రాజగోపాల్ రెడ్డి కింకర్త్యం
posted on Nov 1, 2025 9:26AM
.webp)
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీ ఇచ్చేసింది. దబాయించి, బెదరించి పార్టీలో పదవులను తెచ్చుకోవడం అంత తేలిక కాదని క్లియర్ కట్ గా కాంగ్రెస్ హై కమాండ్ తన చేతల ద్వారా చూపింది. రేవంత్ కేబినెట్ లో బెర్త్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని అస్త్రాలూ ఉపయోగించేశారు. సామ, దాన, బేద, దండోపాయలను వాడేశారు. అయినా పార్టీ హైకమాండ్ కిమ్మనలేదు. చర్యలు తీసుకోలేదు. అలాగని మంత్రి పదవి గ్యారంటీ అన్న హామీను ఇవ్వలేదు. సరికదా... కోమటిరెడ్డికి నేరుగా చెప్పకుండానే కేబినెట్ బెర్త్ ఇచ్చేది లేదన్న విషయాన్ని చేతల ద్వారా చెప్పకనే చెప్పింది.
తనకు మంత్రి పదవి ఇవ్వాలని.. ఇస్తారని.. అయితే ఇందుకు కొందరు అడ్డుపడుతున్నారనీ ఇంత కాలం చెబుతూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్ఠానంపై కూడా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఒకే కుటుంబంలోని వారికి గతంలో పార్టీ హైకమాండ్ పదవులు ఇచ్చిన సందర్భాలను ఉటంకిస్తూ, తనకిస్తే తప్పేమిటని కూడా నిలదీశారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలూ, విమర్శలూ చేసేశారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వారిని అందలం ఎక్కించారని నిష్ఠూరాలాడారు.
గీత దాటి విమర్శలు చేసినా కనీసం క్రమశిక్షణా కమిటీ ముందుకు కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని పిలవలేదు. ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఆయన వ్యాఖ్యలు, విమర్శలను పార్టీ హైకమాండ్ అసలు పట్టించుకోనట్లుగానే వదిలేసింది. కీలెరిగి వాత పెట్టిన సందర్భంగా.. ఆయనకు వాస్తవం కళ్లకు కట్టేలా చేసింది. తాజాగా రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోని మహమ్మద్ అజారుద్దీన్ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా.. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న ఇద్దరు సీనియర్ నాయకులు ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డికి కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పదవులు ఇచ్చారు.
కానీ తనకు మంత్రి పదవి కావాలి, ఇచ్చి తీరాలి అంటూ ఎన్నో ఆశలు పెట్టుకోవడమే కాకుండా, పదవి కోసం నానా యాగీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పూర్తిగా విస్మరించారు. హైకమాండ్ ఈ విషయంలో స్పష్టతతో ఉంది కనుకనే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పూర్తిగా విస్మరించిన అంశం ఇప్పుడు కాంగ్రెస్ లోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని ఏ వర్గం నుంచీ కూడా రాజగోపాల్ రెడ్డి పట్ల సానుభూతి వ్యక్తం అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. పదవి కోసం హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేసే స్థాయిలో వ్యవహరిస్తే.. ఇలాగే ఉంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారన్న ఆసక్తి మాత్రం రాజకీయవర్గాలలో కనిపిస్తోంది.