2019 తెలంగాణ సీఎం ఎవరో తేలిపోయినట్టేనా?

posted on: Apr 7, 2017 4:41PM

శ్రీరామ నవమినాడు అందర్నీ ఆకట్టుకున్న ఒక సన్నివేశం… భద్రాచల శ్రీరామచంద్రునికి పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి మనవడు తీసుకురావటం! అయితే, ఇది కరెక్టా? కాదా? అనేది వేరే చర్చ. దాని జోలికి మనం వెళ్లకున్నా … కేసీఆర్ మాత్రం క్రమంగా తన బాధ్యతలన్నీ కొడుకు , మనవడి నెత్తిన పెడుతున్నారన్నది నిజం! ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో డిస్కస్ అవుతోంది! స్వామి వారి పట్టు వస్త్రాల్ని పళ్లెంటో పెట్టి మనవడి నెత్తిన పెట్టేసిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కూడా పళ్లెంలో పెట్టి తనయుడు కేటీఆర్ నెత్తిన పెట్టేస్తున్నారని కొందరి అభిప్రాయం! జరుగుతోన్న పరిణామాలు కూడా అదే అనుమానాన్ని బలపరుస్తున్నాయి!

టీఆర్ఎస్ లో నెంబర్ టూ ఎవరంటే ఇప్పుడు అందరి సమాధానం కేటీఆరే! ఒకవైపు హరీష్ రావు, మరో వైపు కవిత వున్నా క్రమంగా మేఘాలు తొలిగిపోతున్నాయి. తారక రాముడు చంద్రశేఖరుడి రాజకీయ వారసుడు కూడా అని తేలిపోతోంది! తాజాగా జరుగుతోన్న టీఆర్ఎస్ బహిరంగ సభలు, వాటిల్లో గులాబీ నేతల పొగడ్తలు, ఆహా, ఓహోలు దీన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి!

నిజామాబాద్ లోని ఆర్మూర్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. అందులో నిజామాబాద్ ఎంపీ కవిత కూడా పాల్గొన్నారు. వేదికపై అన్నాచెల్లెళ్ల అనుబంధం అందర్నీ ఆకట్టుకుంది. కవిత పార్లెమంట్లో అద్బుతంగా మాట్లాడే అయిదుగురు వక్తల్లో ఒకరని కేటీఆర్ అంటే… రామన్న తనకే కాదు తెలంగాణలోని అందరికీ అన్నేనని కవితక్క చెప్పుకొచ్చింది! అయితే, గతంలో ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎప్పుడూ వేదకలపై మాట్లాడలేదు. కాని, ఇప్పుడు 2019 దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ లో కేటీఆర్ శకానికి బాటలు వేస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోతోంది! అసలు అన్నీ తానై పార్టీని నడిపే కేసీఆర్ లేకుండా ఆర్మూర్ లో సభ జరగటమే గొప్ప విషయమైతే… కవితతో సహా నాయకులందరూ యువరాజుని ఆకాశానికి ఎత్తటం మరో ఆసక్తికర పరిణామం!

ఆర్మూర్ సభలో నిజామాబాద్ సీనియర్ నేత పోచారం కేటీఆర్ ని ఆణిముత్యం అన్నారు. మరో నేత అయితే కల్వకుంట్ల తారక రాముడు ఈ తరం శ్రీరాముడనేశారు! ఇక ఒకప్పటి కాంగ్రెస్ ఐకాన్, ఇప్పటి గులాబీ నేత డీఎస్ … తన దీవెనలు కేటీఆర్ కి పుష్కలంగా వుంటాయని ప్రకటించేశారు! ఇలాంటి కేటీఆర్ ప్రమోషన్ సభలు తెలంగాణ అంతటా ముందు ముందు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో.. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సీఎం క్యాండిడేట్ ఎవరనేది ఇకపైన బహిరంగ రహస్యమే! 

google-ad-img
    Related Sigment News
    • Loading...