ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కోసం భారీ క్యూలైన్ ఎక్కడంటే?

posted on: Apr 6, 2026 9:17PM

 

నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది. ఫ్యాన్ ఇండియా సినిమా టికెట్ల కోసమే ఎగబడుతున్న జనం అనుకుంటున్నారా కాదండోయ్  తమ పిల్లలకు అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చి పాఠశాల గేటు ముందు తెల్లవారుజాము నుంచే క్యూలైన్ కట్టారు. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతున్నదానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా, పోటీగా మారిన ఈ పాఠశాలపై జిల్లా ప్రజలతో పాటు ఇతర జిల్లాల తల్లిదండ్రుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఈ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన స్వంత నిధులతో అభివృద్ధి చేశారు. 

ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ విద్యా మందిరంలో స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించ డంతో పాటు విశాలమైన క్రీడా మైదానాన్ని కూడా అందుబాటులో ఉంచారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ పాఠశాల ప్రత్యేకతగా మారింది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

 ఈ పాఠశాల పేరు ప్రతిష్ఠలు పెరగడంతో నల్గొండ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అడ్మిషన్ల కోసం భారీగా దరఖాస్తులు రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఈ స్కూల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ల కోసం పోటీ తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే వివిధ జిల్లాల నుండి వచ్చిన తల్లిదండ్రులు ఈరోజు సోమవారం  తెల్లవారుజామునుండే పాఠశాల గేటు ముందు క్యూలు కట్టారు...ప్రభుత్వ విద్యలో కొత్త దశకు నాంది పలుకుతున్న ఈ పాఠశాలపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...