కోపమేలయ్యా.. కోదండరామయ్యా!
posted on: Apr 1, 2014 3:22PM

కొండా సురేఖమ్మ తన భర్త కొండా మురళితో కలసి ఏ దుర్ముహూర్తంలో తెరాసలో చేరారోగానీ ఆ క్షణం నుంచి ఆమె మీద విమర్శలు వెల్లువెత్తుతూనే వున్నాయి. నోరు, దాంట్లో నాలుక వున్న ప్రతి వాడూ మానుకోట సంఘటనను ప్రస్తావించి సురేఖమ్మని విమర్శించేవాడే! కొండా దంపతులను తెలంగాణ ద్రోహులుగా పేర్కొంటూ, వాళ్ళని టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం తప్పు అనేవారు. మొన్నటి వరకూ కేసీఆర్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన సురేఖని పార్టీలో చేర్చుకోవడం దారుణమనేవారే! ఈ విమర్శలన్నీ బయటి పార్టీల వాళ్ళు చేస్తే ఓ పద్ధతిగా వుండేది, తెరాసలో వుండేవాళ్ళే సురేఖని వ్యతిరేకిస్తూ వుండటం ఆమెకి బాధ కలిగిస్తోంది.
ఇదిలా వుంటే పొలిటికల్ జేఏసీ నాయకుడు కోదండరామ్ కూడా సురేఖకి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం ఆమెకు ఎంతో బాధని కలిగించినట్టుంది. కోదండరామ్ తనమీద ఆగ్రహాన్ని ప్రకటించడం అన్యాయమని ఆమె ఆక్రోశిస్తున్నారు. కోదండరామ్ మీద మాటల దాడికి దిగారు. తానేదో తెలంగాణ ద్రోహి అన్నట్టు మాట్లా తున్న కోదండరామ్ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ఏంచేశారో చెప్పాలని నిలదీశారు.
గతంలో రాజకీయ జేఏసీ, దాని నాయకుడు కోదండరామ్ ఆదేశించినందువల్లే తాము తమ పదవులకు రాజీనామా చేశామని, అలాగే తెలంగాణ విషయంలో యు టర్న్ తీసుకున్నందువల్లే వైసీపీ నుంచి వైదొలగామని, అలాంటి త్యాగమూర్తులైన తనని, తన భర్తని ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ నాయకులు విమర్శించడం దారుణమని ఆమె వాపోతున్నారు. కొండా సురేఖ ఆవేదనని ఎవరైనా పట్టించుకుంటారో లేక ఆమె ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోతుందో చూడాలి.




.jpg)
.webp)

.webp)


