుండి మళ్ళీ అమెరికాకి, అమెరికా నుండి డిల్లీ మధ్యన తిరుగుతూనే ఉండిపోయినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఏ కారణం చేతయినా ఆయన చక్రం పనిచేయక అరెస్టు అనివార్యమయితే అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యపాడయిపోయినా పోవచ్చును. ప్చ్..ప్చ్..