కేంద్రంతో అవసరాలు అలా ఉంటాయి భయ్యా!

posted on: Feb 24, 2026 9:32AM

ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్.. కేంద్ర బీజేపీ నాయకత్వంతో ఎంత పనుందో పాపం.. బీజేపీ ప్రోగా లెక్కలేనన్ని నిర్ణయాలు, కామెంట్లు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ వర్కర్స్ అర్ధనగ్న ప్రదర్శనలు చేసినపుడు.. ఇటు జగన్, అటు కేటీఆర్ ఇద్దరూ  ఖండించారు. మాములుగా అయితే ఈ రెండు పార్టీలూ ఇక్కడ బీజేపీతో  పోరాటం చేస్తుంటాయి. కానీ అదేం విచిత్రమో గానీ కేంద్ర బీజేపీ నిర్ణయాలు, విధానాలను మాత్రం ఎలాంటి శషబిషలూ లేకుండా సమర్ధిస్తుంటాయి. ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం  అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది. దానికి తోడు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఆపై ఈకార్ రేసు కేసుల విషయంలో కేంద్రం అండ అవసరం రీత్యా కూడా.. కేటీఆర్ బీజేపీ అనుకూల వాయిస్ వినిపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏఐ సమ్మిల్ లో కాంగ్రెస్ వర్కర్ల చర్యను ఖండించినట్టు కనిపిస్తోంది. గతంలో ఉప రాష్ట్రపతికి ఓటు వేసేటపుడు తటస్థంగానే కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు కేంద్రంతో అవసరాలు బాగా ఎక్కువ కావడం వల్ల కావచ్చు.. పూర్తి అనుకూల స్టాండ్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

ఇక  వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే ఇటు ఉపరాష్ట్రపతి కావచ్చు, అటు ఉపాధి హామీ పథకానికి జీరాంజీగా పేరు మార్పు అంశం కావచ్చు.. ఇలా వరుస వెంబడి బీజేపీ విధానాలకు, నిర్ణయాలకూ అనుకూలంగా గళం వినిపిస్తూనే ఉన్నారు.  అంతగా ఆయన  కమలానికి ట్యూన్ అయిపోయారు.

తాజాగా కాంగ్రెస్ వర్కర్ల అర్ధనగ్న ప్రదర్శననును జగన్ ఖండించడం కూడా అందులో భాగమేనంటున్నారు. దానికి తోడు జగన్ కి బెయిల్ వచ్చి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక పోతే ఆల్రెడీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారం నడుస్తోంది. ఇక మిథున్ రెడ్డి సైతం బీజేపీకి వెళ్లేలా తెలుస్తోంది. అవినాష్ రెడ్డి సైతం ఒక సమయంలో తాను కాషాయ కండువా కప్పుకోవచ్చు అన్న కోణంలో కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో పోస్టారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే వైసీపీ పరిస్థితి కూడా ఇంచు మించు బీఆర్ఎస్ లాగానే కనిపిస్తోంది. అక్కడ కవిత ఎలాగో ఇక్కడ షర్మిళ రూపంలో తమ వంశపారంపర్యంగా వస్తున్న కాంగ్రెస్ వాదాన్ని వినిపించడం మాత్రమే మిగులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయ్. జగన్ ద్వారా తమ ఒరిజినల్ బ్లడ్ గ్రూప్ అయిన కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్స్ ఆయన నోటి వెంబడి ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. అందుకే కావచ్చు సోదరి షర్మిళ తన అన్న జగన్ కి అధికారం అస్సలు సూటు కాలేదని తేల్చి పడేశారు.

ఏది ఏమైనా ఇటు తమిళనాడులోని అన్నాడీఎంకేతో పాటు ఏపీలోని వైసీపీ, తెలంగాణలోని బీఆర్ఎస్ ని తమ గుప్పెట పట్టేసుకుంది బీజేపీ అన్న టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. ఆ మాటకొస్తే చంద్రబాబు ఆల్రెడీ బీజేపీతో అంటకాగుతున్నారు కదా? అనొచ్చు. కానీ ఏపీలో చంద్రబాబు, బీజేపీ పొత్తులో డామినేషన్ చంద్రబాబుదే. ఆ విషయం చంద్రబాబుకే కాదు,   బీజేపీకి కూడా బాగా తెలుసు కాబట్టి.. బేఫికర్ అన్న మాట కూడా అంతే స్థాయిలో వినిపిస్తోంది. ఏది ఏమైనా భయ్యా! అధికారంలో లేనపుడు కేంద్రంతో చాలా చాలా పనులుంటాయి. ఈ విషయానికి శశికళ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం కాబట్టి.. మా బాధలు అర్ధం చేసుకోవల్సిందిగా మనవి!!! అంటున్నారు జగన్, కేటీఆర్.

google-ad-img
    Related Sigment News
    • Loading...