నిన్న కుంకీ ఏనుగురు.. నేడు ఆడపులులు.. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం పవన్ వ్యూహాలు!

posted on: Jun 17, 2026 11:19AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్, వన్యప్రాణుల రక్షణ విషయంలో కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఏనుగుల దాడిని అరికట్టడానికి కుమ్కీ ఏనుగులను రంగంలోకి దించిన ఆయన.. ఇప్పుడు నల్లమల అడవుల పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఒక   ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో క్షీణిస్తున్న పులుల జనాభాను పెంచడమే లక్ష్యంగా ఆయన  కేంద్ర ప్రభుత్వానికి  నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంతతిని వేగంగా వృద్ధి చేయడం కోసం ఇతర రాష్ట్రాల నుండి ఆరు ఆడ పులులను ఏపీకి పంపాలని కోరారు.  

ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ సమతుల్యతపై  పవన్ కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా నల్లమల అడవుల్లో పులుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్..  పర్యావరణ మార్పులు, మానవ జోక్యం, వేట వంటి వివిధ కారణాల వల్ల ఈ ప్రాంతంలో పులుల సంతతి క్రమంగా క్షీణిస్తోందనీ,  ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆయన  లేడీ టైగర్స్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. 

ఈ  ప్రతిపాదనలో భాగంగా ఏపీకి   కేంద్ర ప్రభుత్వం  6 ఆడ పులులను పంపించాలని కోరారు.  అందులో వన్యప్రాణుల సంరక్షణలో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర నుండి 4 , మధ్యప్రదేశ్ నుండి   2 ఆడ పులులను ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని ఆయన కేంద్ర మంత్రిని  కోరారు. ఈ ఆరు ఆడ పులులను నల్లమల అటవీ ప్రాంతంలో  వదిలిపెట్టడం ద్వారా పులుల మధ్య  Breeding ప్రక్రియ వేగవంతం అవుతుందని, ఇది దీర్ఘకాలంలో పులుల సంఖ్యను పెంచడానికి దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ బ్రీడింగ్ ప్రోగ్రామ్  సక్సెస్ అయితే..  భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యంత శక్తిమంతమైన టైగర్ కన్జర్వేషన్ జోన్‌గా అవతరిస్తుందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు. 

రాబోయే రోజుల్లో ఏపీ నుంచే ఇతర రాష్ట్రాలకు పులులను పంపించే స్థాయికి  రాష్ట్ర అడవులు ఎదుగుతాయని ఆయన కేంద్రమంత్రికి వివరించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వినూత్న ప్రతిపాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో  హాట్ టాపిక్‌గా మారింది. వన్యప్రాణుల సంరక్షణపై ఆయన చూపిస్తున్న శ్రద్ధ నల్లమల అడవుల రూపురేఖలను మార్చడమే కాకుండా, పర్యావరణ ప్రేమికుల్లో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...