డీఎంకేకి ఖుష్బూ గుడ్ బై.. బీజేపీలోకి..?
posted on: Jun 17, 2014 5:19PM
.jpg)
ఒకప్పుడు తమిళ సినిమా రంగంలో టాప్ హీరోయిన్‌గా ఒక ఊపు ఊపిన ఖుష్బూ ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి సారించారు. కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే పార్టీలో చేరిన ఆమె ఆ పార్టీకి చాలా ఎన్నికలలో ప్రచారం చేశారు. అయితే ఆమె తాజాగా డీఎంకేకి రాజీనామా చేశారు. తాను పార్టీకి సేవలు చేస్తూనే వుంటోంది తప్ప డీఎంకే పార్టీ నుంచి తనకేమీ లభించడం లేదని ఆమె చెప్పింది. డీఎంకేతో తన ప్రయాణం ‘వన్ వే’ మాదిరిగా వుందని వాపోతూ ఆమె పార్టీకి రాజీనామా చేశారు.
ఇప్పుడు ఖుష్బూ దృష్టి బీజేపీ మీద పడినట్టు తెలుస్తోంది. ఆమె త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం వుందని రాజకీయ పరిశీకులు అంచనా వేస్తున్నారు. తమిళ రాజకీయాలలో మరో జయలలిత స్థాయిని అందుకోవాలని కలలు కని రాజకీయ రంగప్రవేశం చేసిన ఖుష్బూకి రాజకీయాలలో పెద్దగా అభివృద్ధి కనిపించలేదు. మర్రిచెట్టులాంటి డీఎంకే లాంటి పార్టీ నీడలో వుంటే తమిళనాడు రాజకీయాలలో తాను సాధించేదేమీ లేదని, కరుణానిధి కుటుంబాన్ని దాటుకుని తాను డీఎంకేలో ఎదిగే అవకాశం లేదని ఖుష్బూ అర్థం చేసుకున్నారు. అందుకే డీఎంకే నుంచి బయటపడి బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
ప్రస్తుతం బీజేపీకి తమిళనాడులో చెప్పుకోదగ్గ నాయకత్వం లేదు. తాను బీజేపీలో చేరిన పక్షంలో పార్టీలో ఉన్నత స్థానానికి రాగలనని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. టైమ్ బాగుంటే తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు. లేకపోతే కేంద్ర స్థాయి రాజకీయాలకు వెళ్ళొచ్చన్న అభిప్రాయంలో ఖుష్బూ వున్నట్టు తెలుస్తోంది. ఖుష్బూ పార్టీలోకి వస్తే చేర్చుకోవడానికి బీజేపీ అగ్ర నాయకత్వం కూడా సిద్ధంగా వున్నట్టు తెలుస్తోంది. ఒక ముస్లిం మహిళ తమ పార్టీలోకి వస్తే బీజేపీ ముస్లింలకు దగ్గరయ్యే అవకాశాలు బలపడతాయని బీజేపీ నాయకత్వం భావిస్తునట్టు సమాచారం.



.jpg)
.jpg)

.webp)



