కొణతాలకు సేమ్ టు సేమ్ అదే ట్రీట్‌మెంట్

posted on: Dec 22, 2014 8:57PM

 

ఆలూ లేదు చూలూ లేదు అల్లుడిపేరు సోమలింగం అన్నట్లుగా మాజీ వైకాపా నేత కొణతాల రామకృష్ణ త్వరలో తెదేపాలో జేరబోతున్నట్లు వార్తలు విన్నఅనకాపల్లిలో తెదేపా కార్యకర్తలు కొందరు పట్టణంలో ప్రధాన కూడలి వద్ద ఈరోజు ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసారు. ఇంతకాలం తమ పార్టీని, అధినేత చంద్రబాబును కూడా తిట్టిపోసిన కొణతాలను పార్టీలో చేర్చుకోవద్దంటూ వారు అధిష్టానానికి ఫ్యాక్స్ ద్వారా లేఖలు కూడా పంపారు. తామెంతో కష్టపడి కొణతాల సోదరుడుని ఎన్నికలలో ఓడిస్తే, ఇప్పుడు అన్నదమ్ములిరువురూ దొడ్డి దారిన పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

ఇదివరకు తెదేపా నేత దాడి వీరభద్ర రావు తెదేపాను వీడి వైకాపాలో చేరుతున్నప్పుడు కొణతాల వర్గీయులు కూడా ఇదేవిధంగా నిరసనలు తెలియజేసారు. ఇప్పుడు వారికి కూడా సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఎదురవడం చాలా విచిత్రం. దాడి వీరభద్ర రావు ఎన్నికలలో వైకాపా ఓడిపోగానే పార్టీ నుండి బయటపడితే, ఆయనను వైకాపాలో చేర్చుకొన్నందుకు పార్టీపై అలిగిన కొణతాల కూడా ఆయన తరువాత పార్టీని వీడారు. దాడి వైకాపాను వీడిన తరువాత తిరిగి తెదేపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

కొణతాల బీజేపీలో చేరుతారని చాలా వార్తలు వచ్చేయి. కానీ ఇప్పుడు కొణతాల కూడా తెదేపాలోకి చేరాలనుకొంటున్నట్లు వార్తలు రావడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేయమని కార్యకర్తలను ఎవరు ప్రేరేపించారో? అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా కొణతాలకు తెదేపాలో చేరే ఉద్దేశ్యం లేకపోతే ఆయన దిష్టి బొమ్మలు ఎవరయినా ఎందుకు దగ్ధం చేస్తారు? అని ఆలోచిస్తే ఆయన తెదేపాలోకి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారనే అనుమానం కలుగక మానదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...