ఇది దర్యాప్తు కాదు… డైవర్షన్ డ్రామా : కేటీఆర్

posted on: Jan 23, 2026 7:33PM

 

సిట్ విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తనకు సంఘీభావంగా వచ్చిన ఎమ్మెల్యేలు, రాష్ట్ర-జిల్లా స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ అసమర్థ పాలన, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వరుసగా “కాలక్షేప కథాచిత్రాలు” నడుపుతోందని కేటీఆర్ ఆరోపించారు. అదే పరంపరలో భాగంగా తనను ఫోన్ ట్యాపింగ్ అంశంపై నోటీసులు ఇచ్చి పిలిపించారని అన్నారు. విచారణకు పూర్తిగా సహకరించానని, దాదాపు ఏడున్నర గంటల పాటు పోలీసులు అడిగిన ప్రతీ ప్రశ్నకూ సమాధానం ఇచ్చానని తెలిపారు.

విచారణ సందర్భంగా తాను కూడా అధికారులను ప్రశ్నించానని కేటీఆర్ చెప్పారు. గత రెండేళ్లుగా విచారణల పేరుతో జరుగుతున్న లీకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల వ్యక్తిత్వ హననానికి బాధ్యులు ఎవరు? అని అడిగితే, “మాకు సంబంధం లేదు, మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం” అంటూ చేతులు దులుపుకున్నారని కేటీఆర్ విమర్శించారు.

మీడియాకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిన కేటీఆర్ 

ఈ ప్రభుత్వం లీకుల మీద నడిచే ప్రభుత్వం. వాళ్లు ఇచ్చే అడ్డగోలు లీకులను యథేచ్ఛగా ప్రచురించకండి. నిజం ఎంత, అబద్ధం ఎంత చెక్ చేసుకుని రాయండి” అని మాజీ మంత్రి కోరారు. తమకు కుటుంబాలు ఉన్నాయి, అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారని… ఇష్టమొచ్చినట్టు వార్తలు రాయడం వల్ల వాళ్లు బాధపడతారని అన్నారు.

హరీష్ రావు విచారణ సమయంలో కూడా ఇలాగే అడ్డగోలు లీకులు ఇచ్చారని, ఈరోజూ కూడా “ఎన్ని ప్రశ్నలు అడిగారు, ఉక్కిరిబిక్కిరి చేశారు” అంటూ కథనాలు నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి అక్కడ ఎనిమిది గంటలు 300 మంది పేర్లు చదువుతూ “ఈయన తెలుసా? ఫలానా తెలుసా?” అని టైంపాస్ చేయడం తప్ప అసలు విషయమే లేదన్నారు.

బీఆర్ఎస్ ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఎన్ని సార్లు పిలిచినా విచారణలకు హాజరవుతామని, చట్టాన్ని గౌరవిస్తూ పూర్తిస్థాయిలో సహకరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, డైవర్షన్ రాజకీయాలను మాత్రం ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.

సింగరేణి టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, ముఖ్యమంత్రి మంత్రుల మధ్య వాటాల పంచాయతీలో దొంగలు దొరికారని హరీష్ రావు ఆధారాలతో చెప్పినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అలాగే సీఎం రేవంత్ అనుచరుడు, మంత్రి ఓఎస్డీ మధ్య 300 కోట్ల రూపాయల పంచాయతీ వ్యవహారం, రెవెన్యూ మంత్రి కుమారుడి భూ కబ్జాలు, హెచ్‌ఐఎల్టీపీ పేరుతో హైదరాబాద్ ఆస్తుల దోపిడీ, అమృత్ పథకంలో అక్రమ టెండర్లు… వీటన్నింటిపైనా ఎందుకు సిట్ వేయడం లేదని ప్రశ్నించారు.

“న్యాయం ధర్మం ఖాకీ బుక్ అందరికీ ఒకటేనా? మాపై మాత్రమే సిట్‌లు, మిగతావాళ్లపై ఎందుకు ఉండవు?” అని కేటీఆర్ నిలదీశారు. విచారణలో తన పక్కన ఇంకెవరూ లేరని, తారక రామారావు ఒక్కడే ఉన్నాడని, బయట వచ్చిన కథనాలన్నీ కల్పితమని స్పష్టం చేశారు. మంత్రుల, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నది నిజమని తేలిపోయిందన్నారు.

ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుంచి మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. “మేము భయపడేవాళ్లమైతే కోర్టుకు వెళ్లి సమయం అడిగేవాళ్లం. నిన్న సిరిసిల్లలో ఉన్నాను, 4:30కి రమ్మంటే రాత్రే బయల్దేరి వచ్చాను. హరీష్ రావు కూడా పిలవగానే వచ్చారు. మాకు భయం ఉంటే ఎందుకు వస్తాం?” అని కేటీఆర్ ప్రశ్నించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...