Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్-కిషన్ రెడ్డి డ్రామాలు : కేటీఆర్
posted on: Jun 23, 2026 6:41PM

హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శేరిలింగంపల్లిలో నిర్వహించిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు, కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఏదో సాధించినట్లు చూపిస్తూ ఢిల్లీలో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. హైదరాబాద్‌లో పరస్పరం విమర్శలు చేసుకుంటూ, ఢిల్లీలో మాత్రం కలిసి కనిపించడం ప్రజలను మభ్యపెట్టడానికేనని అన్నారు.
హైదరాబాద్ మెట్రో పరిధిలోని సుమారు 250 ఎకరాల భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని కేటీఆర్ ఆరోపించారు. దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను కుటుంబ సభ్యులు, అనుచరులకు అప్పగించే భారీ కుంభకోణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అన్నారు. ఈ ఉద్దేశంతోనే మెట్రో సంస్థ ఎల్‌అండ్‌టిని బ్లాక్‌మెయిల్ చేసి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు.
ప్రైవేట్ సంస్థ అయిన ఎల్‌అండ్‌టి తీసుకున్న రూ.14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కేటీఆర్ విమర్శించారు. మెట్రోపై ప్రేమ ఉన్నట్లు చూపిస్తున్న రేవంత్ రెడ్డి చర్యల వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు.
మెట్రో విస్తరణ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీకాపూల్–పటాన్‌చెరు మెట్రో కారిడార్‌కు ఎందుకు ఆమోదం తెలపలేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో చిన్న నగరాలకు కూడా మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపిందని ఆరోపించారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి విమానాశ్రయం వరకు భూసేకరణ అవసరం లేకుండా చేపట్టిన ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని కేటీఆర్ అన్నారు. ఆ ప్రాజెక్టు కొనసాగి ఉంటే ఇప్పటికి పూర్తై లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం లభించేదని పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, దాన్ని 70 శాతానికి పైగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని కేటీఆర్ గుర్తుచేశారు. నగరంలో మెట్రో విస్తరణ మళ్లీ వేగం అందుకోవాలంటే కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు.
రేవంత్ రెడ్డి పరిపాలనకు తుగ్లక్, హిట్లర్ స్ఫూర్తిగా మారారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయడం తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షలాది మందిపై ప్రభావం చూపే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలుకు మాత్రం నిధులు లేవని చెప్పడం విడ్డూరమని విమర్శించారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.9,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని, గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిధులు తీసుకొచ్చిందో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
మళ్లీ శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరాలంటే కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే రోజుకోసం ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.






