కొల్లాం ప్రమాదం ఒక గుణపాఠం

posted on: Apr 11, 2016 10:15AM

కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పరవూర్ పుట్టింగల్ దేవి ఆలయంలో బాణాసంచా పేలుళ్ల కారణంగా భారీఎత్తున ప్రాణనష్టం చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకిత్తించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో భద్రత విషయం మరోసారి తెరపైకి వచ్చింది.  కేరళలాగే మనదగ్గరా వివిధ ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలోనో, సమీపానో బాణాసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. తిరుమల,  బెజవాడ కనకదుర్గ,  శ్రీశైలం,  అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి,  వేములవాడ, యాదాద్రి వంటి ప్రముఖ దేవాలయాల ప్రాంగణాల్లో ఉత్సవాలలో బాణాసంచా కాలుస్తుంటారు. ఈ సమయంలో దురదృష్టవశాత్తూ ఏవైనా ప్రమాదాలు జరిగితే వేలాది మందిని గుడిప్రాంగణం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యం. వీటికి అదనంగా జాతర్లు, తీర్థాలు వగైరా వగైరా సందర్భమేదైనా బాణాసంచా కామన్. శ్రీశైలంలో ప్రతి ఏటా దసరా నవరాత్రుల ముగింపు రోజు, హోలీ పండుగ రోజు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

కామదహనం రోజున చెత్తను బాణాసంచాను కలిపి నిప్పంటిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో జరగరానిది జరిగితే రక్షించేది ఎవరు? ఉత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు గుళ్లకు వచ్చే అవకాశం ఉండటంతో ఇలాంటి సందర్భాల్లోనైనా బాణాసంచా వినియోగంపై నిషేధం విధిస్తే మంచిదని నిపుణుల సూచన. ఇది ఆటవిడుపుకోసం భక్తులను ఆకట్టుకోవడానికి చేసే పని తప్పితే ఆచారం కాదంటున్నారు. దేవాలయాల్లో బాణాసంచా వినియోగంపై ప్రభుత్వం, అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. లేదంటే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశముంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...