మా తిట్లు వింటుంటే ఆయనకు పైశాచిక ఆనందం వస్తుందంట : కేటీఆర్

posted on: Apr 29, 2026 3:20PM

 

ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని తిడుతుంటే తనకు “శాడిస్టిక్ ప్లెజర్” వస్తుందని చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో మోసపోయిన ప్రజలు, ప్రభుత్వ అరాచకాల వల్ల అన్యాయానికి గురవుతున్న వర్గాలు బాధతో స్పందిస్తుంటే… వాటిని చూసి సంతోషపడుతున్నానని చెప్పడం అత్యంత దురదృష్టకరమని కేటీఆర్ విమర్శించారు.

ప్రజల సమస్యలను ప్రతిపక్షం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే, వాటిపై స్పందించాల్సిన ముఖ్యమంత్రి… ప్రతిపక్షాలపై పైశాచిక వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు.రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు 140 మంది ప్రాణాలు కోల్పోయినా, రేవంత్ రెడ్డికి కనీసం సిగ్గు అనిపించడం లేదని ఆరోపించారు. కరెంట్‌ను కోతలు లేకుండా సరఫరా చేయలేకపోవడం, రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయలేకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు.

రైతుల ధాన్యం రోడ్లపైనే వానలకు తడిసి పోతుంటే, వారు కన్నీళ్లు పెట్టుకుంటుంటే… ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ప్రజల బాధలను ప్రతిబింబిస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే… వాటిని చూసి ఆనందం పొందుతున్నానని చెప్పుకునే ముఖ్యమంత్రిని ఏమనాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

ప్రతిసారి “నేను మారిన మనిషిని” అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ఇప్పటికీ అదే అడ్డగోలు వ్యాఖ్యలతో కొనసాగుతున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు రావడంతో, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు. పరీక్షలు, చదువులకు దూరమవుతున్న విద్యార్థుల పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పంటల కొనుగోలు దాదాపు నిలిచిపోయిందని, ధాన్యం, మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు. ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు కేటాయించకపోవడం, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొనుగోళ్లు ఆలస్యం చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల కష్టాలను గమనించకుండా, వారి ధాన్యం వానలో తడిసి నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...