రేపు కుంకీ ఏనుగులకు ఆహారం అందించనున్న డిప్యూటీ సీఎం పవన్

posted on: Jul 23, 2026 9:28PM

 

చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా వాటికి అక్కడ విశ్రాంతి కల్పించారు. డిప్యూటీ సీఎం, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రేపు శుక్రవారం ఉదయం ఈ కుంకీ ఏనుగులకు ప్రత్యేకంగా ఆహారం అందించనున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక వాహనాల ద్వారా వాటిని అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలించను న్నారు.

రాష్ట్రంలో అడవి ఏనుగుల సంచారం పెరగడం, గ్రామాలపై దాడులు, పంటల ధ్వంసం వంటి సమస్యల నేపథ్యంలో మానవ- ఏనుగు ఘర్షణలను తగ్గించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక శిక్షణ పొందిన ఈ కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను సురక్షితంగా అడవిలోకి మళ్లించడం, రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం, అటవీ శాఖ చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తాయి.పలమనేరు నుంచి మన్యం జిల్లాకు తరలిస్తున్న ఈ ఏనుగు లకు ప్రయాణమంతా పశువైద్యులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ అందిస్తున్నారు. మన్యం జిల్లాకు చేరుకున్న అనంతరం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని అలవాటు చేసి, ఏనుగుల నిర్వహణ, నియంత్రణ కార్యక్రమాల్లో వినియోగించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...