మరో తప్పుకి సిద్దమవుతున్న కిరణ్
posted on: Jun 17, 2014 11:57AM
.jpg)
ఒకప్పుడు అందు లేడు..ఇందు లేడు అనే సందేహం వలదన్నట్లు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనబడిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల నుండి కనబడకుండా అదృశ్యమయిపోయారు. ఆయన మీడియా భారి నుండి తప్పించుకొనేందుకు ప్రస్తుతం బెంగుళూరులో విశ్రాంతి తీసుకొంటున్నట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీకి సన్నిహితంగా ఉండే కొందరు గుజరాతీ పారిశ్రామికవేత్తలకు ఆయన సహాయపడ్డారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు వారి ద్వారా నరేంద్ర మోడీతో సంప్రదింపులు చేస్తున్నట్లు తాజా సమాచారం.
ఎన్నికలలో ఓడిపోయిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొని ఉంది ఉంటె ఎవరూ ఆశ్చర్యపోయేవారు కాదు. ఆక్షేపించేవారు కాదు. పార్టీ శ్రేయోభిలాషిగా ఆయన చెప్పిన మాటలను పెడచెవిన పెట్టిన కారణంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఓటమి భారంతో క్రుంగిపోతోంది గనుక ఒకవేళ ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపితే తప్పకుండా ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించి ఉండేది. కానీ పొరపాట్లు చేయడం అలవాటుగా మారినందునేమో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు బదులు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే ఆలోచన ఆయన ఎన్నికలకు ముందు, తెదేపాతో బీజేపీ పొత్తులు ఖరారు కాక ముందు చేసి ఉండి ఉంటే బహుశః నేడు ఆయన పరిస్థితి వేరేలా ఉండేదేమో! ఆ సమయంలో సీమంద్రాలో బీజేపీని నడిపించేందుకు సమర్దుడయిన నాయకుడు లేక అల్లాడుతున్న బీజేపీ, బహుశః ఆయనకే ఆ భాద్యతలు కట్టబెట్టి ఉండేదేమో! అప్పుడు బీజేపీ తెదేపాతో పొత్తుల గురించి ఆలోచించేదే కాదేమో!
సమయం కాని సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో అందెవేసిన కిరణ్, ఇప్పుడు కాంగ్రెస్ కు బదులు బీజేపీలో చేరాలనుకొంటే అది ఆయన రాజకీయ జీవితంలో మరొక ఘోర తప్పిదం అవుతుంది. ఎందువలన అంటే, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన ఆయన, ఇప్పుడు ఇంతవరకు మొహం కూడా చూడని బీజేపీ నేతల క్రింద పనిచేయవలసి ఉంటుంది. ఎన్డీయే భాగస్వామి అయిన చంద్రబాబుతో వినయంగా మెలగ వలసి ఉంటుంది. అయినప్పటికీ ఆయనకీ రాష్ట్రంలో కాని కేంద్రంలో గానీ ఇప్పటికిప్పుడు ఎటువంటి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదు. ఒకవేళ బీజేపీలో చేరితే అందులో ఒక అనామకుడిగా మిగిలిపోవచ్చును. మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో వేచి చూడాలి.




.jpg)

.webp)



