కోహ్లీయే స్ఫూర్తి.. పీవీ సింధు

posted on: May 20, 2026 10:00AM

భారత ఏస్ షట్లర్,  ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత క్రీడారంగంలో కోహ్లీని మించిన నిజమైన సీనియర్ మరొకరు లేరంటూ  కొనియాడారు. బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  ఇన్నోవేషన్ ల్యాబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియన్ స్పోర్ట్స్ సమిట్  సింధు కోహ్లీని కలిశారు.  ఈ ప్రత్యేక భేటీకి సంబంధించిన ఫోటోను సింధు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సింధు.. విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ సింధు ఇన్‌స్టాగ్రామ్‌లో  భావోద్వేగపూరితమైన పోస్ట్‌  పెట్టారు. తనకు జీవితంలో లేదా క్రీడా ప్రస్థానంలో సరైన మార్గదర్శకత్వం, సలహాలు అవసరమైన ప్రతిసారీ కోహ్లీ సరైన మాటలతో అండగా నిలిచారని సింధు పేర్కొంది.  ఒక సీనియర్ అథ్లెట్ ఎలా ఉండాలో చెప్పడానికి కోహ్లీ కంటే గొప్ప ఉదాహరణ దేశంలోనే ఉండరని పేర్కొంది.  

ఇతరులను ప్రోత్సహించడంలో విరాట్ ఎల్లప్పుడూ ముందుంటారని..   కోహ్లీ వినయం, ఉదారత,  స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు అందరికీ ఆదర్శమని సింధు అన్నారు. గతంలో కోహ్లీ తనకు చెప్పిన  ఎప్పుడూ వెనక్కి తగ్గకు పీవీ  అనే మాటలను తాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ సలహాను గుండెల్లో భద్రపరుచుకున్నానన్న సింధూ.. కోహ్లీ లాంటి గొప్ప వ్యక్తులు ఉండటం వల్లే భారత క్రీడారంగం  మెరుగ్గా ముందుకు సాగుతోందన్నారు.

ప్రస్తుతం కోహ్లీ, సింధు ఇద్దరూ తమ క్రీడా జీవితాల్లో కీలక దశల్లో ఉన్నారు. గాయాల కారణంగా కొంతకాలంగా ఇబ్బందులు పడిన పీవీ సింధు, ప్రస్తుతం మళ్లీ పూర్వ  ఫామ్‌ను అందుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఆమె క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుని పర్వాలేదనిపించారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య అథ్లెట్ల కమిషన్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు స్వీకరించి మైదానం వెలుపల  కొత్త పాత్రను పోషిస్తున్నది.

మరోవైపు విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున పరుగుల వరద పారిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అద్భుతమైన సెంచరీ బాదడంతో పాటు జట్టును ప్లేఆఫ్స్ రేసులో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. క్రికెట్‌తో పాటు క్రీడాకారుల మానసిక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు, ఫిట్‌నెస్ వంటి అంశాలపై జరిగిన ఆర్‌సీబీ సదస్సులో  కోహ్లీ ముఖ్య వక్తగా పాల్గొని తన అనుభవాలను పంచుకున్నాడు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...