కేటీఆర్‌ను అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తాం : సజ్జనార్

posted on: Jan 23, 2026 8:30PM

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. విచారణ పూర్తిగా చట్టబద్దంగా జరుగుతోందన్నారు. కేటీఆర్‌ను ఒంటరిగానే విచారించమని, ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినట్లు తెలిపారు. సాక్ష్యులను ప్రభావితం చేయుద్దని అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని కేటీఆర్‌కు చెప్పామన్నారు.

నేటి విచారణ పూర్తిగా పంజాగుట్ట పీఎస్ పరిధిలోని క్రైమ్ నం.243/2024 కేసుకు మాత్రమే పరిమితమని తెలిపారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థకు చెందిన వ్యక్తులు సహా వేలాది మందిపై జరిగినట్లు ఆరోపణలున్న అక్రమ ఫోన్ నిఘా, కాల్ ఇంటర్‌సెప్షన్ వ్యవహారానికి ఈ విచారణ సంబంధించదని స్పష్టం చేశారు.

అయితే, భద్రతా కారణాల పేరుతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇందులో ఎటువంటి అక్రమం లేదని కొన్ని మీడియా విభాగాలు మరియు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిట్ గమనించింది. ఇటువంటి ఆధారరహిత కథనాలకు దర్యాప్తు సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దర్యాప్తు పూర్తిగా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా మరియు వృత్తిపరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రజలు నిర్ధారణ లేని లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని, అధికారికంగా వెలువడే ప్రకటనలు మరియు రికార్డులో ఉన్న వాస్తవాలనే విశ్వసించాలని సిట్ విజ్ఞప్తి చేసింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నిజాలు వెలుగులోకి తీసుకొచ్చే దిశగా దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...