కృష్ణపట్నం కిరికిరి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014లో చట్టాలకి ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు తమకు అనుకూలంగా బాష్యం చెప్పుకొంటున్నాయి. ఉన్నత విద్యా సంస్థల ప్రవేశ పరీక్షల నిర్వహణ, నియామకాలలో ప్రస్తుత విధానాన్నే మరో పదేళ్ళు కొనసాగించాలని చెప్పినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం ‘మా సెట్ మాదే మీ సెట్ మీదే’ అని చట్టంలోనే రాసి ఉందంటూ విడిగా పరీక్షలు నిర్వహించుకొనేందుకు సిద్దం అవుతోంది. కనుక తెలంగాణా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో తమ వాటాగా 53.89 శాతం ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం వాదిస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయంగా దక్కవలసిన విద్యుత్ కూడా దక్కనీయకుండా మోసం చేస్తోందని తెలంగాణా ప్రభుత్వం వాదిస్తోంది. కానీ విభజనకు ముందు తెలంగాణాకు విద్యుత్ సరఫరా చేసేందుకు చేసుకొన్న విద్యుత్ ఒప్పందాలు ఏవీ చెల్లవని, ఒకవేళ విద్యుత్ కావాలనుకొంటే మళ్ళీ కొత్తగా ఒప్పందాలు చేసుకోవలసిందేనని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. కనుక ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది.

 

ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెలలో గానీ కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నాయి. అందులో 1,600 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కనుక అందులో చట్ట ప్రకారం తమకు రావలసిన 862 మెగావాట్స్ విద్యుత్తును ఇవ్వకపోతే తక్షణమే కోర్టుకి వెళ్లాలని తెలంగాణా ప్రభుత్వం సిద్దంగా ఉంది. “కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు యొక్క ‘కమర్షియల్ డేట్ ఆఫ్ ఆపరేషన్’ ప్రకటన కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఆ నాటి నుండి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుందని అధికారికంగా దృవీకరణ అవుతుంది కనుక అప్పటి నుండి మావాట విడుదల చేయమని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతాము. ఒకవేళ అందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరిస్తే, మేము కోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోము” అని తెలంగాణా జెన్-కో మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ డి.ప్రభాకర్ రావు చెప్పారు. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో తెలంగాణా వాటా క్రింద రూ. 1,050 కోట్లు పెట్టుబడి ఉంది కనుక ఆ మొత్తానికి సరిపడే విధంగా ఒప్పందం చేసుకొని విద్యుత్ పొందవచ్చును. కానీ అందులో తెలంగాణాకి 53.89 శాతం విద్యుత్ సరఫరా చేయడం మాత్రం కుదరదని తేల్చి చెప్పారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సరఫరాకు నిరాకరించినట్లయితే తెలంగాణా ప్రభుత్వం కోర్టుకు వెళ్లేందుకు సిద్దంగా ఉంది. అంటే ఇరు రాష్ట్రాల మధ్య యుద్ధానికి మరో అంశం సిద్దంగా ఉందన్నమాట.