గుడివాడ బరిలో కొడాలి నాని, రావి ఢీ అంటే ఢీ
posted on: May 3, 2014 10:00PM
.jpg)
ఈసారి గుడివాడలో పోటీ ప్రధానంగా వైకాపా అభ్యర్ధిగా దిగిన కొడాలి నాని, తెదేపా అభ్యర్ధి రావి వెంకటేశ్వర రావుల మధ్యే ఉన్నప్పటికీ నానిదే పైచేయిగా కనిపిస్తోంది. కారణం ఆయన గత పదేళ్లుగా నియోజక వర్గాన్నిఅంటిపెట్టుకొని ఉంటూ ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులో ఉండటమే. ఒకప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నకారణంగా, నందమూరి కుటుంబంతో, ముఖ్యంగా జూ.యన్టీఆర్ ఆయనకున్న సాన్నిహిత్యం వలన ప్రజలలో మంచి పేరు సంపాదించుకొన్నారు. నాని తెదేపా నుండి బయటకు వచ్చిన తరువాత గుడివాడపై పట్టు సాధించేందుకు చాలా తీవ్రంగా కృషిచేసారు. ఆయన తమ ప్రత్యర్ధ తెదేపా నుండి వచ్చినవారు కావడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను ప్రోత్సహిస్తూ గుడివాడలో బలపడేందుకు అన్ని విధాల సహకరించారు. కొడాలి నాని స్వయం కృషికి పార్టీ సహకారం కూడా తోడవడంతో గుడివాడలో ఆయన బలంగా నిలద్రోక్కుకోగాలిగారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం ఈ ఎన్నికలలో ఆయనకు కలిసి వచ్చింది. అందువల్ల ఈసారి ఎన్నికలలో తప్పనిసరిగా విజయం సాధించగలనని కొడాలి నాని గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఇక ఆయనపై తెదేపా అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రావి వెంకటేశ్వరరావు రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినవారే. ఆయన తండ్రి శోభనాద్రి చౌదరి గుడివాడ నుండి రెండు సార్లుఎన్నికయ్యారు. ఆయన తరువాత ఆయన కుమారుడు రావి హరగోపాల్ 1999 ఎన్నికల్లో గుడివాడ నుండి ఎన్నికయ్యారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, ఆయన సోదరుడయిన రావి వెంకటేశ్వర రావు 2000 సం.లో జరిగిన ఉప ఎన్నికలలో గుడివాడ నుండి పోటీ చేసి గెలిచారు. రావివెంకటేశ్వర రావు కూడా తన గెలుపుపై అంతే ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, తమ పార్టీ విజయావకాశాలు గల బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడం, మోడీ, బాబు, పవన్ ఉదృత ప్రచారంతో తాను అవలీలగా గెలుస్తానని చెపుతున్నారు. ఈ ఇద్దరు బలమయిన అభ్యర్ధులలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.




.webp)

.webp)


