Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు సీఎల్పీ డిమాండ్..!
posted on: Aug 21, 2026 2:28PM

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది. మంత్రి కొండా సురేఖ ఆమె కుమార్తె కొండా సుస్మితల వైఖరిపై సొంత పార్టీకి చెందిన శాసనసభ్యులు, మండలి సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ లక్ష్యంగా సుస్మిత చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు.
గాంధీభవన్ వేదికగా జరిగిన అత్యవసర కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) విలేకరుల సమావేశంలో దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, అదే విధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి డిస్మిస్ చేయాలని అధిష్ఠానాన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
కూతురు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మంత్రి ఇప్పటివరకు ఖండించకపోవడాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య తీవ్రంగా ఆక్షేపించారు. బాధ్యతాయుతమైన కేబినెట్ హోదాలో ఉన్న నాయకురాలు ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత విషయాలపై ఏదైనా మాట్లాడాలంటే సీఎల్పీ లేదా పీసీసీ సమావేశాల్లో చర్చించాలి తప్ప, బహిరంగంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని స్పష్టం చేశారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ, సురేఖ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టారు. ఏ చెట్టు కింద ఉండి బతుకుతున్నారో ఆ కొమ్మనే నరికేలా సురేఖ కుటుంబం ప్రవర్తిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమించారని, అటువంటి నాయకత్వాన్నే ప్రశ్నించడం విపక్షాలకు బలాన్నివ్వడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా కుటుంబం వెంటనే సీఎంకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు.
దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ, ప్రతిపక్షాల కుట్రలను కొండా కుటుంబం కాంగ్రెస్‌లో ఉంటూనే అమలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వైపు నుంచి ప్రజాపాలన కొనసాగుతుంటే, కొండా సురేఖ మాత్రం ప్రతిపక్ష నేతలా ప్రవర్తించడం సహించరానిదని చెప్పారు. సొంత ప్రభుత్వంపైనే దాడి చేసే నాయకులకు పార్టీలో కొనసాగే హక్కు లేదని తేల్చి చెప్పారు.
పార్టీ ముఖ్య నేతలు, మంత్రుల మధ్య గ్యాప్ రావడం, ప్రత్యేకించి సీఎంను లక్ష్యంగా చేసుకుని విమర్శలు రావడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా కొండా సురేఖ కొన్ని విషయాల్లో నోరుజారి పార్టీని ఇరకాటంలో పడేశారని, ఈసారి మాత్రం అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు సీరియస్‌గా పట్టుబడుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పీసీసీ, అధిష్ఠానం పెద్దలు ఈ వివాదాన్ని సర్దుబాటు చేస్తారా లేక ఎమ్మెల్యేల డిమాండ్ మేరకు కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.
Konda Surekha, CM Revanth Reddy, Telangana Congress, CLP Press Meet, Telangana Politics, TPCC President Mahesh Kumar Goud, MLA Vemula Veeresham



.webp)


